Site icon NTV Telugu

Health: రాత్రిపూట కంటినిండా సరిపడా నిద్రపోనివారికి హెచ్చరిక

రాత్రిపూట కొంతమంది సరిగ్గా నిద్రపోరు. మొబైల్ లేదా టీవీ చూస్తూ లేటుగా నిద్రపోతుంటారు. మళ్లీ ఉదయాన్నే లేచి తమ పనుల్లో నిమగ్నమవుతారు. అలాంటి వారికి కంటి నిండా నిద్ర ఉండదు. అయితే ఇలాంటి అలవాటు భవిష్యత్‌లో జీవక్రియలపై చెడు ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోనివారు పగలు నిద్రపోవాలని ఆలోచిస్తుంటారు.

కానీ పగటి నిద్రకు, రాత్రి నిద్రకు చాలా తేడా ఉంది. ఎందుకంటే రోజంతా కష్టపడి అలసిపోయిన శరీరానికి రాత్రిపూట నిద్ర కచ్చితంగా అవసరం. తగినంత నిద్ర ఉంటే శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటుంది. పలు రకాల అనారోగ్యాలకు దానికదే చికిత్స చేసుకొనే శక్తి శరీరానికి ఉంటుంది. అంతేకాదు, జీవక్రియల్లో మార్పులు చోటు చేసుకోకుండా ఉండాలన్నా రాత్రి సమయాల్లో నిద్ర అత్యంత అవసరం. రాత్రి నిద్ర మాత్రమే జీవక్రియలను సమన్వయం చేయగలదు. రాత్రి కంటినిండా నిద్రపోతే అది మెదడు పనితీరునూ మెరుగుపరుస్తుంది. అయితే పగటిపూట వెలుతురు ప్రభావం అనేది నిద్రపై పడుతుంది. దీంతో కంటినిండా నిద్ర లభించక అధికబరువు సమస్య దరిచేరుతుంది.

నిద్రలేమి సమస్య ఉన్నవారు వారం రోజులు ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించాలి. వెలుతురు ఎక్కువగా లేకుండా ప్రశాంత వాతావరణాన్ని కల్పించుకోవాలి. నచ్చిన సంగీతాన్ని వినాలి. ఇష్టమైన పుస్తకాన్ని చదివినా క్రమేపీ మెదడు విశ్రాంతి దశలోకి వెళుతుంది. నిద్రరావడం లేదంటూ స్మార్ట్ ఫోన్‌ చేతిలో ఉంచుకోకూడదు. నిద్రకు గంట ముందుగానే ఎలక్ట్రానిక్ వినియోగాన్ని ఆపివేయాలి. ఈ ప్రయత్నాలతో పాటు అవసరమైతే వైద్యుల సలహాను తీసుకోవాలి. రాత్రి పూట కంటి నిండా నిద్రపోతే ఆరోగ్యంగా, ఉత్సాహంగా రోజంతా గడపొచ్చు.

Exit mobile version