Aatma Bandhuvu: సారథి సంస్థ భాగ్యనగరంలో ‘శ్రీసారథి స్టూడియోస్’ నిర్మించి, అనేక మహత్తరమైన చిత్రాలను తెరకెక్కించింది. అందులో మహానటుడు యన్.టి.రామారావుతో ఈ సంస్థ రెండు సూపర్ హిట్స్ నిర్మించడం, అవి రెండూ శివాజీగణేశన్ తమిళ చిత్రాలకు రీమేక్ కావడం విశేషం! వాటిలో మొదటిది ‘కలసివుంటే కలదుసుఖం’ కాగా, రెండవది ‘ఆత్మబంధువు’. ఈ రెండు చిత్రాలలోనూ సావిత్రి నాయికగా నటించడం మరో విశేషం! ‘కలసివుంటే కలదు సుఖం’కు తమిళ ఒరిజినల్ ‘భాగ పిరివినై’, ‘ఆత్మబంధువు’కు ‘పడిక్కాద మేధై’ మాతృక. ఈ రెండు చిత్రాలు ఏ.భీమ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కాయి. తెలుగులో ‘కలసివుంటే కలదుసుఖం’కు తాపీ చాణక్య దర్శకత్వం వహించగా, ‘ఆత్మబంధువు’కు మహానటి భానుమతి భర్త పి.రామకృష్ణ నిర్దేశకులు. ‘ఆత్మబంధువు’ చిత్రం 1962 డిసెంబర్ 14న విడుదలై విజయఢంకా మోగించింది.
‘ఆత్మబంధువు’ కథ విషయానికి వస్తే – రావు బహద్దూర్ చంద్రశేఖరం షష్టిపూర్తి ఉత్సవంతో ఈ సినిమా మొదలవుతుంది. ఆయనకు ముగ్గురు కొడుకులు ప్రసాద్ , శ్రీధర్, రఘు. పెద్దకూతురు మంగళాంబ ఐదోతనానికి దూరమై తండ్రి ఇంటనే కొడుకుతో కలసి ఉంటుంది. ఇక చిన్నమ్మాయి గీత. పెద్దబ్బాయిలు ప్రసాద్, శ్రీధర్ తమ భార్యాబిడ్డలతో తండ్రితోనే కలసి ఉంటారు. వీరందరితో పాటు చంద్రశేఖరం చేరదీసిన అనాథ అయిన రంగ కూడా ఉంటాడు. చంద్రశేఖరాన్ని, ఆయన భార్య పార్వతిని మామాఅత్తలుగా భావిస్తూ వారిని దేవతలుగా కొలుస్తుంటాడు రంగ. చిన్న కొడుకు రఘు, జానకి అనే అమ్మాయిని ప్రేమిస్తూంటాడు. చంద్రశేఖరం షష్టిపూర్తికి వచ్చిన ఓ ధనికుడు, గీతను చూసి, ఆమెను తన కొడుకు మధుకు ఇచ్చి పెళ్ళి చేయాలని ఆశిస్తాడు. పార్వతి తన చిన్ననాటి స్నేహితురాలు ప్రభావతి కూతురు లక్ష్మీని తన కోడలుగా చేసుకోవాలని భావిస్తుంది. కానీ, రఘు అందుకు అంగీకరించక పోవడంతో రంగతో లక్ష్మి వివాహం చేయిస్తుంది. రంగ, లక్ష్మి ఇద్దరూ పెళ్ళయ్యాక కూడా రావు బహద్దూర్ ఇంట్లోనే ఉంటారు. అమాయకుడైన రంగ ఇంటిపని చూసుకుంటూ అన్నిటికీ తన అత్తామామలు ఉన్నారనే భరోసాతో జీవిస్తూంటాడు. అతడిని చంద్రశేఖరం కొడుకులు చులకనగా చూస్తూంటారు. అయినా సర్దుకు పోతుంటాడు రంగ. అయితే ఇవన్నీ భార్య లక్ష్మికి బాధ కలిగిస్తూంటాయి. చంద్రశేఖరం వ్యాపారం దెబ్బతినడంతో ఆయన కూతురు గీతను పెళ్ళాడతామన్నవారు కూడా వెనుకడుగు వేస్తారు. దాంతో చంద్రశేఖరం మరింత కుంగిపోతాడు. రంగను ఎలాగైనా ఇంట్లో నుండి పంపిచేస్తే వాడు ఎక్కడైనా ప్రయోజకుడవుతాడని చంద్రశేఖరం భావిస్తాడు. చివరకు అలా చేయవలసీ వస్తుంది. కానీ, అమాయకుడైన రంగడు అపార్థం చేసుకుంటాడు. కొడుకులు, కోడళ్ళు సూటిపోటి మాటలు భరించలేక చంద్రశేఖరం కన్నుమూస్తాడు. కొడుకుల పంచనే ఉన్న పార్వతి కూడా వారి మాటలు భరించలేక పోతూ ఉంటుంది.
రంగ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూంటాడు. అక్కడ యజమాని కొడుకు రఘును ప్రమాదం నుండి రక్షిస్తాడు రంగ. దాంతో ఆ యజమాని వచ్చి రంగను అభినందించబోతాడు. కానీ, అతడే ఒకప్పుడు గీతను కోడలు చేసుకుంటానని చెప్పి మాట తప్పిన వ్యక్తి అని రంగ వెళ్ళిపోతాడు. తన అత్త పార్వతికి ఆరోగ్యం బాగోలేదన్న విషయం తెలిసి ఓ సన్యాసిని వద్దకు వెళతాడు రంగ. ఆమె ఇచ్చిన విభూతిని అత్త నుదుట పెట్టబోతాడు. కానీ, పార్వతి కొడుకులు రంగ దొంగతనం చేయడానికి వచ్చాడని కొడతారు. రంగ వచ్చాడన్న విషయం తెలుసుకున్న పార్వతి వచ్చి, ఇక అక్కడ నుండి వెళ్ళిపోదామని, రంగతోనే ఉంటానని అంటుంది. అదే సమయానికి జప్తులో ఉన్న ఆ ఇంటిని కొని, దానిని రంగ పేరిట రాసి తీసుకు వస్తాడు అతని ఫ్యాక్టరీ యజమాని. డబ్బుకే విలువనిచ్చిన తన పొరపాటు క్షమించమని, తన కొడుకు రఘుకు గీతనిచ్చి పెళ్ళి చేయమని కోరతాడు. ఆ ఇల్లు తనకు వద్దని, ఇది అందరిదీ అని చెప్పి రంగ అంటాడు. అందరూ మళ్ళీ ఒక్కచోటే ఉండడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో యన్.టి.రామారావు, యస్.వి.రంగారావు, రేలంగి, పద్మనాభం, హరనాథ్, డాక్టర్ శివరామకృష్ణయ్య, ఏవీ సుబ్బారావు, వల్లం నరసింహారావు, రామకోటి, రాజబాబు, సావిత్రి, కన్నాంబ, సూర్యకాంతం, గిరిజ, రీటా, సురభి బాలసరస్వతి, శారద, మీనా కుమారి, మోహన, ప్రభావతి, ఝాన్సీరాణి ముఖ్య పాత్రధారులు. తరువాతి రోజుల్లో ‘శంకరాభరణం’ వంటి కళాఖండాన్ని నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు ఇందులో యస్వీఆర్ రెండో కొడుకుగా నటించడం విశేషం.
సముద్రాల జూనియర్ మాటలు రాసిన ఈ చిత్రానికి సి.నారాయణ రెడ్డి, సముద్రాల సీనియర్, కొసరాజు, శ్రీశ్రీ పాటలు పలికించారు. తమిళంలో సంగీతం సమకూర్చిన కేవీ మహదేవన్ తెలుగులోనూ స్వరకల్పన చేశారు. సముద్రాల సీనియర్ రాసిన “ఎవ్వరో ఏ ఊరో…ఎవ్వరు కన్నారో…” అంటూ సాగే పాట, “దక్కెనులే నాకు నీ సొగసు…” అంటూ శ్రీశ్రీ పలికించిన పాట, కొసరాజు కలం నుండి జాలువారిన “చీరకట్టి సింగారించి…”, “మారదు మారదు…” అంటూ సాగే పాటలు, సినారె పలికించిన “చదువురానివాడవని దిగులు చెందకు…”, “తీయని ఊహలు…” అంటూ మొదలయ్యే పాటలు జనాన్ని ఆకట్టుకున్నాయి. అన్నిటినీ మించి ‘ఆత్మబంధువు’ సినిమా పేరు వినగానే గుర్తుకు వచ్చే పాట ఏదంటే – సినారె కలం అక్షర రూపమిచ్చిన “అనగనగా ఒక రాజు… అనగనగా ఒకరాణి…” అంటూ మొదలయ్యే పాటనే అని చెప్పక తప్పదు.
అపర శ్రీకృష్ణునిగా తెరపై వెలిగిన యన్టీఆర్, పౌరాణికాల్లోనే కాకుండా కొన్ని జానపద, సాంఘిక చిత్రాల్లోనూ కృష్ణుని గెటప్ లో కనిపించి అలరించారు. అదే తీరున ‘ఆత్మబంధువు’లో “ఎవ్వరో ఏ ఊరో..” అంటూ సాగే పాటలో యన్టీఆర్ కాసేపు శ్రీకృష్ణుని గెటప్ లో కనిపించి మురిపించారు. ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచి అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. షిఫ్ట్ మీద రజతోత్సవం చూసిందీ చిత్రం. 1962వ సంవత్సరం యన్టీఆర్ కు ఎంతగానో కలసి వచ్చిందని చెప్పవచ్చు. ఆ యేడాది యన్టీఆర్ హీరోగా రూపొందిన పది చిత్రాలు విడుదల కాగా, వాటిలో “గులేబకావళి కథ, భీష్మ, గుండమ్మ కథ, మహామంత్రి తిమ్మరుసు, రక్తసంబంధం, ఆత్మబంధువు” చిత్రాలు విజయభేరీ మోగించాయి. విశేషమేమంటే – ‘రక్తసంబంధం’లో అన్నాచెల్లెళ్ళుగా నటించిన యన్టీఆర్, సావిత్రి ఆ సినిమా విడుదలైన 43 రోజులకు వచ్చిన ‘ఆత్మబంధువు’లో నాయకానాయికలుగా నటించి అలరించారు. అంతకు ముందు వచ్చిన ‘గుండమ్మకథ’లోనూ వారిద్దరూ జంటగా కనిపించారు. ఈ మూడు చిత్రాలు సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ఈ అరుదైన రికార్డు యన్టీఆర్, సావిత్రికి మాత్రమే సొంతమని చెప్పవచ్చు.
‘ఆత్మబంధువు’ చిత్రానికి ‘పడిక్కాద మేధై’ తమిళ సినిమా ఆధారమే అయినా, దానికి మాతృక బెంగాలీ నవల ‘జోగ్ బియోగ్’ ఆధారంగా అదే టైటిల్ తో 1953లో తెరకెక్కిన బెంగాలీ సినిమా. తెలుగులో ఘనవిజయం సాధించిన తరువాత ఈ కథను 1967లో ఏవీయమ్ సంస్థ భీమ్ సింగ్ దర్శకత్వంలోనే హిందీలో ‘మెహర్బాన్’ పేరుతో రీమేక్ చేసింది. సునీల్ దత్, నూతన్ జంటగా నటించిన ‘మెహర్బాన్’ అలరించింది. 1971లో ఇదే కథను కన్నడలో రాజ్ కుమార్, జయంతి జంటగా పేకేటి శివరామ్ ‘బాళ బంధన’ పేరుతో రీమేక్ చేయగా అక్కడ ఆకట్టుకోలేక పోవడం గమనార్హం! ఎందుకంటే, కన్నడ సీమలోనూ యన్టీఆర్ ‘ఆత్మబంధువు’ అప్పటికే జయకేతనం ఎగురవేసింది. దాంతో ‘బాళ బంధన’ పరాజయం పాలయింది. రిపీట్ రన్స్ లోనూ ‘ఆత్మబంధువు’ విశేషాదరణ చూరగొంది. తరువాతి రోజుల్లో శివాజీగణేశన్ హీరోగా భారతీరాజా తమిళంలో ‘ముదల్ మరియాదై’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాను తెలుగులో ‘ఆత్మబంధువు’ పేరుతోనే అనువదించడం గమనార్హం. దాదాపుగా యన్టీఆర్ ‘ఆత్మబంధువు’ ఇతివృత్తంతో ఆయన నటవారసుడు బాలకృష్ణ నటించిన ‘రాము’ చిత్రం రూపొంది ఘనవిజయం సాధించడం మరింత విశేషం.
(డిసెంబర్ 14న ‘ఆత్మబంధువు’కు 60 ఏళ్ళు)