NTV Telugu Site icon

20 ఏళ్ల ‘క‌భీ ఖుషి క‌భీ ఘ‌మ్`

(డిసెంబ‌ర్ 14తో ‘క‌భీ ఖుషి క‌భీ ఘ‌మ్’ 20 ఏళ్ళు)
అమితాబ్ బ‌చ్చన్, ఆయ‌న భార్య జ‌య‌బాధురి నిజ‌జీవితంలోని పాత్రలను పోషిస్తూ న‌టించిన చిత్రం 'క‌భీ ఖుషి క‌భీ ఘ‌మ్'. ఇందులో షారుఖ్ ఖాన్, హృతిక్ రోష‌న్ వారి కుమారులుగా న‌టించారు. ఈ ఇద్దరు హీరోల‌కు కాజోల్, క‌రీనా క‌పూర్ జంట‌గా క‌నిపించారు. బంధాలు-అనుబంధాల‌తో రూపొందించిన ‘క‌భీ ఖుషి క‌భీ ఘ‌మ్’ ప్రేక్షకులను భ‌లేగా ఆక‌ట్టుకుంది. 2001 డిసెంబ‌ర్ 14న ఈ చిత్రం విడుద‌లై విశేషాద‌ర‌ణ చూర‌గొంది.

ఇక 'క‌భీ ఖుషి క‌భీ ఘ‌మ్' క‌థ విష‌యానికి వ‌స్తే… కోటీశ్వరుడైన య‌శ్వర్థన్ రాయ్ చంద్ కు ఇద్దరు కొడుకులు రాహుల్, రోహ‌న్. ఆయ‌న భార్య నందినికి పిల్లలంటే ప్రాణం. రాహుల్ ను పుట్టిన‌ప్పుడే తీసుకొని వ‌చ్చి పెంచుకుంటారు ఈ దంప‌తులు. వారింటిలోని అంద‌రికీ ఈ విష‌యం తెలుసు. ఒక్క రోహ‌న్ కు తెలియ‌దు. య‌శ్ రాయ్ చంద్ సంప్ర‌దాయానికి పెద్ద పీట వేస్తూంటాడు. పేద‌వారంటే ఆయ‌న‌కు లోలోప‌ల చుల‌క‌న భావం. అయితే దానిని క‌నిపించ‌నీయ‌డు. ఆయ‌న భార్య నందిని మాత్రం అంద‌రినీ స‌మానంగా చూస్తుంటుంది. రాహుల్ కు త‌న మిత్రుని కూతురుతో పెళ్లి చేయాల‌నుకుంటాడు య‌శ్. కానీ, త‌న ఇంటిలో ప‌నిచేసే ఆయా ఇంట పెళ్లికి వెళ్ళిన రాహుల్ అక్క‌డ ఓ అమ్మాయిని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. ఆ అమ్మాయి అంజ‌లీశ‌ర్మ‌. ఆమెకు తండ్రి, ఓ చెల్లి పూజ ఉంటారు. అంజ‌లి కూడా రాహుల్ ను ఇష్ట‌ప‌డుతుంది. తండ్రికి ఈ విష‌యం చెబుతాడు. ఆయ‌న అంగీక‌రించ‌డు. అంజ‌లికి ఈ విష‌యం చెప్పాలని వ‌చ్చిన రాహుల్ కు ఆమె తండ్రి మ‌ర‌ణించి ఉండ‌డం చూస్తాడు. దాంతో ఆ విష‌యం చెప్ప‌లేడు. రాహుల్ తండ్రి కాద‌న్నా, అంజ‌లీని పెళ్ళాడ‌తాడు. అది య‌శ్ రాయ్ కు న‌చ్చ‌దు. దాంతో భార్య‌ను, మ‌ర‌ద‌లిని తీసుకొని లండ‌న్ వెళ్తాడు. వారితో పాటు వెళ్ల‌మ‌ని, ఆయ‌మ్మ‌ను కూడా పంపిస్తుంది త‌ల్లి నందిని.

Read Also: ‘పుష్ప’ మాస్ ట్రీట్… ఇంటర్వెల్‌కు ముందే సమంత ఐటమ్ సాంగ్?

బోర్డింగ్ స్కూల్ నుండి ప‌దేళ్ల త‌రువాత వ‌చ్చిన రోహ‌న్ కు అన్న క‌నిపించ‌క పోవ‌డంతో ఇంట్లో ఉన్న ముస‌ల‌మ్మ‌ల‌ను అడుగుతాడు. వారిద్వారా అస‌లు విష‌యం తెలుసుకొని, తాను ఎలాగైనా అన్న‌ను, నాన్న‌ను క‌ల‌పాల‌ని నిశ్చ‌యించుకుంటాడు. చ‌దువు నిమిత్తం తాను లండ‌న్ వెళ్తాన‌ని చెబుతాడు. య‌శ్ రాయ్ అంగీకారంతో వెళ్ళిన రోహ‌న్, అన్నావ‌దిన‌ల ఇంట్లోనే పేయింగ్ గెస్టుగా చేర‌తాడు. అందుకు పూజ కూడా స‌హ‌క‌రిస్తుంది. కొన్నాళ్ళ‌కు రోహ‌న్ త‌న త‌మ్ముడేన‌ని రాహుల్ తెలుసుకుంటాడు. త‌న త‌ల్లిదండ్రుల‌ను ఇండియా నుండి పిలిపిస్తాడు రోహ‌న్. రాహుల్ ను చూశాక రాయ్ మ‌ళ్ళీ భీష్మించుకుంటాడు. అదే స‌మ‌యంలో త‌ల్లి మ‌ర‌ణించింద‌న్న వార్త వ‌స్తుంది. ఇండియాకు వెళ్తారు. రాహుల్ కోసం ఎదురుచూస్తారు. ఇక ఎవ‌రితోనూ అవ‌స‌రం లేద‌ని, చితికి నిప్పు పెట్టే స‌మ‌యంలో రాహుల్ కూడా వ‌చ్చి, చేయి క‌లిపి చితికి నిప్పు పెడ‌తాడు.

త‌రువాత త‌న పెద్ద‌కొడుకు మ‌ళ్ళీ లండ‌న్ వెళ్ళే ప్ర‌య‌త్నంలో భ‌ర్త‌ను నిల‌దీస్తుంది నందిని. తండ్రి మ‌న‌సు మార్చాల‌ని త‌పిస్తాడు రోహ‌న్. చివ‌ర‌కు తండ్రి వ‌ద్ద‌కు ఒక‌సారి పోయి, వెళ్తున్నాన‌ని చెప్ప‌మ‌ని తల్లి కోరుతుంది. అప్పుడే తండ్రి క‌ళ్ళ‌లో నీళ్ళు చూస్తాడు రాహుల్. చివ‌ర‌కు తండ్రీకొడుకులు క‌లుసుకుంటారు. కొడుకును, కోడ‌లిని ఆద‌రిస్తాడు య‌శ్ రాయ్. రోహ‌న్ కు,పూజ‌కు పెళ్ళి చేయ‌డంతో క‌థ ముగుస్తుంది.

ఇలాంటి క‌థ‌లు బోలెడు వ‌చ్చాయి. అయితే ఈ పాత‌క‌థ‌ను సైతం ర‌క్తి క‌ట్టించేలా న‌డిపాడు ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్. ఈ చిత్రాన్ని య‌శ్ జోహార్ త‌మ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నిర్మించారు. క‌ర‌ణ్ జోహార్ క‌థ‌కు ఆయ‌న‌, షీనా పారిఖ్ తో క‌ల‌సి స్క్రీన్ ప్లే స‌మ‌కూర్చారు. ప్ర‌తి సీన్ ఎంతో గ్రాండియ‌ర్ గా డిజైన్ చేశారు. దాంతో చూపరుల‌ను ఇట్టే ఆక‌ట్టుకోగ‌లిగారు. క‌థ‌లోకి జ‌నాన్ని తీసుకుపోయారు. అమితాబ్ బ‌చ్చ‌న్, షారుఖ్ ఖాన్, జ‌య‌బాధురి, కాజోల్, హృతిక్ రోష‌న్, క‌రీనా క‌పూర్ ఎవ‌రి పాత్ర‌ల్లో వారు ఒదిగిపోయారు. ఇందులో రాణీ ముఖ‌ర్జీ గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చారు. జ‌తిన్ ల‌లిత్, సందేశ్ శాండిల్య‌, ఆదేశ్ శ్రీ‌వాత్స‌వ పాట‌ల‌కు సంగీతం అందించ‌గా, బబ్లూ చ‌క్ర‌వ‌ర్తి నేప‌థ్య సంగీతం స‌మ‌కూర్చారు. బ‌బ్లూ మ్యూజిక్ తో సీన్స్ భ‌లేగా ర‌క్తి క‌ట్టాయ‌ని చెప్ప‌వ‌చ్చు. స‌మీర్, అనిల్ పాండే పాట‌లు రాశారు. ఇందులోని క‌భీ ఖుషి క‌భీ ఘ‌మ్... పాట మ‌నం థియేట‌ర్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చినా, మ‌దిలో చిందులు వేస్తూనే ఉంటుంది. బోలే చూడియా..., యూ ఆర్ మై సోనియా..., సూర‌జ్ హువా మ‌ద్ద‌మ్..., యే ల‌డ్కీ హై అల్లా..., దీవానా హై దేఖో..., వందే మాత‌రం... వంటి పాట‌లు విశేషంగా అల‌రించాయి.

'క‌భీ ఖుషి క‌భీ ఘ‌మ్' సినిమా చూసి ఎంతోమంది తెలుగు సినీజ‌నం త‌మ చిత్రాల‌లో ఇందులోని కొన్ని అంశాల‌ను చొప్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక ఈ సినిమా మ‌న దేశంలోనే కాదు, లండ‌న్,అమెరికా వంటి దేశాల్లోనూ మంచి విజ‌యం సాధించింది. రూపాయికి ప‌ది రూపాయ‌ల ఆదాయం చూసి, ఆ యేడాది టాప్ గ్రాస‌ర్లలో ఒక‌టిగా నిలిచింది.