Okra Water: సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది, ఎలా వైరల్ అవుతుందో తెలియదు.. ప్రస్తుతం కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు బెండకాయ నీరు తాగడం వల్ల బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. వాస్తవానికి ఇందులో నిజం ఎంత ఉంది. బెండకాయ నీరు శరీరానికి ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుంది? బరువు తగ్గడానికి ఈ నీటికి ఏమైనా సంబంధం ఉందా?.. ఈ ప్రశ్నలకు నిపుణులు ఏం చెబుతున్నారు. ఆ వివరాలన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. ఓక్రా(బెండకాయ) నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని అన్నారు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. నిజానికి బెండకాయ తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి లభిస్తుందన్నారు. ఓక్రాలో ఫైబర్ అధికంగా ఉంటుందని, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుందని అన్నారు. బెండకాయ తినడం లేదా దాని నీరు తాగడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపించడం, తరచుగా చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుందని వివరించారు. అలాగే బెండకాయ నీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయని, దాని నీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుందని వెల్లడించారు. ఇది అతిగా తినడాన్ని తగ్గించడానికి, బరువును నియంత్రించడంలో సహాయపడుతుందని అన్నారు.
ఓక్రా నీరు బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, అది అందరికీ మంచిది కాదని చెప్పారు. కడుపు సమస్యలు లేదా అజీర్ణంతో బాధపడుతున్న వారు బెండకాయ తినడం లేదా దాని నీరు తాగడం మానుకోవాలని సూచించారు. యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న వారు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు కూడా బెండకాయను ఏ రూపంలోనూ తినకూడదని చెప్పారు. ఇది చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది కాబట్టి, బెండకాయ నీరు తక్కువ చక్కెర స్థాయిలు ఉన్నవారికి కూడా మంచిది కాదని వివరించారు. కాబట్టి ఈ ఫార్ములా అందరికీ అనుకూలంగా ఉండదని చెప్పారు. మీరు ఓక్రా వాటర్ ఉపయోగించి బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే, ముందుగా వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ఎందుకంటే ఓక్రా నీరు మ్యాజిక్ డ్రింక్ కాదని, దీన్ని తాగడం వల్ల బరువు తగ్గలేరని, దీనితో పాటు సరైన ఆహారం, కచ్చితమైన వ్యాయామం చాలా అవసరం అని వెల్లడించారు.
READ ALSO: New Year 2026 Vastu Tips: కొత్త సంవత్సరానికి ముందు ఈ వస్తువులకు గుడ్‌బై చెప్పండి!