కరోనా ఫస్ట్ వేవ్ తో గత యేడాది, సెకండ్ వేవ్ తో ఈ సంవత్సరం సినిమా రంగానికి గట్టి పరీక్షనే పెట్టాయి. అయితే… యువ కథానాయకులు మాత్రం ఏదో ఒక స్థాయిలో బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతారని అంతా అనుకున్నారు. కానీ తెలుగు ప్రేక్షకుల అంచనాలను తల్లకిందులు చూస్తే, మన యంగ్ హీరోస్ ఈ యేడాది భారీ పరాజయాలను తమ ఖాతాలో జమ చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ మూవీ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంక్రాంతి సీజన్ సైతం ఏమంతగా కలిసిరాలేదు.
ఇక ‘అల్లరి’ నరేశ్ ‘బంగారు బుల్లోడు’ జనవరిలోనే విడుదలై పరాజయం పాలైంది. పాత కథ, కథనాల కారణంగా ఏ రీతిలోనూ ఈ సినిమా జనాన్ని మెప్పించలేకపోయింది. అయితే నరేశ్ నటించిన మరో సినిమా ‘నాంది’ విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. ఇక సుమంత్ నటించి కన్నడ రీమేక్ ‘కపటధారి’ భారీ విజయాన్ని కాకపోయినా మేడరేట్ సక్సెస్ అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలను సైతం మూవీ చేరుకోలేకపోయింది. అలానే నాగార్జున మరో మేనల్లుడు సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీలో నటించాడు. ఇదీ విజయం సాధించలేదు.
ఈ యేడాది నితిన్ సైతం తన అభిమానులను తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. అతని ‘ఇష్క్, రంగ్ దే’ చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. హిందీ చిత్రం ‘అంథాధున్’కు రీమేక్ గా తెలుగులో రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది కానీ ఎలాంటి చలనాన్నీ వీక్షకులలో కలిగించలేదు. అలానే యువ కథానాయకుడు, ఈ యేడాది ఓ ఇంటివాడైన కార్తికేయ నటించిన రెండు సినిమాలూ అతని అభిమానులను నిరుత్సాహ పరిచాయి. భారీ అంచనాలతో వచ్చిన ‘చావు కబురు చల్లగా’నే కాదు ఈ యేడాది చివరలో వచ్చిన ‘రాజా విక్రమార్క’ సైతం పరాజయం పాలైంది. యంగ్ హీరో సందీప్ కిషన్ కు కథానాయకుడిగా, నిర్మాతగా కూడా ఈ యేడాది కలిసిరాలేదు. అతను నటించి నిర్మించిన చిత్రాలు ‘ఎ1ఎక్స్ ప్రెస్, వివాహ భోజనంబు’; అలానే ‘గల్లీ రౌడీ’ ఫ్లాప్ అయ్యాయి.శర్వానంద్ కూ ఈ యేడాది చేదు అనుభవమే ఎదురైంది. అతని ‘శ్రీకారం’తో పాటు ఈ యేడాది వచ్చిన మరో సినిమా ‘మహా సముద్రం’ జనాన్ని మెప్పించలేకపోయింది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణు… ఆర్టిస్ట్ గా మాత్రం ‘మోసగాళ్ళ’తో విజయం పొందలేకపోయాడు. యంగ్ హీరో శ్రీవిష్ణుకు ఈ యేడాది మిశ్రమ స్పందనే లభించిందని చెప్పాలి. అతని చిత్రాలు ‘గాలి సంపత్, రాజరాజచోర’ విడుదల అయ్యాయి. ఇందులో మొదటి సినిమా అట్లర్ ఫ్లాప్ అయితే, రెండు సినిమా ఫర్వాలేదనిపించింది. ఇక మూడో సినిమా డిసెంబర్ 31న రాబోతున్న ‘అర్జున ఫల్గుణ’ ఎలా ఉంటుందో చూడాలి. ఈ యేడాది చేదు అనుభవం పొందిన వారిలో సత్యదేవ్ సైతం ఉన్నాడు. నటుడిగా ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు పొందుతున్న ఈ యంగ్ హీరో నటించిన కన్నడ రీమేక్ ‘తిమ్మరుసు’, ‘స్కైలాబ్’ చిత్రాలు ఆడలేదు. విశ్వక్ సేన్ ఈ యేడాది కేవలం ‘పాగల్’ మూవీలో మాత్రమే నటించాడు. అది కూడా విజయం సాధించలేదు.
నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ‘101 జిల్లాల అందగాడు’ ప్రేక్షకులను మెప్పించలేదు. తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్న కీరవాణి రెండో కుమారుడు శ్రీసింహా నటించిన ‘తెల్లవారితే గురువారం’ ఫ్లాప్ అయ్యింది. రానా పాన్ ఇండియా మూవీ ‘అరణ్య’కూ ఎలాంటి స్పందన జనం నుండి లభించలేదు. నాగశౌర్య ‘వరుడు కావలెను’ ఫర్వాలేదనిపించినా, ‘లక్ష్య’ లక్ష్యాన్ని చేరలేదు.
ఈ యేడాది ప్రేక్షకులను నిరాశకు గురిచేసిన వారిలో ఆది సాయికుమార్ (శశి), సాయిధరమ్ తేజ్ (రిపబ్లిక్), గోపీచంద్ (ఆరడుగుల బుల్లెట్), సుధీర్ బాబు (శ్రీదేవి సోడా సెంటర్), ఆనంద్ దేవరకొండ (పుష్పక విమానం), ఆకాశ్ పురి (రొమాంటిక్) ఉన్నారు. మరో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘జాంబిరెడ్డి’ కమర్షియల్ సక్సెస్ సాధించింది. అయితే తర్వాత వచ్చిన ‘ఇష్క్, అద్బుతం’తో అతను జనాలను మెప్పించలేకపోయాడు. తొలి చిత్రం ‘ఉప్పెన’తో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ భారీ ప్లాప్ ను ‘కొండపొలం’తో తన ఖాతాలో వేసుకున్నాడు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన శ్రీకాంత్ తనయుడు రోషన్ మూవీ ‘పెళ్ళిసందడి’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడీ చేయలేకపోయింది. రాజ్ తరుణ్ నటించిన ‘పవర్ ప్లే, అనుభవించు రాజా’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. నాని నటించిన ‘టక్ జగదీశ్’ ఓటీటీలో విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’కు మంచి పేరే వస్తోంది. యువ కథానాయకుల చిత్రాల పనితీరు ఇలా ఉంటే… సీనియర్ స్టార్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ భారీ పరాజయం పాలైంది. అలానే జగపతిబాబు కీలక పాత్ర పోషించిన ‘ఎఫ్.సి.యు.కె.’మూవీనీ ఎవరూ పట్టించుకోలేదు.