Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?

  • మూలాంకం ప్రకారం మీకు శుభం చేసే మొక్క ఏది?
  • న్యూమరాలజీ ప్రకారం ఇంట్లో పెంచాల్సిన అదృష్ట వృక్షాలు
  • సరైన మొక్కతో పాజిటివ్ ఎనర్జీ, ఐశ్వర్యం
  • 1 నుంచి 9 వరకు ప్రతి సంఖ్యకు ప్రత్యేక మొక్క ఇదే..
Plants

Plants

Lucky Plants : ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సుఖశాంతులు, ఆనందం , సానుకూల వాతావరణం ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం.. ప్రతి వ్యక్తి పుట్టిన తేదీకి, కొన్ని ప్రత్యేకమైన మొక్కలకు మధ్య బలమైన సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ ఆధారంగా వచ్చే ‘మూలాంకం’ (రైడింగ్ నంబర్) ప్రకారం సరైన మొక్కను ఇంట్లో లేదా ఆఫీసులో పెంచుకుంటే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, అదృష్టం వరిస్తుంది. మరి మీ పుట్టిన తేదీకి ఏ మొక్క అదృష్టాన్ని తెస్తుందో ఇప్పుడు చూద్దాం.

మూలాంకం 1 (తేదీలు: 1, 10, 19, 28) – సూర్యరశ్మి తగిలే మొక్కలు

ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారి సంఖ్య 1 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గ్రహాల రాజైన ‘సూర్యుడు’. సూర్య గ్రహ ప్రభావం వల్ల వీరికి నాయకత్వ లక్షణాలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం పుట్టుకతోనే వస్తాయి. వీరు తమ ఇల్లు లేదా పని చేసే చోట సానుకూల శక్తిని పెంచుకోవడానికి.. చక్కగా ఎండ తగిలే, సూర్యరశ్మిని ఎక్కువగా ఇష్టపడే మొక్కలను పెంచుకోవడం శుభప్రదం.

×
×
Ad

మూలాంకం 2 (తేదీలు: 2, 11, 20, 29) – జేడ్ ప్లాంట్

నెలలోని 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారి సంఖ్య 2 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి ‘చంద్రుడు’. చంద్రుని ప్రభావం వల్ల వీరు చాలా సున్నితంగా, భావోద్వేగభరితంగా ఉంటారు. తమ ఎమోషన్స్‌ను అదుపులో ఉంచుకుని, మానసిక ప్రశాంతతను పొందడానికి వీరు ఇంట్లో లేదా ఆఫీసు డెస్క్‌పై ‘జేడ్ ప్లాంట్’ (Jade Plant) ఉంచుకోవడం చాలా మంచిది.

మూలాంకం 3 (తేదీలు: 3, 12, 21, 30) – పవిత్ర తులసి మొక్క

3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారి సంఖ్య 3 కాగా, దీనికి అధిపతి దేవగురువు అయిన ‘బృహస్పతి’ (గురుడు). గురు గ్రహ ప్రభావం వల్ల వీరు మంచి తెలివితేటలు కలిగి, ఇతరులకు మార్గదర్శకులుగా ఉంటారు. వీరు తమ ఇంట్లో పవిత్రమైన ‘తులసి మొక్క’ను ప్రతిష్టించి నిత్యం పూజించడం వల్ల జీవితంలో సానుకూలత పెరిగి, సుఖసంతోషాలు, శ్రేయస్సు సిద్ధిస్తాయి.

మూలాంకం 4 (తేదీలు: 4, 13, 22, 31) – లిల్లీ మొక్క

ఏ నెలలోనైనా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారి సంఖ్య 4 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి ఛాయా గ్రహమైన ‘రాహువు’. వీరు జీవితంలో, వ్యాపారంలో మంచి విజయాలు సాధిస్తారు. అయితే, వీరు కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత బాధపడుతుంటారు. ఈ తొందరపాటుతనం తగ్గి, మనసు ప్రశాంతంగా ఉండటానికి వీరు ఇంట్లో ‘లిల్లీ’ (Lily) మొక్కను పెంచడం ఎంతో మేలు చేస్తుంది.

మూలాంకం 5 (తేదీలు: 5, 14, 23) – మనీ ప్లాంట్

5, 14, 23 తేదీల్లో జన్మించిన వారి సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గ్రహాల రాకుమారుడైన ‘బుధుడు’. బుధుని ప్రభావం వల్ల వీరు విపరీతమైన తెలివితేటలు, మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. ఈ సంఖ్య గల వ్యక్తులు తమ ఇంట్లో ‘మనీ ప్లాంట్’ (Money Plant) పెంచుకోవడం అత్యంత అదృష్టదాయకం. ఇది వారి కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మరింత పెంచి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.

మూలాంకం 6 (తేదీలు: 6, 15, 24) – మల్లె మొక్క

ఏ నెలలోనైనా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారి సంఖ్య 6 కాగా, దీనికి అధిపతి ‘శుక్రుడు’. శుక్రుని ప్రభావం వల్ల వీరు ప్రేమపూర్వక స్వభావాన్ని కలిగి ఉంటారు, కానీ కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. వీరు తమ ఆత్మవిశ్వాసాన్ని, అంతర్గత ఆనందాన్ని పెంచుకోవడానికి ఇంట్లో లేదా ఆఫీసులో ‘మల్లె మొక్క’ (Jasmine)ను ఉంచుకోవాలి. దీని సువాసన వీరి మనసును ఉత్తేజపరుస్తుంది.

మూలాంకం 7 (తేదీలు: 7, 16, 25) – బంతి పూల మొక్క

7, 16, 25 తేదీల్లో జన్మించిన వారి సంఖ్య 7 అవుతుంది. దీనికి అధిపతి ఛాయా గ్రహమైన ‘కేతువు’. కేతు గ్రహ ప్రభావం వల్ల వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు , తమ సొంత ఊహా ప్రపంచంలో విహరిస్తుంటారు. వీరు సమాజంలో చురుగ్గా ఉంటూ, జీవితంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుకోవడానికి తమ పరిసరాల్లో ‘బంతి పూల మొక్క’ (Marigold)ను పెంచుకోవడం మంచిది.

మూలాంకం 8 (తేదీలు: 8, 17, 26) – శమీ మొక్క (జమ్మి చెట్టు)

ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారి సంఖ్య 8 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి న్యాయదేవుడైన ‘శని భగవానుడు’. శని ప్రభావం వల్ల వీరు చాలా బాధ్యతాయుతంగా, కష్టపడే తత్వంతో, ఇతరులకు సహాయం చేసే గుణంతో ఉంటారు. అయితే, శని దేవుని ప్రతికూల ప్రభావాలు లేదా అశుభ వీక్షణలు వీరిపై పడకుండా ఉండటానికి, జీవితంలోని కష్టాలు తొలగిపోవడానికి వీరు ఇంట్లో ‘శమీ మొక్క’ (Shami Plant)ను పెంచి పూజించాలి.

మూలాంకం 9 (తేదీలు: 9, 18, 27) – మందార మొక్క

9, 18, 27 తేదీల్లో జన్మించిన వారి సంఖ్య 9 కాగా, దీనికి అధిపతి నవగ్రహాలలో సేనాధిపతి అయిన ‘కుజుడు’. కుజుడి ప్రభావం వల్ల వీరిలో శక్తి, ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి కోపం కూడా అదే స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, కోపాన్ని అదుపులో ఉంచుకుని, జీవితంలో ప్రశాంతంగా ముందుకు సాగడానికి వీరు ఇంట్లో లేదా కార్యాలయంలో ‘మందార మొక్క’ (Hibiscus)ను పెంచుకోవడం ఉత్తమం. మందార పూలు ఈ సంఖ్య గలవారికి అపరిమితమైన సంతోషాన్ని ఇస్తాయి.