Site icon NTV Telugu

Sitara Ghattamaneni: బ్రేకింగ్.. సితార పేరుతో ఫ్రాడ్.. మాదాపూర్ లో కేసు నమోదు

Sitara

Sitara

Sitara Ghattamaneni: సోషల్ మీడియా వచ్చాకా ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నారు. సోషల్ మీడియా అధికారిక అకౌంట్స్ ను హ్యాక్ చేసి.. కొన్ని లింక్స్ పంపించి వాటిని సెలబ్రిటీలే క్లిక్ చేసుకోమని చెప్పినట్లు చూపించి ప్రజలవద్ద నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇక తాజాగా ఈ కేటుగాళ్లు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటివరకు వచ్చారు. మహేష్ ముద్దుల తనయ సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సితార ఫోటో పెట్టి, ఆమె పేరుతో కొంతమంది కేటుగాళ్లు ఇన్స్టాగ్రామ్ లో ట్రేడింగ్ మరియు పెట్టుబడి లింక్‌లను పంపుతున్నారు. ఇది గమనించిన మహేష్ బాబు కుటుంబం మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఇలాంటి లింక్స్ ఏవి సితార పంపలేదని, ఇలాంటి లింక్స్ ను ఓపెన్ చేయొద్దని టీమ్ GMB ట్విట్టర్ వేదికగా అభిమానులను కోరింది.

“మాదాపూర్ పోలీసులు మరియు టీమ్ GMB చెప్పేది ఏంటంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో సితార ఘట్టమనేని వేషధారణతో కూడిన సైబర్ క్రైమ్ సంఘటన గురించి హెచ్చరిక జారీ చేశారు. గుర్తుతెలియని వినియోగదారుడు ఘట్టమనేని సితార పేరుతో మోసపూరితంగా.. గుర్తుతెలియని వారికి ట్రేడింగ్ మరియు పెట్టుబడి లింక్‌లను పంపుతున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నిరోధించడానికి ఈ కార్యకలాపాలకు కారణమైన వ్యక్తిని గుర్తించి, పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్థిక సలహాలను అడిగేముందు సెలబ్రిటీ ఖాతాల ప్రామాణికతను(బ్లూ టిక్) ధృవీకరించుకోవాలని ప్రజలకు సూచించారు”. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version