Ahimsa: వారసుల సినిమాల విడుదల కేక్ వాక్ అని చాలామంది భావిస్తుంటారు. కానీ సీత కష్టాలు సీతవి… పీత కష్టాలు పీతవి అని మనవాళ్ళు ఊరికే అనలేదు! లేకపోతే… మూవీ మొఘల్ డి. రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు తనయుడు అభిరామ్ మొదటి సినిమా విడుదలకు ఇంత జాప్యం జరుగుతుందని ఎవరైనా ఊహించారా!? ఈ సినిమా సురేశ్ బాబు నిర్మించకపోయినా… ఆయన మిత్రుడు, సినిమా రంగంలో ఎంతో పేరున్న ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత పి. కిరణ్ నిర్మించారు. ప్రముఖ దర్శకుడు తేజ దీన్ని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా విడుదల తేదీ పలు మార్లు వాయిదా పడి, ఎట్టకేలకు ఇప్పుడు కొత్త డేట్ తో జనం ముందుకు రాబోతోంది.
జూన్ 2న ‘అహింస’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో అభిరామ్ లుక్ ఆకట్టుకుంది. గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అనిల్ అచ్చుగట్ల సంభాషణలు రాయగా, సమీర్ రెడ్డి డీఓపీగా వ్యవహరించారు.