Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!

Rice

Rice

Rainy Season Kitchen Tips : వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతంతో పాటు ఉష్ణోగ్రతలు మారడం వల్ల ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యంలో ఉండలు కట్టడం, చిన్న గోధుమ రంగు వరి పురుగులు లేదా నులిపురుగులు చేరడం సాధారణంగా జరుగుతుంటుంది. బియ్యంలో పురుగులు కనిపిస్తే చాలామంది వాటిని పారబోస్తుంటారు. కానీ సరైన పద్ధతుల్లో శుభ్రం చేసుకుంటే ఆ బియ్యాన్ని సురక్షితంగా మళ్లీ ఉపయోగించుకోవచ్చు.

అసలు బియ్యంలోకి పురుగులు ఎలా వస్తాయి.?

ఆడ వరి పురుగు బియ్యపు గింజ మధ్య భాగంలో ఒక చిన్న రంధ్రం చేసి అందులో గుడ్డు పెట్టి, బయటకు కనిపించకుండా ప్రత్యేక పదార్థంతో కప్పివేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్డు నుంచి లార్వా బయటకు వచ్చి గింజను లోపల నుంచి తింటూ పెరుగుతుంది. దీంతో పైకి గింజ బానే ఉన్నప్పటికీ లోపల బోలుగా మారిపోతుంది. క్రమంగా అది పూర్తిగా పెరిగిన పురుగుగా బయటకు వచ్చేసరికి బియ్యపు గింజ పొడిపొడిగా రాలిపోతుంది. కొనుగోలు చేసిన ప్యాకెట్లలోనూ తేమ లేదా వేడి తగిలినప్పుడు గింజల్లోని గుడ్లు పొదిగి పురుగులుగా మారతాయి. బియ్యంలో చిన్న గుండ్రని రంధ్రాలు, డబ్బా అడుగున పొడి, లేదా వింత వాసన వస్తుంటే పురుగులు ఉన్నాయని గుర్తించాలి.

ఎండలో పెట్టడం , ఫ్రీజింగ్ పద్ధతి

బియ్యంలో పురుగుల బెడద కనిపిస్తే ముందుగా వాటిని ఒక పెద్ద పళ్ళెంలో పరచి 15 నుంచి 20 నిమిషాల పాటు నల్లటి ఎండలో ఉంచాలి. సూర్యరశ్మి వేడికి పురుగులు బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత సన్నని జల్లెడతో జల్లించి చెత్తను, పురుగులను వేరు చేయాలి. పురుగులను , వాటి గుడ్లను పూర్తిగా నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఏమిటంటే, జల్లించిన బియ్యాన్ని ఒక 48 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచడం. దీనివల్ల గింజల లోపల దాగి ఉన్న లార్వాలు, గుడ్లు నశిస్తాయి.

సహజసిద్ధమైన చిట్కాలు , నివారణ మార్గాలు

బియ్యంలో మళ్లీ పురుగులు చేరకుండా ఉండటానికి మన ఇంట్లో లభించే సహజ పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి. బియ్యం నిల్వ చేసే డబ్బాలో 3 నుంచి 5 వరకు బిర్యానీ ఆకులు, ఎండిన వేప ఆకులు, లవంగాలు లేదా వెల్లుల్లి రెబ్బలను వేయవచ్చు. వీటి ఘాటైన వాసన పురుగులను దరిచేరనీయకుండా నిరోధిస్తుంది. వీటితో పాటు ఎండు మిరపకాయలు , పసుపును కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా బియ్యాన్ని ఎల్లప్పుడూ తేమ తగలని పొడి ప్రదేశంలో, గాలి చొరబడని ఎయిర్ టైట్ డబ్బాల్లో మాత్రమే నిల్వ చేయాలి. సంచుల్లో లేదా ప్లాస్టిక్ కవర్లలో వదిలేయకూడదు.

వండే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బియ్యాన్ని వండే ముందు కనీసం మూడుసార్లు శుభ్రంగా కడగాలి. మొదటి రెండుసార్లు చల్లటి నీటితో కడిగిన తర్వాత, మూడోసారి గోరువెచ్చని నీటితో కడిగితే మిగిలి ఉన్న పురుగులు లేదా కంటికి కనిపించని చెత్త పూర్తిగా తొలగిపోతుంది. మార్కెట్ నుంచి కొత్తగా బియ్యం తెచ్చిన వెంటనే కూడా ఒకసారి ఎండలో ఆరబెట్టి, ఆ తర్వాతే ఎయిర్ టైట్ కంటైనర్లలో నిల్వ చేసుకోవడం వల్ల ధాన్యం చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది.