ప్రపంచంలో ఎన్ని సంబంధాలు ఉన్నా.. భార్యాభర్తల బంధానికి మించింది మరొకటి లేదు. రెండు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒకే జీవితమై ముందుకు సాగుతారు. ప్రేమతో, నమ్మకంతో ఈ బంధం మరింత బలపడుతుంది. అందుకే ఈ బంధం సుఖసంతోషాలతో నిండాలంటే పరస్పరం విశ్వాసం, గౌరవం, జాగ్రత్తలు అవసరం. కానీ కొన్ని మాటలు, కొన్ని అలవాట్లు ఈ అందమైన బంధం లో చీకటి నింపేస్తాయి. ముఖ్యంగా భార్య గురించి బయటి వారి ముందు చెప్పే కొన్ని విషయాలు.. అవి ఎంత చిన్నవైనా, మనసులో పెద్ద ముద్ర వేసి, అనవసరమైన దూరాలు పెంచేస్తాయి. అందుకే, మీ భార్య గురించి కొన్ని విషయాలు ఎప్పటికీ మీ హృదయంలోనే ఉండాలి. వాటిని బయట పెట్టకపోవడం మీ ప్రేమను, గౌరవాన్ని, బంధాన్ని కాపాడుతుంది. మరి ఎలాంటి విషయాలు చెప్పకూడదు? అనేది చూద్దాం..
1. ఇతరుల ముందు తిట్టడం లేదా అవమానించడం :
కొంతమంది భర్తలు, తమ గొప్ప కోసం, భార్యను ఇతరుల ముందు తిట్టడం లేదా కోప్పడడం చేస్తుంటారు. ఇది వారి ప్రతిష్టను పెంచదు, పైగా వారిని దిగజారుస్తుంది. భార్యను అవమానించడం అనేది కేవలం ఆమెను కాదు, మీ ఇద్దరి బంధాన్నే కించపరిచే పని. కనుక ఎట్టి పరిస్థితిలోను మీ వైఫ్ ను చులకనగా చూడటం మనుకొండి. అలాగే భార్య కూడా తన భర్తను తక్కువ చేసి మాట్లాడటం.. నలుగురిలో మర్యాద లేకుండా మాట్లడటం చేయకూడదు. అది ఆ మనిషిని చాలా కించపరుస్తుంది.
2. ఆరోగ్య సమస్యలు పబ్లిక్‌లో చెప్పడం :
“నా భార్య ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటుంది” లేదా “ఎప్పుడూ అలసటగా ఉంటుంది” వంటి మాటలు చెప్పడం సరైంది కాదు. ఇది ఆమె మనసును బాధ పెట్టడమే కాకుండా, ఇతరుల దృష్టిలో ఆమెపై తప్పుడు అభిప్రాయం కలిగిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మీ ఇద్దరి మధ్యే ఉండాలి. ఎట్టి పరిస్థితిలోను బయటకు చెప్పకూడదు. ముఖ్యంగా మీ వైఫ్ హెల్త్ ఇష్యూ పై బాధ్యతగా ఉండటం కూడా నేర్చుకోండి.
3. గొడవలు బయట పెట్టడం :
ఏ జంటకైనా గొడవలు సహజం. కానీ ఆవేశంతో, ఇంటి గొడవలు బయటివారితో పంచుకోవడం సమస్యలను మరింత పెంచుతుంది. చిన్న విషయాలు పెద్దగా మారి, బంధం దెబ్బతినే అవకాశం ఉంది. కనుక మీ ఇద్దరి మధ్య మూడో మనిషి చేరకుండా చూసుకోండి, ముఖ్యంగా పదే పదే వాదించడం కూడా మంచిది కాదు అలా మౌనంగా ఉంటే అని అవే సర్దుకుంటాయి.
4. మీ ప్రేమకథ రహస్యాలు :
మీ ప్రేమ ఎలా మొదలైంది, ఎవరు మొదట ప్రపోజ్ చేశారు, మీ మధ్య ఏం జరిగిందనే విషయాలు ఇతరులతో పంచుకోవద్దు. ఇవి మీ ఇద్దరి మధ్యే ఉండాలి. బయటివారితో చెప్పడం వల్ల, భవిష్యత్తులో అవి ఆమెకు వ్యతిరేకంగా ఉపయోగించబడే ప్రమాదం ఉంటుంది. అందుకే భర్య కానీ భర్త కానీ వారి రహస్యాలను ఎట్టి పరిస్థితిలోను బయట పెట్టకూడాదు.
5. బలహీనతలు, లోపాలు ;
ప్రతీ ఒక్కరికీ మంచి లక్షణాలతో పాటు కొన్ని లోపాలు ఉంటాయి. భార్య బలహీనతలు లేదా లోపాలను ఇతరుల వద్ద చెప్పడం, మీకు ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. ఇవి బయటకు వెళ్తే, మీ బంధం బలహీనపడే అవకాశం ఉంటుంది. కనుక ఏం ఉన్న నాలుగు గోడల మధ్యనే ఉండేలా చూసుకోండి. లోపాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. వాటిని నలుగురితో పంచుకోవడం మంచిది కాదు. అలాగే భార్య కూడా తన భర్తకు ఎలాంటి పరిస్థితి వచ్చిన మారిపోకూడదు. అంతే నమ్మకంతో అంతే ప్రేమతో మసులుకోవాలి.
ముగింపు:
భార్యాభర్తల మధ్య విశ్వాసం, గౌరవం ఉంటేనే బంధం బలపడుతుంది. కాబట్టి, భార్యకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను సీక్రెట్‌గా ఉంచడం, బయట చెప్పకపోవడం ఉత్తమం. ఇది మీ ఇద్దరి జీవితాన్ని మరింత సంతోషకరంగా మార్చుతుంది.