Site icon NTV Telugu

Krishnarjunulu: 40 ఏళ్ల కిందటే టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీ

ప్రస్తుతం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’పైనే సినీ అభిమానుల్లో చర్చ సాగుతోంది. దాదాపు 36 ఏళ్ళ తరువాత వచ్చిన అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇదే కావడంతో ఆ చర్చ మరింతగా మురిపిస్తోంది. ఈ మధ్య వచ్చిన మల్టీస్టారర్స్ లో ఓ సీనియర్ స్టార్ తో తరువాతి తరం స్టార్ హీరో నటించారు తప్ప, సమకాలికులు, సమ ఉజ్జీలయిన స్టార్స్ కలసి నటించలేదు. అది రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’తోనే సాధ్యమైంది. ఇందులో నవతరం అగ్రకథానాయకులైన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు అంటే యన్టీఆర్-ఏయన్నార్ కలసి నటించిన కాలంలోనూ, ఆ తరువాత శోభన్ బాబు- కృష్ణ కలసి సాగిన రోజుల్లోనూ మల్టీస్టారర్స్ కు అంతటి క్రేజ్ ఉండేది. యన్టీఆర్, ఏయన్నార్ కలసి 14 చిత్రాలలో నటించారు. ఓ చిత్రంలో ఇద్దరూ గెస్ట్ రోల్స్ ధరించారు. అలా 15 చిత్రాలలో కనిపించి, ఆ మహానటులు ఓ చెరిగిపోని రికార్డ్ సృష్టించారు. వారి తరువాత మల్టీస్టారర్స్ తో సాగిన శోభన్ – కృష్ణ సైతం అలాగే అలరించారు. శోభన్ బాబు, కృష్ణ హీరోలుగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘కృష్ణార్జునులు’ 1982 మార్చి 26న విడుదలయింది. ప్రముఖ మేకప్ మేన్ జయకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శోభన్ జోడీగా జయప్రద, కృష్ణ సరసన శ్రీదేవి నాయికలుగా నటించారు

‘కృష్ణార్జునులు’ టైటిల్ ను బట్టే, ఇందులో కొన్ని పురాణగాథల పోకడలు ఉంటాయని ఇట్టే తెలిసిపోతుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఇది మోడరన్ కృష్ణార్జున యుద్ధం అని చెప్పవచ్చు. అర్జున్ దొంగగా జీవిస్తుంటాడు. అతని అసిస్టెంట్ కొట్టేసిన పెట్టెలో తన మిత్రుడు కృష్ణ వివరాలు తెలుస్తాయి. కృష్ణను తన దగ్గరకు తీసుకు వచ్చి ఆశ్రయమిస్తాడు అర్జున్. కృష్ణ చెల్లెలు అర్జున్ ను ప్రేమిస్తుంది. అర్జున్ స్మగుల్డ్ గూడ్స్ అమ్ముతూ ఉంటాడని తెలుసుకున్న కృష్ణ అతణ్ణి నిలదీస్తాడు. నిజాయితీగా బతకమంటాడు. కృష్ణ మంచితనం చూసి, ఓ ధనవంతుని కూతురు ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ఆమెను తన కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలనుకున్న ధనవంతుని మిత్రుడు పగపడతాడు. ధనవంతుని అల్లుడైన కృష్ణ బలహీనులు ఖాళీ చేసిన స్థలంలో అపార్ట్ మెంట్స్ కట్టిస్తాడు. తన తల్లి మరణం తరువాత మారిన అర్జున్ మంచి మార్గంలో నడవాలనుకుంటాడు. కృష్ణ కట్టించే అపార్ట్ మెంట్స్ వెనుక పేదవారి ఆవేదన ఉందని అంటాడు అర్జున్. దాంతో వారి మధ్య విభేదాలు తలెత్తుతాయి. కృష్ణ చెల్లిని అర్జున్‌ పెళ్ళి చేసుకుంటాడు. చివరకు కార్మికుల పక్షం నిలుస్తాడు అర్జున్. ఉన్నవారి కొమ్ము కాస్తాడు కృష్ణ. కొట్టుకుంటారు. ఓ వ్యక్తి ద్వారా తమ మధ్య వైరానికి అసలు కారణం తెలుసుకొని, వారిని చితక బాదుతారు కృష్ణార్జునులు. కలతలు తొలగి అందరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

ఇందులో సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, పుష్పలత, కె.విజయ, నారాయణ మూర్తి, కె.కె.శర్మ, ప్రసాద్ బాబు నటించారు. ఈ చిత్రానికి వేటూరి, సినారె, దాసరి పాటలు రాశారు. సత్యం సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దాసరి నారాయణరావు అందించారు. ఇందులోని “కృష్ణార్జునులం… మేమే కృష్ణార్జునులం…”, “బంగారు పాల పిచ్చుక…”, “ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు…”, “సుందర బృందావనిలో…”, “మంచుకొండల్లోన ఎండకాసినట్టు…” అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి.

అప్పట్లో సమకాలికులైన టాప్ స్టార్స్ తో తెరకెక్కించే మల్టీస్టారర్స్ లో అదే పనిగా కొన్ని లెక్కలు వేసుకొని మరీ సినిమాలు తీసేవారు. ఇద్దరికీ సమానమైన పాత్రలు, ఇక పాటల విషయంలోనూ, కాస్ట్యూమ్స్ విషయంలోనూ సమానత్వం పాటించేవారు. ఫైట్స్ లోనూ అతనో దెబ్బ కొడితే, ఇతనో దెబ్బ కొట్టేలా ప్లాన్ చేసేవారు. ఇప్పుడు వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. నలభై ఏళ్ళ క్రితం అలా లెక్కలు కట్టి వచ్చిన సినిమా ‘కృష్ణార్జునులు’. ఇందులో కాస్ట్యూమ్స్ పరంగా శోభన్ బాబుది పైచేయి. దాంతో కృష్ణ పాటలను కాశ్మీర్ లో చిత్రీకరించారు. ఇక టైటిల్స్ లోనూ శోభన్ బాబు పేరు ఎడమవైపు అంటే ముందు కనిపించేలా చేసి, కృష్ణ పేరును కుడివైపున కాసింత పైన వేయడం విశేషం! అలాగే జయప్రద, శ్రీదేవి పేర్లు, ఇతర ప్రధాన నటుల పేర్లు ప్రకటించారు.

డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విజయవాడలో నిర్మించిన ‘రాజ్-యువరాజ్’ థియేటర్ లో ఓపెనింగ్ మూవీగా ‘కృష్ణార్జునులు’ విడుదలయింది. రాజ్ లో ఓ ఇంగ్లిష్ చిత్రం ప్రదర్శించగా, యువరాజ్ లో ఈ సినిమానే తొలి చిత్రం. గుంటూరు స్వామి థియేటర్ లోనూ ఇదే ప్రారంభ చిత్రం కావడం విశేషం. ఇక శ్రీదేవి తన ముక్కును ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తరువాత నటించిన తొలి తెలుగు చిత్రమిదే. ఆ రోజుల్లో శ్రీదేవి ముక్కు మార్పును చూసి అభిమానులు తల్లడిల్లి పోయారు. ‘కృష్ణార్జునులు’ మంచి ఓపెనింగ్స్ చూసింది.

(మార్చి 26న ‘కృష్ణార్జునులు’కు 40 ఏళ్ళు)

Exit mobile version