How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. బాల్కనీలోని కుండీలోనే చెట్టు పెంచే ఈ టిప్స్ మీ కోసం..

Drumstick Moringa

Drumstick Moringa

How To Grow Moringa: ఇంట్లోనే ఆరోగ్యాన్ని పంచే మునగ చెట్టును పెంచడం ఇప్పుడు చాలా సులువు. కేవలం పూల కుండీలకే పరిమితం కాకుండా, మీ వంటింటికి ఉపయోగపడేలా ఏదైనా మొక్కను పెంచాలని ఆలోచిస్తుంటే మునుగ (డ్రమ్‌స్టిక్) సరైన ఎంపిక. దీని ఆకుల నుంచి కాయల వరకు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెద్దగా స్థలం లేకపోయినా, అపార్ట్‌మెంట్ల బాల్కనీలో లేదా మేడ మీద ఈ మొక్కను సులభంగా పెంచుకోవచ్చు. అయితే, మొక్క బాగా పెరిగి గుత్తులుగా కాయలు కాయాలంటే మాత్రం సరైన కుండీ, మట్టి, ఎండ, తగిన జాగ్రత్తలు చాలా ముఖ్యం.

మొదటగా మునుగ మొక్క నాటడానికి తగిన కుండీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీని వేర్లు బాగా విస్తరించడానికి కనీసం 12 అంగుళాల లోతు ఉండే పెద్ద కుండీని తీసుకోవాలి. కుండీ కింద నీరు బయటకు పోవడానికి రంధ్రం ఉండేలా చూసుకోవాలి, లేదంటే నీరు నిలిచి వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి సూర్యరశ్మి చాలా అవసరం. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో అంటే ఎండ బాగా వచ్చే బాల్కనీ లేదా మేడ మీద ఈ కుండీని ఉంచాలి. ఒకవేళ సరిపడా ఎండ రాకపోతే గ్రో లైట్ల సాయం తీసుకోవచ్చు. మట్టిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణ మట్టిలో కొద్దిగా ఇసుక లేదా పెర్లైట్ కలిపితే నీరు నిలవకుండా సులభంగా బయటకు వెళ్తుంది. మట్టి పీహెచ్ విలువ 6 నుంచి 7 మధ్య ఉండేలా చూసుకోవాలి. పై మట్టి ఎండిపోయిన తర్వాత మాత్రమే నీరు పోయాలి, అతిగా నీరు పొయ్యడం మొక్కకు మంచిది కాదు. మొక్క ఏపుగా, గుబురుగా పెరిగేందుకు అప్పుడప్పుడు కత్తిరింపులు చేయడం అవసరం. బలహీనంగా లేదా అనవసరంగా పొడవుగా పెరిగిన కొమ్మలను ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటే కొత్త చిగుర్లు వేగంగా వస్తాయి. కత్తిరించేటప్పుడు శుభ్రమైన పరికరాలను మాత్రమే వాడాలి.

అలాగే మొక్కను కీటకాల బారి నుంచి రక్షించడం కూడా ముఖ్యం. ఆకులపై చిన్న పురుగులు లేదా పేనుబాధ కనిపిస్తే వాటిని తొలగించి, అవసరమైతే సేంద్రీయ క్రిమిసంహారక మందులను వాడాలి. మొక్క ఎదుగుదల కోసం ప్రతి నాలుగు వారాలకు ఒకసారి తగిన పాళ్లలో సహజమైన ఎరువులను అందించాలి. సూచనలు పాటించకుండా మోతాదుకు మించి ఎరువులు వేస్తే మొక్క దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా ఇంట్లోనే మునుగ చెట్టును పెంచడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. దీని ఆకులు, కాయలు రెండూ వంటకాల్లో వాడటానికి ఎంతో ఉపయోగపడతాయి. మునుగ ఆకులు పోషకాల ఖజానం కాగా, కాయలతో రుచికరమైన కూరలు తయారు చేసుకోవచ్చు.