(డిసెంబర్ 24న ‘కిరాయి రౌడీలు’కు 40 ఏళ్ళు)
మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు హీరోలుగా నటించిన ‘కిరాయి రౌడీలు’ చిత్రం డిసెంబర్ 24తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. శ్రీక్రాంతి చిత్ర పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో టి.క్రాంతికుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో చిరంజీవికి జోడీగా రాధిక నటించారు. 1981 డిసెంబర్ 24న ‘కిరాయిరౌడీలు’ విడుదలయింది. అంతకు ముందు అదే సంవత్సరంలో క్రాంతికుమార్ నిర్మించిన ‘న్యాయం కావాలి’లో చిరంజీవి, కోదండరామిరెడ్డి తొలిసారి కలసి పనిచేశారు. వారిద్దరి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం ‘కిరాయి రౌడీలు’. ఆ యేడాది చిరంజీవి కొన్ని సినిమాల్లో విలన్ గానూ, నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లోనూ కనిపించారు. ఈ చిత్రానికి ముందు వచ్చిన ‘చట్టానికి కళ్ళులేవు’ చిరంజీవికి యాక్షన్ హీరోగా ఇమేజ్ సంపాదించి పెట్టింది. ఈ ‘కిరాయి రౌడీలు’ ఆ ఇమేజ్ ను మరింత పెంచింది.
చలపతి, బాబూరావు, శివయ్య ముగ్గురూ మంచి మిత్రులు. చలపతికి ఓ కొడుకు, కూతురు ఉంటారు. బాబూరావుకు ఓ ,కూతురు, శివయ్యకు ఓ కొడుకు ఉంటారు. ఈ ముగ్గురు మిత్రులకు ఓ సారి యాక్సిడెంట్ కు గురైన ఓ వ్యక్తి తారసపడతాడు. అతనికి కట్లు కడతారు. అతను బ్యాంక్ దోపీడీ చేసిన దొంగ అని తెలుస్తుంది. అతని దగ్గర ఉన్న సొమ్మును ముగ్గురూ సమానంగా పంచుకోవాలని చూస్తారు. అయితే మిత్రులకు వాటా ఇవ్వవలసి వస్తుందని భావించిన బాబూరావు వారిని మట్టు పెడతాడు. చలపతి కొడుకు కోటిగాడు ఓ కిరాయి రౌడీ. అతనితో బాబూరావు నానా గొడవలు చేయించి, డబ్బులు ఇస్తూంటాడు. కోటిగాడికి ఓ చెల్లెలు. ఆమె అంధురాలు. చెల్లెలంటే కోటిగాడికి ప్రాణం. బాబూరావు కూతురు జ్యోతి. ఆమె అంటే అతనికి పంచప్రాణాలు. ఆమె రాజాను ప్రేమిస్తుంది. ఇతను శివయ్య కొడుకు. జ్యోతిని వదలివెళ్ళేందుకు రాజాపైకి కోటిగాడిని ప్రయోగిస్తాడు బాబూరావు. శివయ్య కొడుకు రాజా అని తెలుస్తుంది బాబూరావుకు.
ఓ సారి కోటిగాడు తాను చెప్పిన పని చేయలేదని పగబట్టి, అతని చెల్లెలును మానభంగం చేస్తాడు బాబూరావు. అది చనిపోయాడనుకున్న శివయ్య చూస్తాడు. ఆ విషయం కోటిగాడికి చెబుతాడు. శివయ్య, కోటిగాడు కలసి జ్యోతిని కిడ్నాప్ చేస్తారు. ఆమెను వెదుక్కుంటూ రాజా వెళతాడు. అయితే జ్యోతిని కోటిగాడు చెల్లెల్లా చూస్తాడు. ఆ విషయం రాజాకు తెలుస్తుంది. రౌడీలను వేసుకువచ్చి, తన బిడ్డను కిడ్నాప్ చేశాడని కోటిగాడిని కాలుస్తాడు బాబూరావు. రాజా వాణ్ణి చితకబాదుతాడు. కానీ, జ్యోతి తాను బాబూరావు కూతురుగా పుట్టడమే నేరంగా భావిస్తుంది. ఆ ఆలోచనను బాబూరావు భరించలేడు. చివరి సారి తనను ‘డాడీ’ అంటూ పిలవమని కోరతాడు. అందుకు జ్యోతి అంగీకరించదు. బాబూరావు చచ్చిపోతాడు. అప్పుడు కూతురు డాడీ అంటూ పిలుస్తుంది. కొరప్రాణాలతో ఉన్న కోటిగాడు, జ్యోతిలో తన చెల్లెలిని చూసుకుంటూ రాజా, అతని తల్లి, శివయ్య సమక్షంలో కన్నుమూయడంతో కథ ముగుస్తుంది.
మోహన్ బాబు, రాధిక, రావుగోపాలరావు, ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, సువర్ణ, వనిత, అత్తిలి లక్ష్మి, జగ్గారావు, మల్లికార్జునరావు నటించారు. వీరి పేర్లయిన తరువాత Above All Our చిరంజీవి అంటూ టైటిల్ కార్డ్స్ లో కనిపిస్తుంది. అలా క్రాంతికుమార్, చిరంజీవిపై తనకున్న అభిమానం చాటుకున్నారు. ఈ చిత్రానికి రచన సత్యానంద్, పాటలు వేటూరి, చక్రవర్తి సంగీతం సమకూర్చారు. “ఈడు ఉన్న ఆడపిల్ల లేడిపిల్లా…”, “ఆ దైవమే నా అన్నగా… ఈ దీపమే నా కన్నుగా…”, “ఓ కొంటె కోణింగి… సరసాల సంపంగి…”, “పంగ నామాలు పెట్టుకో… వంగి దండాలు పెట్టుకో…” వంటి పాటలు అలరించాయి. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది. ఈ చిత్రం తరువాత చిరంజీవి, మోహన్ బాబు కలసి “పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా-రంగా” చిత్రాల్లోనూ హీరోలుగా నటించి అలరించారు. ఆ తరువాత చాలా రోజులకు మళ్ళీ వారిద్దరూ కలసి ‘చక్రవర్తి’లో హీరోలుగా నటించారు. మధ్యలో చిరంజీవి హీరోగా, మోహన్ బాబు విలన్ గా కొన్ని సినిమాలు సందడి చేశాయి. ఈ చిత్రం తరువాత చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబో సక్సెస్ రూటులో సాగింది.