Vichitra Bandham: తెలుగు చిత్రసీమలో అనేక నిర్మాణ సంస్థలు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్రవేశాయి. దుక్కిపాటి మధుసూదనరావు నెలకొల్పిన ‘అన్నపూర్ణ’ సంస్థ అలా జనం మనసు దోచిన సంస్థనే! ఈ సంస్థలో నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన అనేక చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. 1971లో ఏయన్నార్ తొలిసారి ‘దసరాబుల్లోడు’తో స్వర్ణోత్సవం చూశారు. దాంతో అక్కినేని అభిమానుల ఆనందం అంబరమంటింది. ఆ యేడాది నవలా చిత్రం ‘ప్రేమనగర్’ సైతం మంచి విజయం సాధించింది. ఇలా రెండు ఘనవిజయాలతో అలరించిన అక్కినేని మరుసటి సంవత్సరం కూడా మురిపించారు. 1972లో ఏయన్నార్ నటించిన సినిమాల్లో నవలా చిత్రం ‘విచిత్రబంధం’ ఘనవిజయం సాధించింది. ఆ యేడాది అక్టోబర్ 17న విజయదశమి వచ్చింది. దసరా కానుకగా ‘విచిత్ర బంధం’ చిత్రాన్ని 1972 అక్టోబర్ 12న విడుదల చేశారు.
‘విచిత్రబంధం’ కథ ఏమిటంటే – మాధవ్, సంధ్య ఒకే కాలేజ్ లో చదువుకుంటూ ఉంటారు. సంధ్యకు ధన అహంకారం. ఓ సారి మాధవ్ మిత్రుణ్ణి సంధ్య అవమానిస్తుంది. అందుకు ప్రతిగా మాధవ్ ఆమెను అందరి ముందు హేళన చేస్తాడు. అది మనసులో పెట్టుకొని మాధవ్ ను మెల్లగా ప్రేమలోకి దించుతుంది సంధ్య. మాధవ్ ఆమె మనసు మారింది, అదంతా నిజమైన ప్రేమ అనే భ్రమిస్తాడు. ఆమె కూడా అతణ్ణి అవమానిస్తుంది. దాంతో తిక్కరేగిన మాధవ్ ఆమె ఎత్తుకు పై ఎత్తు వేయాలని కారు డ్రైవర్ గా మారు వేషం వేసుకొని, ఆమెను ఎత్తుకు పోతాడు. అక్కడా అనుకోని పరిస్థితుల్లో ఆమె శీలాన్ని దోచుకుంటాడు మాధవ్. తన తప్పు తెలుసుకుని సంధ్యను క్షమాపణ కోరతాడు. పెళ్ళాడతానంటాడు. నీతో తాళి కట్టించుకోవడం కన్నా ఉరేసుకోవడం మేలని చీదరిస్తుంది. ఆమె మనసు మార్చాలని మాధవ్ పలు విధాలా ప్రయత్నించి విఫలమవుతాడు. అదే సమయంలో సంధ్య తండ్రిని మిత్రులే మోసం చేస్తారు. సంధ్య గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలిసి ఆమె తండ్రి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఆ లోగా అతడిని ఓ రౌడీ వచ్చి చంపేస్తాడు. తండ్రి మరణవార్త విని పరుగుతీస్తూ వస్తున్న సంధ్య తమ్ముడు అవిటివాడవుతాడు. వారి ఆస్తులన్నీ పోతాయి. సంధ్య ఓ బాబుకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను అనాథ శరణాలయంలో వదలి వెళ్తుంది సంధ్య అత్త. సంధ్యకు బిడ్డ చనిపోయాడని ఆమె అత్త చెబుతుంది. మాధవ్ మనసు బాగోలేక విదేశాలకు వెళ్ళి చదువుకుంటాడు. వచ్చాక కూడా సంధ్యను పెళ్ళాడతాననే చెబుతాడు. వారి కుటుంబానికి ఆదరువుగా ఉంటాడు. అయినా మాధవ్ ను సంధ్య అసహ్యించుకుంటూనే ఉంటుంది. అనాథగా ఉన్న తన బాబును తీసుకు వస్తాడు. ఆ బాబు సంధ్యను ‘అమ్మా’ అంటూ పిలుస్తుంటాడు. ఆమె లేకుండా బాబు ఉండలేని పరిస్థితి వస్తుంది. అయినా మాధవ్ అంటే సంధ్యకు అయిష్టమే! దాంతో ఆమెకు దూరంగా విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు మాధవ్. చివరగా సంధ్యకు ఉత్తరం రాస్తూ, అందులో బాబు ఆమె సొంత కొడుకు అన్న విషయం చెబుతాడు మాధవ్.
మాధవ్ తన ఆస్తి మొత్తం బాబుకు, సంధ్యకు రాస్తాడు. అది తెలిసిన సంధ్య తండ్రిని మోసం చేసిన అహోబిలరావు ఆ ఆస్తిని తనకు రాసివ్వమని, లేదంటే బాబు ప్రాణాలు తీస్తానని సంధ్యను బెదిరిస్తాడు. విదేశాలకు వెళ్ళాలనుకున్న మాధవ్ కు బాబు పరిస్థితి బాగోలేదని తెలిసి వెనక్కి వస్తాడు. అహోబిలరావును పోలీసులకు అప్ప చెబుతాడు మాధవ్. బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని సంధ్యను తీసుకువెళతాడు. సంధ్య పిలుపుతో బాబు కోలుకుంటాడు. సంధ్య, మాధవ్ ఒక్కటవుతారు. మళ్ళీ వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరియడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో ఏయన్నార్, వాణిశ్రీ జంటగా నటించగా, మిగిలిన పాత్రల్లో యస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్య, గుమ్మడి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు, భానుప్రకాశ్, రామమోహన్, అంజలీదేవి, సూర్యకాంతం, రమాప్రభ, రాధాకుమారి, లీలా రాణి, వై.విజయ, మాస్టర్ ఆదినారాయణ, మాస్టర్ రమేశ్ నటించారు. యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘విజేత’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి చిత్రానుకరణ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు సమకూర్చారు. ఆచార్య ఆత్రేయ సంభాషణలు పలికించారు. ఆత్రేయ, దాశరథి, కొసరాజు పాటలు రాశారు. ఈ చిత్రంతోనే ప్రముఖ గాయకుడు రామకృష్ణ పరిచయం అయ్యారు. రామకృష్ణ పాడిన తొలి గీతం “చిక్కావుచేతిలో చిలకమ్మా..” అన్నది ఆ రోజుల్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులోని “చీకటి వెలుగుల రంగేళి..”, “అందమైన జీవితమూ..”, “చల్లని బాబూ..”, “అమ్మా అమ్మా అని పిలిచావు..”, “వయసే ఒక పూలతోట..” అంటూ సాగే పాటలూ అలరించాయి.
‘విచిత్రబంధం’ సినిమా మంచి విజయం సాధించి, ఆ యేడాది విడుదలైన బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలచింది. ఈ చిత్రం రజతోత్సవం జరుపుకుంది. ఆ రోజుల్లో అక్కినేని, వాణిశ్రీ జంటకు విశేషమైన ఆదరణ ఉండేది. దాంతో ఈ సినిమాలో వారిద్దరి పేర్లు టైటిల్ కార్డ్స్ లో ఒకేసారి ప్రకటించడం విశేషం! ‘ప్రేమనగర్, విచిత్రబంధం’ చిత్రాలలో వాణిశ్రీ ధరించిన చీరలు అప్పట్లో మహిళలకు ఎంతో ముచ్చట గొలిపాయి. షో రూమ్స్ లో అదేపనిగా ‘వాణిశ్రీ శారీస్’ అని చెబుతూ చీరలు అమ్మేవారు. “విచిత్రబంధంలో వాణిశ్రీ కట్టిన చీరలు” అంటూ కూడా చీరలు అమ్మడంలో ప్రచార పర్వం సాగింది.