40 Years Of Oath: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అని టైటిల్ కార్డ్స్ లో పడితే, ఓ ప్రముఖ గీత రచయిత ‘విశ్వమంటే ఆంధ్రప్రదేశా?’ అని ఎద్దేవా చేశారట. కానీ ఎన్టీఆర్‌ను ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ అని అభినందించింది సర్వసంగ పరిత్యాగులు ఓ పీఠాధిపతులు. వారి వాక్కు పొల్లుపోలేదు. సరిగా 40 ఏళ్ళ క్రితం జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1983 జనవరి 9వ తేదీన అశేషజనవాహిని ముందు లాల్ బహదూర్ స్టేడియంలో ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం జరిగింది.
అప్పటికి ఎన్టీఆర్ తన ‘తెలుగుదేశం’ పార్టీని నెలకొల్పి, కేవలం తొమ్మిది నెలలే అయింది. అంత తక్కువ వ్యవధిలో ఆ నాడు దక్షిణభారతంలోనే అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఓ నటుడు ముఖ్యమంత్రి కావడం అన్నది నిజంగా ‘ప్రపంచ చరిత్రలో ఓ చెరిగిపోని తరిగిపోని’ రికార్డే. అందునా తొలిసారి పార్టీ పెట్టి 200 పైగా సీట్లు సాధించడం అన్నదీ ఓ చరిత్రే. అలాంటి చరిత్రను లిఖించిన ఘనత నందమూరి తారక రామారావుది. సినిమాల్లో ఆయనను ‘విశ్వవిఖ్యాత’ అని సంబోధించడాన్ని అపహాస్యం చేసిన వారే తరువాతి రోజుల్లో ‘ఔరా… ఇది కదా అసలైన తెలుగుతేజం’ అంటూ కీర్తించారు. అదీ ఎన్టీఆర్ మహోన్నత ఘనత.
ఏ ముహూర్తాన 1983 జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారో కానీ, ఆయన పరిపాలనాదక్షత, ప్రవేశపెట్టిన పథకాలు, ప్రవర్తించిన తీరు అన్నీ ఈ నాటికీ జనం గుర్తు చేసుకొని జేజేలు పలుకుతూనే ఉన్నారు. అంతేకాదు, ఆ తరువాత వరుసగా మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అరుదైన అవకాశం కూడా ఒక్క ఎన్టీఆర్‌కే దక్కేలా సాగింది. 1984 ఆగస్టు 15న ఆయనను బర్తరఫ్ చేసి, నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేలా అప్పటి గవర్నర్ రామ్ లాల్ సాహసం చేశారు. కానీ, ఆ రోజున రామ్ లాల్ కు బహుశా తెలియదేమో, ఆపై ఆయన ఓ చరిత్ర హీనునిగా నిలిచిపోతారని. ఆ సమయంలో ఎన్టీఆర్ గుండెకు అమెరికాలో శస్త్ర చికిత్స జరిగినా, తన వెన్నుపోటుకు తిరగుబాటుగా ప్రజాబలంతో పోరాటం సాగించారు.
కేవలం నెలరోజుల వ్యవధిలో నాదెండ్లను గద్దె నుండి దింపి, 1984 సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రిగా మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు ఎన్టీఆర్. ఆ పై పార్టీ పిరాయింపు బిల్లుకు ఓ ప్రాణం రావడానికి కృషి చేసిన వారిలో ఎన్టీఆర్‌ది ప్రముఖ పాత్ర. 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశమంతటా కాంగ్రెస్ వైపు సానుభూతి పవనాలు వీచి, ఆ పార్టీకి నాలుగువందలకు పైగా ఎంపీ సీట్లు లభించాయి. అదో రికార్డ్. అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ 33 స్థానాలకు పోటీ చేసి, 30 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. అప్పట్లో ధీరవీర కాంగ్రెస్ పార్టీకి ఈ 30 సీట్ల ఎంపీలే ప్రతిపక్షంగా వ్యవహరించడం దేశ రాజకీయ చరిత్రలోనే ఈ నాటికీ ఓ అరుదైన అంశంగానే నిలచింది.
ఆ తరువాత ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి, 1985లో మార్చిలో ఎన్నికలకు వెళ్ళారు. మళ్ళీ 200కు పైగా సీట్లు సాధించి మార్చి 9న మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలా వరుసగా 1983, 1984, 1985 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఘనత కూడా తెలుగునాట ఒక్క ఎన్టీఆర్‌కే దక్కింది. 1989 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో యన్టీఆర్ కేవలం 73 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష నాయకునిగా నిలిచారు. అయితే, అప్పట్లో నాలుగువందలకు పైగా సీట్లు సాధించి, రికార్డు సృష్టించిన రాజీవ్ గాంధీ హయాములోని కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడంలో ‘నేషనల్ ఫ్రంట్’ ఛైర్మన్ గానూ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. ప్రతిపక్షంలో ఉన్నా తనదైన బాణీ పలికించారు రామారావు. 1994 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ 220కి పైగా సీట్లు సాధించారు. యన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన ప్రతీసారి 200కు పైగా సీట్లు సాధించడం విశేషం. ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా 1994 డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఆయన చివరగా ప్రమాణం చేయడం. ఇలాంటి అరుదైన చరిత్రను సొంతం చేసుకున్న ‘అన్న’ ఎన్టీఆర్‌ను ఆయన శతజయంతి సంవత్సరం సందర్భంగా స్మరించుకోవడం సముచితం.
(ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేసి 40 ఏళ్లు)