(ఆగస్టు 25తో ‘శ్రీకృష్ణతులాభారము’కు 55 ఏళ్ళు పూర్తి)
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు పేరు వినగానే ముందుగా ఆయన ధరించిన పురాణపురుషుల పాత్రలే గుర్తుకు వస్తాయి. వాటిలో యన్టీఆర్ పోషించిన శ్రీకృష్ణ పాత్ర అన్నిటికన్నా ముందుగా స్ఫురిస్తుంది. శ్రీకృష్ణ పాత్రలో దాదాపు పాతిక సార్లు తెరపై కనిపించిన ఘనత యన్టీఆర్ సొంతం. 55 ఏళ్ళ క్రితం నవరసాలనూ ఒలికిస్తూ యన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రను అభినయించిన ‘శ్రీకృష్ణతులాభారము’ చిత్రం జనాన్ని విశేషంగా అలరించింది. అంతకు ముందు యన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు-భీముడు’ చిత్రాన్ని నిర్మించిన డి.రామానాయుడు ఈ ‘శ్రీకృష్ణతులాభారము’ను కూడా తమ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ‘రాముడు-భీముడు’లో ఓ నాయికగా నటించిన జమున ఇందులోనూ ప్రధాన భూమిక అయిన సత్యభామ పాత్రను పోషించారు. ఇక ‘రాముడు-భీముడు’లో మరో నాయికగా అభినయించిన ఎల్.విజయలక్ష్మి ఈ చిత్రంలో కేవలం ఓ పాటలో నర్తించడానికే పరిమితమయ్యారు.
ఈ ‘తులాభారము’కు ముందు…
అంతకు ముందు 1935లో సి.పుల్లయ్య దర్శకత్వంలో ‘శ్రీకృష్ణతులాభారం’ రూపొందింది. ఈ సినిమా 1935 జనవరి 1న విడుదలయింది. ఇందులో కపిలవాయి రామనాథ శాస్త్రి, కాంచనమాల, లక్ష్మీరాజ్యం, రేలంగి, ఋష్యేంద్రమణి ఇందులో నటించారు. రేలంగికి ఇది తొలి చిత్రం కాగా, ఋష్యేంద్రమణి ఇందులో సత్యభామ పాత్ర పోషించారు. తరువాత రెండు దశాబ్దాలకు సి.పుల్లయ్య తనయుడు సి.ఎస్.రావు దర్శకత్వంలో కన్నాంబ, కడారు నాగభూషణం ‘శ్రీకృష్ణతులాభారం’ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఈలపాట రఘురామయ్య శ్రీకృష్ణ పాత్రధారి కాగా ఎస్.వరలక్ష్మి సత్యభామగా నటించారు. సి.ఎస్.రావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రంగా ‘శ్రీకృష్ణతులాభారం’ నిలచింది. 1955 డిసెంబర్ 3న ఈ చిత్రం విడుదలై, శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా వందరోజుల వేడుకను విజయవాడ వినోదా టాకీసులో 1956 మార్చి 17న నిర్వహించారు. తరువాత దాదాపు పదేళ్ళకు యన్టీఆర్ శ్రీకృష్ణునిగా ‘శ్రీకృష్ణతులాభారము’ చిత్రాన్ని కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించారు. ఈ చిత్రం 1966 ఆగస్టు 25న విడుదలయింది. ఈ సినిమా కూడా శతదినోత్సవాలు చూసింది.
అదే కథ…
నిజానికి భాగవతంలో ‘పారిజాతాపహరణం’ అన్న ఘట్టం ఉంది. కానీ, ‘శ్రీకృష్ణతులాభారము’ అన్నది కానరాదు. కృష్ణదేవరాయల ఆస్థాన కవి నంది తిమ్మన తన ‘పారిజాతాపహరణం’ను రక్తి కట్టించారు. దానిని ఆధారం చేసుకొని పలు గాథలు అల్లుకుపోయి, చివరకు శ్రీకృష్ణతులాభారం వెలసింది. దానిని ముత్తరాజు సుబ్బారావు నాటకంగా మలిచారు. ఈ నాటకంలో పద్యాలను ఆయనే పలికించారు. కొన్ని పాటలను చందాల కేశవదాసు రాశారు. మన తొలి తెలుగు చిత్రం ‘భక్త ప్రహ్లాద’కు ఈ చందాల కేశవదాసు గీతరచయిత. అలా మన తొలి గీతరచయితగా చందాల కేశవదాసు నిలచిపోయారు.
ఇక కథ విషయానికి వస్తే – నరకాసుర వధ తరువాత విజయంతో ద్వారకకు వచ్చిన శ్రీకృష్ణసత్యభామలకు జనం స్వాగతం పలకడంతో కథ మొదలవుతుంది. నరకాసుర వధలో తాను కీలక పాత్ర పోషించానని, ఆ విజయం తన వల్లే శ్రీకృష్ణునికి లభించిందని సత్యభామ గర్వంతో నిండి ఉండడం మొదటి సన్నివేశంలోనే కనిపిస్తుంది. తరువాత పారిజాతాపహరణం, ఆ పైన స్వామిని తన కొంగున కట్టేసుకోవడానికి సత్యభామ, నారద ప్రోత్సాహంతో పుణ్యక వ్రతం అనే పతిప్రణయ సిద్ధి వ్రతంను ఆచరిస్తుంది. తరువాత వ్రతంలో భాగంగా పతిని నారదునికి దానం చేస్తుంది. శ్రీకృష్ణుని తులదూచే ధనమిచ్చి, తిరిగి పొందాలని చూస్తుంది. చివరకు స్వామి వారి బరువుకు తగ్గ బంగారం, ధనేతరములు ఏవీ సత్యభామ వద్ద దొరకవు. దాంతో శ్రీకృష్ణుని నారదుడు అంగడి వీధిలో పెట్టి అమ్మ చూపుతాడు. అది తెలిసిన కృష్ణుని ఇతర పత్నులు వచ్చి ఆరడి చేస్తారు. రుక్మిణీదేవి మాత్రం తన పతిని ధ్యానిస్తూ గృహంలోనే ఉంటారు. శ్రీకృష్ణుని తిరిగి పొందే మార్గాన్ని నారదుడే సత్యభామకు ఉపదేశిస్తాడు. భక్తితో తనను తూచగల శక్తి రుక్మిణికి మాత్రమే ఉందని శ్రీకృష్ణులవారు కూడా సెలవిస్తారు. దాంతో ఆమె వెళ్ళి తన తప్పు తెలుసుకొని, రుక్మిణికి విషయం చెబుతుంది. ఆమె వచ్చి ఒకే ఒక్క తులసీదళంతో శ్రీకృష్ణుని తులాభారంలో తూచగలుగుతుంది. కృష్ణ పరమాత్మ భక్తికి దాసుడు అన్న సత్యాన్ని జగతికి చాటడానికే ఈ నాటకం సాగిందని తేలుతుంది. సత్యభామ గర్వం నశించి, ఆమె కూడా కృష్ణభక్తినే ఆశ్రయిస్తానంటుంది. దాంతో కథ సుఖాంతమవుతుంది.
ఎక్కడ పుట్టిందో?…
ఎవరి మదిలో ఈ తలంపు పుట్టిందో కానీ, నిజానికి భాగవతంలో ఈ కథ లేదు. ఎందువల్లనంటే శ్రీకృష్ణ పరమాత్మ తన యోగమాయతో తన అష్టమహిషులతో పాటు, పదహారు వేలమంది పడతులతోనూ సంసారం సాగించినట్టుగా భాగవతం చెబుతోంది. అందువల్ల శ్రీకృష్ణుడు, సత్యభామ వద్ద ఉండడు అన్న మాటకు తావేలేదు. ఇక సత్యభామ స్వామి తన కొంగుననే ఉండాలని కోరుకోవడం ఉండదు కదా! అయిననేమి, ఈ శ్రీకృష్ణతులాభారం కథ విశేషాదరణ చూరగొంది.
నటనావైభవం…
శ్రీకృష్ణునిగా యన్టీఆర్, సత్యభామగా జమున, రుక్మిణిగా అంజలీదేవి, నారదునిగా కాంతారావు జీవించారనే చెప్పాలి. కృష్ణ పాత్ర అన్నది రామారావుకు కొట్టిన పిండి, అయినా ఇందులో ఆయన ప్రదర్శించిన వైవిధ్యం మరపురానిది. ఇందులో కృష్ణకుమారి, యస్.వరలక్ష్మి, రాజనాల, పద్మనాభం, వాణిశ్రీ, ఋష్యేంద్రమణి, నిర్మల, మీనా కుమారి, అనూరాధ, లక్ష్మి, విజయలలిత, విజయశ్రీ, విజయరాణి, జయంతి, మిక్కిలినేని తదితరులు నటించారు. తొలి ‘శ్రీకృష్ణతులాభారం’లో సత్యభామగా నటించిన ఋష్యేంద్రమణి ఇందులో ఇంద్రుని తల్లి అదితిగా కనిపించారు. రెండో ‘శ్రీకృష్ణతులాభారం’లో సత్యభామగా అభినయించిన ఎస్.వరలక్ష్మి ఈ చిత్రంలో ఇంద్రుని భార్య శచీదేవిగా నటించడం విశేషం.
1935లో వచ్చిన ‘శ్రీకృష్ణతులాభారం’లోనూ, 1955లో రూపొందిన ‘శ్రీకృష్ణతులాభారం’లోనూ నటగాయకులైన రామనాథ శాస్త్రి, కళ్యాణం రఘురామయ్య నటించారు. ముఖ్యంగా రఘురామయ్య గళంలో జాలువారిన పద్యాలు ఎల్పీ రికార్డుల రూపంలో తెలుగునేలపై విశేషాదరణ చూరగొన్నాయి. ఈ నేపథ్యంలో నటునిగా యన్టీఆర్ కు, గాయకునిగా ఘంటసాలకు ‘శ్రీకృష్ణతులాభారము’ ఓ సవాల్ గా నిలచింది. ఇద్దరూ తమదైన ప్రతిభను చాటుకుంటూ ముందువారిని మరిపించారనే చెప్పాలి.
పాటల పర్వం…
సముద్రాల రచన ఈ చిత్రానికి ఓ మసకబారని శోభను కొనితెచ్చింది. , అప్పటికే తెలుగునేలపై విశేషాదరణ పొందిన చందాల కేశవదాసు రాసిన “భలేమంచి చౌకబేరము…” పాటను తీసుకున్నారు. మిగిలిన వాటిలో ప్రఖ్యాతి గాంచిన శ్రీకృష్ణరాయభారం నాటకంలోని ముత్తరాజు సుబ్బారావు రాసిన పద్యాలను, కొన్ని సముద్రాల రాసిన పద్యాలు ఉన్నాయి. సముద్రాల, శ్రీశ్రీ,, కొసరాజు, దాశరథి, ఆరుద్ర పాటలు పలికించారు. పెండ్యాల సంగీతం సమకూర్చారు. “మీరజాలగలడా…నా యానతి…” పాటను స్థానం నరసింహారావు స్వయంగా రాసి, సత్యభామ వేషం కట్టి మరీ అభినయించారని చెబుతారు. ఆ పాట కూడా ఇందులో చోటు చేసుకుంది.
శ్రీశ్రీ రచించిన “ఓహో…మోహనరూపా… కేళీ కలాపా…” పాట మురిపిస్తుంది. దాశరథి పలికించిన “ఓ చెలీ… కోపమా.. అంతలో తాపమా…” ఈ పాట కాగానే ‘పారిజాతాపహరణం’లోని నంది తిమ్మన రాసిన “నను భవదీయ దాసుని…” పద్యం రావడం సందర్భోచితంగా ఉంటుంది. ఇక ఇదే పద్యానికి యన్టీఆర్ అంతకు ముందు కేవీ రెడ్డి తెరకెక్కించిన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లోనూ అభినయించడం విశేషం. కాగా, ఈ రెండు పద్యాలను ఘంటసాల మాస్టారు, పెండ్యాల స్వరకల్పనలోనే గానం చేయడం మరింత విశేషం. “కరుణించవే తులసి మాతా…”, “మీరజాలగలడా నా యానతి…”, “కొనుమిదే కుసుమాంజలి…”, “జయము జయము…”, “ఎందుకే నా మీద ఇంత కోపం…” వంటి పాటలు కూడా చిత్రంలో అలరించేలా రూపొందాయి.
మరికొన్ని…
అంతకు ముందు యన్టీఆర్ ను ‘రాముడు-భీముడు’లో ద్విపాత్రాభినయంలో చూపించిన అన్నయ్య కెమెరా పనితనం ఈ సినిమాలోనూ కనువిందు చేసింది. జి.వి.ఆర్.శేషగిరిరావు, కె.బాపయ్య ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్స్ గా పనిచేశారు. తరువాత వీరిద్దరూ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రాలతోనే దర్శకులుగా పరిచయం అయ్యారు. ‘పాపకోసం’తో శేషగిరిరావు, ‘ద్రోహి’తో బాపయ్యను దర్శకులుగా పరిచయం చేశారు డి.రామానాయుడు.
ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని డి.రామానాయుడు అత్యంత భారీగా నిర్మించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన పదహారు రోజులకే యన్టీఆర్ ‘పిడుగు రాముడు’ విడుదలయింది. ఆ సినిమా మ్యూజికల్ హిట్ గా జనాన్ని అలరించింది. దాంతో ‘శ్రీకృష్ణతులాభారము’ రన్నింగ్ లో కొంత మెత్త పడిందని చెప్పక తప్పదు. ఇక రిపీట్ రన్స్ లో ‘శ్రీకృష్ణతులాభారము’ వసూళ్ళ వర్షం కురిపించింది.