వేసవికాలం వచ్చేసింది. ఎండాకాలం ప్రారంభం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత అధికమవుతున్న వేళ.. ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. దీంతో డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు నిమ్మరసం, మంచినీళ్లు, ఫ్రూట్ జ్యూస్‌లు, కొబ్బరి నీళ్లలాంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ద్రవపదార్థాలేకాకుండా కొన్ని రకాల ఘనపదార్థాలు కూడా డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఆకు కూరలు : వేసవికాలంలో డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగించే ఘన పదార్థాలలో ఆకు కూరలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. తోటకూర, పాలకూర లాంటి ఆకు కూరల్లో నీటి శాతం అధికంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా చాలా పోషకాలను శరీరానికి అందిస్తాయి. క్యారెట్, కీర దోస, బీట్ రూట్ లాంటి సలాడ్స్‌తో కూడా డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టవచ్చు.
జీలకర్ర : శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో నీటి శాతం సమంగా ఉంచేందుకు జీలకర్ర సహాయం చేస్తుంది. రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా పటిక బెల్లంతో పాటు జీలకర్రను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి త్రాగడం వలన డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా ఎన్నో పోషక విలువలున్న జీలకర్ర శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో దోహదపడుతుంది.
సత్తుపిండి : ఈ ఎండాకాలం డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు సత్తుపిండి ఎంతో సహాయపడుతుంది. ఉదయం టిఫిన్‌గా సత్తుపిండితో పాటు పాలు గానీ, మజ్జిగ గానీ తీసుకోవచ్చు. అంతేకాకుండా జొన్నలు, రాగులతో చేసిన సత్తుపిండి శరీరంలోని వేడిని తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.