సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోనే స్పెషల్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఆ సినిమా విడుదలై ఆగస్ట్ 27తో యాభై సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భీమవరంలోని కృష్ణ- మహేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్వర్ణోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ”నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటరుగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చలనచిత్ర చరిత్ర పుటలలో కృష్ణ చిరస్థాయిగా నిలిచార’ని అన్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక, కౌబోయ్, జేమ్స్ బాండ్ చిత్రాలలో నటించి మెప్పించిన ఏకైక హీరో కృష్ణ అని చెప్పారు. తెలుగు చలన చిత్ర గతిని మార్చిన హీరో కృష్ణ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యిచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గజల్ శ్రీనివాస్ కోరారు.
కృష్ణ ఫాన్స్ గౌరవాధ్యక్షులు రాయప్రోలు శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ ‘ఇండియన్ సిరీస్ పై మొదటి కౌబాయ్ చిత్రంగా, పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రం ఏడు భాషలలో డబ్ చేయబడి 125 దేశాలలో ప్రదర్శింపబడింద’ని అన్నారు. చైతన్య భారతి అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో 50 కేజీల కేకును కట్ చేశారు. కృష్ణ అభిమానులుగా దశాబ్దాల పాటు అభిమాన సంఘాన్ని నడిపి, రంగస్థల నటులుగా పేరెన్నికగన్న మహ్మద్ ఖాజావలి, మానాపురం సత్యనారాయణ, పులఖండం ఉగాది లకు సూపర్ స్టార్ కృష్ణ అవార్డ్స్ అందజేశారు.