(జనవరి 4న హిట్లర్
కు పాతికేళ్ళు)
విజయాల చుట్టూ జనం పరిభ్రమిస్తూ ఉంటారు. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవిని వరుస పరాజయాలు పలకరించాయి. ఆ సమయంలో ఆయన కథలపై దృష్టిని సారించారు. ఓ మంచి కథతో మళ్ళీ జనాన్ని పలకరించాలని ఆశించారు. ఆ నేపథ్యంలో మమ్ముట్టి హీరోగా మళయాళంలో రూపొంది విజయం సాధించిన హిట్లర్
ఆయన దృష్టిని ఆకర్షించింది. దానిని రీమేక్ చేస్తూ మళ్ళీ జనాన్ని ఆకట్టుకోవాలని ఆశించారు. ఆ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ఎడిటర్ మోహన్ తీసుకున్నారు. ఆయన వేరే హీరోతో ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. కానీ, చిరంజీవి ఈ సినిమా తనకు నచ్చిందని, ఆ చిత్రం చేయాలని ఉందన్న అభిలాష వ్యక్తం చేశారు. కోరుకోకుండానే చిరంజీవి వంటి మెగాస్టార్ తనకు కాల్ షీట్స్ ఇచ్చే ఛాన్స్ ఎడిటర్ మోహన్ కు దక్కింది. అలా మొదలైన హిట్లర్
, చిరంజీవి కోరుకున్న తీరునే ఆయనకు ఘనవిజయాన్ని అందించింది. 1997 జనవరి 4న సంక్రాంతి సందడిలో హిట్లర్
పాలుపంచుకుంది.
హిట్లర్
కథ విషయానికి వస్తే – అన్న
అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఓ అన్నయ్య, అతని ఏడుగురు చెల్లెళ్ల కథ ఇది. మాధవరావు ఓ రైస్ మిల్లు ఓనర్. అతనికి ఐదుగురు చెల్లెళ్ళు. చిన్నప్పుడే తల్లి చనిపోగా,తండ్రి జైలు పాలవుతాడు. ఆ సమయంలో తానే అమ్మా,నాన్న అయి చెల్లెళ్ళను పోషించి, పెద్ద చేస్తాడు. ఐదుగురు చెల్లెళ్ళు వయసులో ఉన్న కన్నెపిల్లలు. వారిపై ఎవరి చూపు పడ్డా, వారి వీపు విమానం మోత మోగిస్తూ ఉంటాడు మాధవరావు. అందువల్ల ఊళ్ళో అందరూ అతణ్ని హిట్లర్
అంటూ పిలుస్తూంటారు. అతని తండ్రికి మరో భార్య ద్వారా ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. ఆ తండ్రి మాత్రం తన పిల్లలను చూసుకోవాలని వస్తూంటాడు. హిట్లర్, అతని చెల్లెళ్ళు అతణ్ణి అసహ్యించుకుంటూనే ఉంటారు. మాధవకు ఓ మేనమామ. అతని కొడుకు బాలు, హిట్లర్ రెండో చెల్లెలిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు.
బాలు చెల్లెలు బుజ్జికి మాధవ అంటే ప్రాణం. ఎప్పుడు హిట్లర్ చెల్లెళ్ళ పెళ్ళవుతుందా, ఎప్పుడు తనను పెళ్ళాడతాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది. పెద్ద చెల్లెలి ఓ మాస్టర్ ను పెళ్ళాడుతుంది. ఇక ముగ్గురు చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేయాలని భావిస్తాడు మాధవ. అదే సమయంలో తండ్రి చనిపోయే స్థితిలో ఉండడంతో వెళ్ళి చూస్తాడు. తండ్రికి తమ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటాడు. తండ్రి మరణంతో మరో ఇద్దరు చెల్లెళ్ళు కూడా తోడవుతారు. మొదట్లో ఆ ఇద్దరినీ, మిగిలిన చెల్లెళ్ళు సరిగా చూసుకోరు. దాంతో హిట్లర్ మందలిస్తాడు. అన్నపై అలిగిన చెల్లెళ్లు ఇంట్లోంచి వెళ్ళి పోతారు. అదే సమయంలో హిట్లర్ జీవితంలోకి రుద్రరాజు, అతని సోదరులు ప్రవేశిస్తారు. అడుగడుగున అతణ్ణి తొక్కేయాలను కుంటారు. చివరకు హిట్లర్ మామ కూడా వారికే వంత పాడతాడు. అయితే మామ తప్పు తెలుసుకుంటాడు. హిట్లర్ వెళ్ళి రుద్రరాజును, అతని తమ్ముళ్ళకు దేహశుద్ధి చేసి మామను, అతని కూతురు బుజ్జిని, చెల్లెళ్ళను విడిపించుకు వస్తాడు. చెల్లెళ్ళు తమ తప్పు క్షమించమని అన్నయ్యను అడుగుతారు. తరువాత తాను ఎక్కడికో వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకుంటాడు. తన చెల్లెళ్ళ బాధ్యతను బాలుకు అప్పగిస్తాడు. తన చెల్లెలి బుజ్జి పరిస్థితి ఏంటని బాలు అడుగుతాడు. అయినా, వెళ్ళి పోతున్న హిట్లర్ ను ఎలా తీసుకురావాలో తెలిసిన బుజ్జి ఓ ఈల వేస్తుంది. దాంతో కుర్రాళ్ళు తన చెల్లెళ్ళను చూసి ఈల వేశారనుకున్న హిట్లర్ తన ప్రయాణం ఆపుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో మాధవరావు పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు. ఆయన చెల్లెళ్ళుగా అశ్వినీ,మోహినీ, పద్మశ్రీ,గాయత్రి మీనా కుమారి నటించగా, బాలుగా రాజేంద్రప్రసాద్, బుజ్జిగా రంభ కనిపించారు. మిగిలిన పాత్రల్లో రాజాకృష్ణమూర్తి, రామిరెడ్డి, ప్రకాశ్ రాజ్, పొన్నాంబళం, బ్రహ్మానందం, బాబూమోహన్, సుధాకర్, అలీ నటించారు. అంతకు ముందు ఎడిటర్ మోహన్ నిర్మించిన మామగారు
చిత్రంలో టైటిల్ రోల్ పోషించి, ఉత్తమ నటునిగా నంది అవార్డు సంపాదించిన దాసరి నారాయణరావు, ఇందులో హిట్లర్ తండ్రి పాత్ర పోషించారు.
ఈ చిత్రానికి కోటి స్వరకల్పన ప్రాణం పోసింది. నడక కలసిన నవరాత్రి...
, మిసమిస మెరుపుల మెహబూబా...
, ఓ కాలమా...
, కన్నీళ్ళకే కన్నీళ్ళు...
, కూసింది కన్నెకోయిల...
, ప్రేమా జోహార్...
పాటలు అలరించాయి. ఈ పాటలు వేటూరి, సీతారామశాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్ రాశారు. ఈ చిత్రానికి ఎల్.బి.శ్రీరామ్ రాసిన మాటలు ఆకట్టుకున్నాయి. ఇందులోని అంతొద్దు.. . ఇది చాలు...
అనే డైలాగ్ పాపులర్ అయింది. 1997 సంక్రాంతికి వచ్చిన చిత్రాలలో ఎక్కువ కేంద్రాలలో శతదినోత్సవం చూసిన సినిమాగా హిట్లర్
నిలచింది. ఈ సినిమా శతదినోత్సవాన్ని ఒంగోలులో జరిపారు. తరువాత తమిళంలో ఈ సినిమాను టైగర్
పేరుతో డబ్ చేశారు.