Used Tea Leaves: ప్రతి రోజూ ఉదయం వేడి వేడి టీతో దినచర్యను ప్రారంభించడం మనలో చాలామందికి అలవాటు. టీ తయారు చేసిన తర్వాత మిగిలిపోయే టీ పొడిని నిరుపయోగంగా భావించి చెత్తబుట్టలో పడేస్తుంటాం. కానీ, ఈ వ్యర్థమని పడేసే టీ పొడి మీ ఇంటి శుభ్రతకు, గాజు వస్తువులను మెరిపించడానికి, మొక్కల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మీకు తెలుసా? ఇందులోని సహజ గుణాలు ఇళ్లలోని కష్టమైన పనులను ఇట్టే సులభం చేస్తాయి. కాబట్టి ఇకపై టీ వడకట్టాక ఆ పొడిని పడేసే పొరపాటు చేయకండి. దానిని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.
మొదటగా, మిగిలిన టీ పొడిని నీళ్లతో శుభ్రంగా కడిగి, అందులో ఉండే పాలు, పంచదార జిగట పోయేలా చూడాలి. ఆ తర్వాత ఆ పొడిని మళ్లీ నీళ్లలో మరిగించి వడకట్టాలి. ఈ చల్లారిన నీటితో గాజు సామాన్లు, అద్దాలు, కిటికీలను తుడిస్తే సరికొత్తగా మెరుస్తాయి. కేవలం శుభ్రపరచడమే కాకుండా, కడిగి ఎండబెట్టిన టీ పొడిని మొక్కల కుండీలలో మట్టిలో కలిపితే మంచి సేంద్రీయ ఎరువులా పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు మొక్కలు ఏపుగా, పచ్చగా పెరగడానికి సహాయపడతాయి. అలాగే, టీ పొడిని ఉడికించి చల్లార్చిన నీటితో చెక్కతో చేసిన డైనింగ్ టేబుల్స్, తలుపులు లేదా సోఫాలను తుడిస్తే పాత ఫర్నిచర్ కూడా కొత్తదానిలా మెరిసిపోతుంది. వంటగదిలో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేదా చేపలు కోసిన తర్వాత చేతులకు వచ్చే దుర్వాసన పోవాలంటే, ఉపయోగించిన టీ పొడితో చేతులను రుద్దుకుని కడుక్కోవాలి. ఇది జిడ్డును, వాసనను ఇట్టే తొలగిస్తుంది. అలాగే వంటగది సింక్ లేదా చెక్కతో చేసిన కటింగ్ బోర్డులపై ఈ టీ పొడిని రుద్దడం వల్ల పేరుకుపోయిన మొండి జిడ్డు, బ్యాక్టీరియా సులభంగా వదిలిపోతాయి. అంతేకాదు.. కీటకాలు సైతం దూరంగా ఉంటాయి.

