NTV Telugu Site icon

AaluMagalu: నలభై ఐదేళ్ళ ‘ఆలుమగలు’

aalu magalu

aalu magalu

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని పులకింప చేశాయి. ఏయన్నార్ హిట్ పెయిర్ గా వాణిశ్రీ జేజేలు అందుకున్నారు. వారిద్దరూ జోడీగా నటించిన ‘ఆలుమగలు’ చిత్రం కూడా తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా 1977 మార్చి 17న విడుదలయి, విజయఢంకా మోగించింది. అక్కినేనితో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి.సుబ్బారావు ‘ఆలుమగలు’ సినిమాను తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కించారు.

‘ఆలుమగలు’ కథ ఏమిటంటే- భార్యాభర్తల మధ్య ఎంతటి భేదాభిప్రాయాలు వచ్చినా, సర్దుకు పోవాలే కానీ, ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని కాపురాలు కల్లోలం చేసుకోరాదని చాటి చెప్పిన కథ ఇది. జమీందార్ రాజారావును, ఆయన మనవడు గోపిని అన్నపూర్ణ అనే అమ్మాయి ఆదరంగా చూసుకుంటూ ఉంటుంది. పూర్ణ ఓ పేద పంతులు కూతురు. గోపి, పూర్ణ మధ్య ఎంతో చనువు ఉంటుంది. డాక్టర్ అయిన గోపీ ఎంతోమంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు. అయినా గోపీ అంటే పూర్ణకు ప్రేమ. గోపి విదేశాలకు వెళ్ళిన సమయంలో రాజారావు కన్నుమూస్తాడు. తరువాత గోపి, పూర్ణనే పెళ్ళాడవలసి వస్తుంది. పెళ్ళయిన తరువాత ఎంతో అన్యోన్యంగా ఉండే గోపి, పూర్ణ కొన్ని కారణాల వల్ల పంతంతో విడిపోతారు. అయితే దూరమైన తరువాత భార్యాభర్తలకు ఏమి కోల్పోయామో తెలుస్తుంది. గోపి దగ్గర ఓ కొడుకు, పూర్ణ వద్ద మరో అబ్బాయి పెరుగుతారు. వారి పెళ్ళిళ్ళవుతాయి. నవతరం భావాలతో అటు గోపి, ఇటు పూర్ణ కోడళ్ళ కారణంగా బాధ పడతారు. అప్పుడు వారికి జీవితసత్యం తెలిసి వస్తుంది. పెద్దకొడుకు భార్య బంధువులను గోపి మందలించాడని తండ్రిపైనే చేయి ఎత్తుతాడు. ఇక చిన్నకొడుకు భార్యమాటలు విని తల్లిని వదలి వెళతాడు. ఆ సమయంలో భర్త ఇంటిలో ఉంటేనే గౌరవమని భావించిన పూర్ణ, గోపి దగ్గరకు వెళ్తుంది. భార్యకోసం వెళ్ళిన గోపికి ఆమె కొడుకు కారణంగా ఇల్లు వదలి పోయిందని తెలుస్తుంది. అక్కడ పెద్ద కొడుకును తల్లి మందలిస్తుంది. ఇక్కడ చిన్న కొడుకును తండ్రి దండిస్తాడు. గోపి, పూర్ణ పిల్లలు తమ కన్నవారిని క్షమించమని వేడుకుంటారు. గోపి, పూర్ణ ఇద్దరూ ఒకరిని ఒకరు క్షమించమని కోరుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

ఈ చిత్రంలో గుమ్మడి, రాజబాబు, నాగభూషణం, అల్లు రామలింగయ్య, లక్ష్మీకాంత్, నారాయణరావు, సారథి, జయభాస్కర్, కాకరాల, రమాప్రభ, రోజారమణి, విజయలలిత, హలం, సంగీత, అనిత, రాజకుమారి, జయమాలిని నటించిన ఈ చిత్రానికి బాలమురుగన్ కథను సమకూర్చగా, ఆచార్య ఆత్రేయ, జంధ్యాల మాటలు అందించారు. సినారె, వేటూరి, శ్రీశ్రీ పాటలు పలికించారు. తాతినేని చలపతిరావు సంగీతం రూపొందించారు. “ఎరక్క పోయి వచ్చాను…”, “చిగురేసే మొగ్గేసే…”, “ఒక్కరిద్దరుగా మారేది…”, “ర ర రంకె వేసిందమ్మో…”, “పరుగెత్తి పాలు తాగే కంటే…”, “తెలుసుకో ఈ జీవితం…” అంటూ సాగే పాటలు అలరించాయి.

‘ఆత్మీయులు’ చిత్రంలో తొలిసారి ఏయన్నార్, వాణిశ్రీ జంటగా నటించారు. ఆ తరువాత ఏయన్నార్ సూపర్ హిట్స్ “దసరాబుల్లోడు, ప్రేమనగర్, విచిత్రబంధం, బంగారుబాబు” వంటి చిత్రాల్లోనూ వాణిశ్రీయే నాయిక. ‘బంగారుబాబు’ తరువాత ఆ స్థాయి సక్సెస్ అప్పట్లో ఏయన్నార్ కు దక్కలేదు. పైగా 1974లో అనారోగ్యం కారణంగా ఏయన్నార్ ఓ యేడాది విశ్రాంతి తీసుకున్నారు. అందువల్ల 1975లో ఏయన్నార్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఆ తరువాత 1976లో ఏయన్నార్ తొలి చిత్రంగా ‘మహాకవి క్షేత్రయ్య’ వచ్చింది. అది అంతగా ఆకట్టుకోలేక పోయింది. తరువాత వచ్చిన నవలాచిత్రం ‘సెక్రటరీ’ బాగానే అలరించింది. ఆపై ‘మహాత్ముడు, చక్రధారి’ చిత్రాలతో ఏయన్నార్ జనం ముందు నిలచినా, అభిమానులు కోరుకున్న స్థాయిలో అలరించలేక పోయాయి. అప్పుడు 1977లో ఏయన్నార్ రెండో సినిమాగా ‘ఆలుమగలు’ విడుదలయింది. ఏయన్నార్ కు అచ్చివచ్చిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘ఆలుమగలు’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 32 కేంద్రాలలో విడుదలై 23 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం, 15 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. నెల్లూరులో యాభై రోజులయ్యాక ఒక్క ఆటతో వంద రోజులు ఆడింది. అంతకు ముందు ఏయన్నార్ ‘దేవదాసు’ హైదరాబాద్ లో నూన్ షోస్ తో సిల్వర్ జూబ్లీ చూసింది. ఓ కొత్త సినిమా కూడా ఒక్క ఆటతోనూ నూరు రోజులు ప్రదర్శించడం అన్న సంప్రదాయానికి తెరతీసిన చిత్రంగా ‘ఆలుమగలు’ నిలచింది. ఈ చిత్రం షిఫ్ట్ తో రజతోత్సవం చూసింది. ఏమైనా, ‘ఆలుమగలు’ ఏయన్నార్ కు ఓ ఘనవిజయాన్ని అందించి, ఆయన అభిమానులకు ఆనందం పంచింది. ఈ సినిమా తరువాత దీని కన్నా మిన్నయైన సక్సెస్ ‘ప్రేమాభిషేకం’తోనే ఏయన్నార్ కు దక్కింది.