నటశేఖర కృష్ణ నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రం తెలుగు సినిమా రంగానికి కౌబోయ్ మూవీస్ ను పరిచయం చేసింది. ఆ సినిమా విజయంతో కృష్ణ మాస్ హీరోగా జనం మదిలో నిలిచారు. ఆ తరువాత కృష్ణ హీరోగా అనేక కౌబోయ్ తరహా చిత్రాలు రూపొందాయి. అయితే ఏవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్థాయి విజయాన్ని చవిచూడలేదు. కానీ, కృష్ణ అభిమానగణాలు పెరగడానికి ఈ తరహా చిత్రాలు దోహదపడ్డాయి. అలాంటి వాటిలో ‘మావూరి మొనగాళ్ళు’ కూడా చోటు చేసుకుంది. ఈ చిత్రం 1972 మే 5న ప్రేక్షకులను పలకరించింది.
నిజం చెప్పాలంటే ఈ సినిమాకు హాలీవుడ్ వెస్ట్రన్ మూవీ ‘మేగ్నిఫిషియెంట్ సెవెన్’ స్ఫూర్తి అనవచ్చు. ఆ సినిమాకు అకిరా కురసోవా తెరకెక్కించిన ‘సెవెన్ సమురై’ ప్రేరణ అని హాలీవుడ్ జనమే గౌరవంగా ప్రకటించుకున్నారు. ఓ ఊరు దొంగల బెడదతో సతమతమవుతూ ఉంటుంది. ఆ ఊరికి వెళ్ళిన కొందరు మిత్రులకు అక్కడి జనం పరిస్థితి జాలి గొలుపుతుంది. అక్కడే ఉండి. ఆ దొంగల ముఠా భరతం పడతారు. ఆ ప్రయత్నంలో మిత్రుల్లో ఒకరు కన్నుమూస్తారు. దాంతో ఆ ముఠాలోని అందరినీ మిగిలిన వారు భూస్థాపితం చేస్తారు. ఆ ఊరి జనం తమ కష్టాలను తీర్చిన వారిని ఎంతగానో అభినందిస్తారు.
ఇలాంటి కథలు అంతకు ముందు, ఆ తరువాత కూడా బోలెడు వెలుగు చూశాయి. ఇందులో కృష్ణ, విజయలలిత, జ్యోతిలక్ష్మి, విజయ్ చందర్, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, మిక్కిలినేని, జూనియర్ కాంచన, జూనియర్ భానుమతి, లక్ష్మీకాంతమ్మ, జయకుమారి నటించారు. ఈ చిత్రానికి వీటూరి కథ అందించగా, సత్యం సంగీతం సమకూర్చారు. కొసరాజు, వీటూరి, దాశరథి పాటలు పలికించారు. ఇందులోని “అరె పోబే పోజుగాడా…”, “అరె వారేవా అరె జారేజా…”, “పెగ్గు వేసుకో నిగ్గు చూసుకో…”, “వెలిగించు క్రాంతి జ్యోతి…”, “హై నా జిలిబిలి తళుకుల…” అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని సూర్యరాజ్ పిక్చర్స్ పతాకంపై కె.ఎమ్. నాయుడు, చుండ్రు సూర్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ రెడ్డి దర్శకత్వం వహించారు. రంగుల్లో అలరించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’, ‘మొనగాడొస్తున్నాడు జాగ్రత్త’ వంటి కౌబోయ్ మూవీస్ చూసిన జనానికి ‘మా వూరి మొనగాళ్ళు’ బ్లాక్ అండ్ వైట్ లో కంటికి ఆనలేదనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ సినిమా కూడా కృష్ణ ఫైట్స్ ను ఆ రోజుల్లో అభిమానించిన వారికి ఆనందం పంచిందనే చెప్పాలి.