నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్. రాజు గత యేడాది ‘డర్టీ హరి’ మూవీతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆ సినిమా విడుదల సమయంలో ఏర్పడిన వివాదంతో వార్తలలో బాగానే నానారు. అదే సమయంలో ఆయన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’ను రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఎం. ఎస్. రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా, మెహర్ చాహల్ (తొలి పరిచయం) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో మరో జంటగా రోహన్, క్రితికా శెట్టిని పరిచయం చేస్తున్నారు. మరో ఇద్దరు అందమైన అమ్మాయిలు సుష్మ, రిషికా బాలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ గోపరాజు రమణ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా గురించి హీరో, నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, “హైదరాబాద్, బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవా పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని షూట్ చేశాం. ‘డర్టీ హరి’ తరువాత మా నాన్న ఎం. ఎస్. రాజు గారి దర్శకత్వంలో రానున్న ఈ యూత్‌ఫుల్ కంటెంట్ సినిమాపై చాలా అంచనాలున్నాయి. పాటలు, నేపథ్య సంగీతం, మునుపెన్నడూ చూడని గోవా అందాలు, ఆద్యంతం నవ్వించే కవ్వించే సన్నివేశాలతో అందరికీ నచ్చే యూత్ ఫుల్ సినిమా ఇది.” అని అన్నారు. ఎం. ఎస్. రాజు మాట్లాడుతూ “ఫైనల్ కాపీ మా చేతిలోకి వచ్చినా, కరోనా థర్డ్ వేవ్ ముందస్తు చర్యలు కారణంగానూ, తెలుగులో పెద్ద సినిమాల విడుదల వల్ల మా మూవీ రిలీజ్ లో కొంత జాప్యం జరిగింది. థియేటర్లలోనే విడుదల చేయాలనే సంకల్పం కారణంగా ఇంతకాలం వేచి ఉన్నాం. ఇప్పుడీ సినిమాను జూన్ 24న రిలీజ్ చేయబోతున్నాం. ఆకట్టుకునే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ తో ఈ చిత్రం కేవలం యూత్ కి మాత్రమే కాక అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. కొత్త కథలతో రావాలన్న నా కోరిక మేరకు ‘డర్టీ హరి’ లాంటి చిత్రం తరువాత ఒక లైట్ హార్టెడ్ ఎంటర్ టైనర్ గా, అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం” అని అన్నారు. ఈ సినిమా ద్వారా సమర్థ్ గొల్లపూడి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే జూన్ 24న ఇప్పటికే ‘సమ్మతమే, గ్యాంగ్ స్టర్ గంగరాజు’తో పాటు మరో మూడు సినిమాలు విడుదల కానున్నాయి.