Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మ నిచ్చిన రెయిన్‌బో హాస్పిటల్ వైద్యులు..

  • బాలుడు నిజంగా మృత్యుంజయుడు..
  • సమిష్టి వైద్య బృందం అంకితభావానికి నిదర్శనం..
  • బతుకుతాడనే ఆశలేని 13 ఏళ్ల బాలుడిని కాపాడిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు
Rainbow

Rainbow

ప్రమాదవశాత్తు భవనం 5వ అంతస్తు నుండి జారిపడిన 13 ఏళ్ల బాలుడిని ముందుగా నిజాంపేట సమీపంలోని ఒక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ బాలునికి వెంటిలేటర్ అమర్చి, మెరుగైన చికిత్స కొరకు కూకట్‌పల్లిలోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు పంపించారు. ఆ సమయంలో బాలుడు తీవ్రంగా రక్తం కారిపోయి, బి.పి. బాగా తగ్గిపోయి షాక్‌లో ఉన్నాడు. వెంటనే పీడియాట్రిక్ ఐసియు (PICU) వైద్య బృందం పరిస్థితిని అదుపు చేయడానికి అనేక లీటర్ల సెలైన్, రక్తం మరియు రక్త ఉత్పత్తులు ఎక్కిస్తూనే, ప్రాణాంతకమైన ఇతర గాయాలకు చికిత్స అందించారు. మరింత నిరంతర ఐసియు సేవలు మరియు మెరుగైన వైద్య సహాయం కొరకు బాలుడిని బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌కు తరలించారు.

సవాలుగా మారిన బహుళ అవయవాల గాయాలు..
పిల్లలలో అరుదుగా ఒకేసారి కనిపించే తీవ్రమైన గాయాల కలయిక నుండి ఈ బాలుడు ప్రాణాలతో బయటపడటం అసాధారణమైన పీడియాట్రిక్ ట్రామా రికవరీలలో ఒకటిగా నిలిచింది.

గుండె నుండి రక్త సరఫరా చేసే ప్రధాన రక్తనాళానికి ప్రాణాంతకమైన గాయమైంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇటువంటి గాయాలైన వారిలో 80-90% మంది ఆసుపత్రికి వచ్చేలోపే మరణిస్తారు. మిగిలిన వారిలో 50% మంది మొదటి 24 గంటల్లోనే చనిపోతారు. చికిత్స చేయకపోతే అధిక రక్తస్రావంతో మరణం సంభవిస్తుంది. ఇలాంటి సంక్లిష్టమైన కేసును ఒకే విభాగం నిర్వహించలేదు. అందువల్ల కార్డియాలజీ, ఇంటెన్సివ్ కేర్, సర్జరీ, అనస్థీషియా, రేడియాలజీ విభాగాలతో పాటు క్రింది నిపుణుల సమిష్టి సహకారం అవసరమైంది. వారు పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ & పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ & పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్, పీడియాట్రిక్ సర్జన్ & ఆర్థోపెడిక్ సర్జన్, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, క్రిటికల్ కేర్ నర్సులు మరియు ఫిజియోథెరపిస్ట్‌లు.

పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU) మరియు కార్డియాలజీ బృందం అధునాతన ఇమేజింగ్, బెడ్‌సైడ్ ఎకోకార్డియోగ్రఫీ ద్వారా బృహద్ధమని గాయాన్ని గుర్తించి, అయోర్టిక్ స్టెంటింగ్ (Endovascular Stent) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. దీనివల్ల రక్తనాళం సవరించబడటంతో, వైద్యులు ఇతర గాయాలపై దృష్టి పెట్టగలిగారు.

ఆ తర్వాత ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, కిడ్నీ గాయాలను నయం చేస్తూ రాగా, హాస్పిటల్‌లో చేరిన రెండవ వారంలో బాలుడు క్రమంగా కోమా నుండి కోలుకున్నాడు. ఆ తర్వాత వెంటిలేషన్ తొలగించి, మెదడును రక్షించే న్యూరో ఇంటెన్సివ్ కేర్ పర్యవేక్షణ మరియు మద్దతు అందించారు.

డాక్టర్ అనుపమ వై (సీనియర్ కన్సల్టెంట్ – పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ మరియు పీడియాట్రిషియన్):
“బాలుడు హాస్పిటల్‌కు వచ్చినప్పుడు ప్రధాన అవయవ వ్యవస్థలన్నీ దెబ్బతిని ఉన్నాయి. కేవలం ఒక్క గాయానికి చికిత్స చేయడం కాకుండా, ప్రతి అవయవం మళ్లీ పనిచేసేలా చూడటంపై దృష్టి పెట్టాము. జీర్ణాశయాంతర రక్తస్రావం నుండి సెప్టిక్ షాక్ వరకు దీర్ఘకాలం మెకానికల్ వెంటిలేషన్, డయాలసిస్ మరియు ఇంటెన్సివ్ పర్యవేక్షణ అవసరమయ్యాయి. మా ఐసీయూ నర్సులు, పారామెడికల్ సిబ్బంది, నిపుణులు రేయింబవళ్లు అవిశ్రాంతంగా చేసిన సేవలే ఆ బిడ్డ కోలుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.”

డాక్టర్ నాగేశ్వర రావు కోనేటి (చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్):
“ఈ కేసులో థొరాసిక్ అయోర్టిక్ గాయం అత్యంత క్లిష్టమైనది. దీనికి తక్షణ చికిత్స అవసరం, కొద్దిపాటి ఆలస్యమైనా ప్రాణాంతకం కావచ్చు. ఎండోవాస్కులర్ స్టెంట్ ప్రక్రియ ద్వారా దెబ్బతిన్న రక్తనాళాన్ని సవరించడం వల్ల, ఇంటెన్సివ్ కేర్ బృందం ఇతర గాయాలను నయం చేయడంపై దృష్టి పెట్టగలిగింది.”

పూర్తి ఆరోగ్యంతో ఆ బాలుడు 5 వారాల తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళాడు. విరిగిన తొడ ఎముక నయం కావడానికి మరికొంత కాలం బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. డిశ్చార్జ్ అయిన కొన్ని వారాల తర్వాత, ఆ బాలుడు ఒక నవ్వుతున్న యువ కళాకారుడిగా మారి తిరిగి హాస్పిటల్‌కు వచ్చాడు. ప్రాణాపాయ స్థితి నుండి తనను కాపాడిన వైద్య బృందానికి కృతజ్ఞతగా, తాను స్వయంగా చేసిన ఒక అందమైన కళాకృతిని ప్రశంసా చిహ్నంగా వైద్యులకు బహుమతిగా అందించాడు. మీడియా సంప్రదింపుల కొరకు మల్లిఖార్జున రావు ఫోన్ 89786 73555 సంప్రదించవచ్చు.