Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!

  • ఫ్రిజ్‌కు సరైన టెంపరేచర్ ఎంత?
  • తరచూ డోర్ తెరిస్తే భారీ నష్టం
  • డోర్ సీల్, క్లీనింగ్ ఎందుకు ముఖ్యం?
  • ఈ చిట్కాలతో ఆహారం తాజాగా ఉంటుంది
Fridge Tips

Fridge Tips

Rainy Season Fridge Tips: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణంలో తేమ శాతంతో పాటు బూజు, బ్యాక్టీరియా ముప్పు కూడా పెరుగుతుంది. వర్షాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కానీ గాలిలో తడి లేదా తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో వాడే రిఫ్రిజిరేటర్‌ను సరిగ్గా నిర్వహించకపోతే ఆహారం త్వరగా పాడైపోవడమే కాకుండా కరెంట్ బిల్లు కూడా పెరుగుతుంది. అందుకే వర్షాకాలంలో ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎలా ఉంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

సరైన ఉష్ణోగ్రతను సెట్ చేసుకోండి

వర్షాకాలంలో పెరిగే తేమను తట్టుకోవడానికి ఫ్రిజ్ ఉష్ణోగ్రతను సరిగ్గా సెట్ చేయడం చాలా ముఖ్యం. మీ ఫ్రిజ్‌లో 1 నుంచి 5 వరకు సెట్టింగ్‌లు ఉంటే దానిని 3 లేదా 4 వద్ద ఉంచడం ఉత్తమం. అదే ఒకవేళ 1 నుంచి 7 వరకు సెట్టింగ్‌లు ఉంటే 4 లేదా 5 కి సెట్ చేసుకోవాలి. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ రిఫ్రిజరేషన్ స్టడీస్’ ప్రకారం ఆహారం పాడవకుండా బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే ఫ్రిజ్ ప్రధాన భాగాన్ని 2°C నుండి 4°C వద్ద, ఫ్రీజర్‌ను -18°C నుండి -19°C వద్ద నిర్వహించాలి. ఇది ఆహారాన్ని తాజాగా ఉంచడానికి సరిపడా చల్లదనాన్ని అందిస్తుంది.

తరచుగా డోర్ తెరవవద్దు, వేడి వస్తువులు పెట్టవద్దు

వర్షాకాలంలో బయటి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్రిజ్ తలుపును తరచుగా తెరవడం లేదా ఎక్కువ సేపు తెరిచి ఉంచడం వల్ల లోపల తేమ పెరిగి దుర్వాసన, బూజు పట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల అవసరమైనప్పుడు మాత్రమే తలుపు తెరవాలి. అలాగే వండిన వేడి ఆహార పదార్థాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. గది ఉష్ణోగ్రతకు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వాటిని మూతలున్న డబ్బాల్లో నిల్వ చేయాలి.

మితిమీరి నింపవద్దు.. డోర్ రబ్బర్ సీల్ సరిచూడండి

ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలను మరీ ఎక్కువగా నింపడం వల్ల చల్లని గాలి ప్రసరణకు ఆటంకం ఏర్పడి కూలింగ్ సామర్థ్యం తగ్గుతుంది. గాలి ధారాళంగా తిరగడానికి కొంత ఖాళీ స్థలాన్ని వదలడం అవసరం. అలాగే ఫ్రిజ్ డోర్ రబ్బర్ సీల్ లేదా గాస్కెట్ లూజ్ అయిందో లేదో తరచుగా చెక్ చేయాలి. రబ్బర్ సీల్ పాడైతే లోపలి చల్లదనం బయటకు పోయి ఫ్రిజ్ పై భారం పడటమే కాకుండా విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుంది.

ప్రతి 15 రోజులకు ఒకసారి క్లీనింగ్ తప్పనిసరి

వర్షాకాలంలో అధిక తేమ వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ చాలా వేగంగా విస్తరిస్తాయి. అందువల్ల ప్రతి రెండు వారాలకు ఒకసారి ఫ్రిజ్‌ను శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా తెల్ల వెనిగర్, బేకింగ్ సోడా కలిపి ఒక సహజ సిద్ధమైన ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమంతో అరలను, మూలలను క్లీన్ చేసి, ఆ తర్వాత పొడి గుడ్డతో తడి లేకుండా క్షుణ్ణంగా తుడవాలి. ఫ్రిజ్ గోడలపై నీటి బిందువులు కనిపిస్తే లోపల తేమ ఎక్కువైందని అర్థం. అటువంటి సందర్భంలో థర్మోస్టాట్‌ను 1-2°C పెంచి కనీసం 24 గంటల పాటు పరిశీలించాలి. వర్షాకాలంలో తరచుగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున, ఫ్రిజ్‌ను పైన పేర్కొన్న పద్ధతుల్లో పర్యవేక్షిస్తే ఆహార పదార్థాలు నిరంతరం తాజాదనంతో ఉండటంతో పాటు పరికరం ఆయుష్షు కూడా పెరుగుతుంది.