మనం తినే పిండితో రకరకాల వంటలను చేసుకోవచ్చు.. జొన్నలు ఆరోగ్యానికి మంచిది.. దాంతో కొత్తగా ట్రై చెయ్యాలనుకుంటే మాత్రం ఇలా పరోటాను ట్రై చెయ్యండి.. జొన్నపిండితో మనం ఎక్కువగా రోటీ, దోశ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా జొన్న పిండితో మనం ఎంతో రుచిగా ఉండే పరాటాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి.. వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు :
జొన్న పిండి – ఒక కప్పు,
గోధుమపిండి – పావు కప్పు,
తరిగిన మెంతి ఆకు – ఒక కప్పు,
ఉప్పు – తగినంత,
కారం – అర టీ స్పూన్,
ధనియాల పొడి – ఒక టీ స్పూన్,
పచ్చిమిర్చి పేస్ట్ – అర టీ స్పూన్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్,
జీలకర్ర పొడి – అర టీ స్పూన్,
పసుపు – పావు టీ స్పూన్,
నువ్వులు – 3 టీ స్పూన్స్,
పెరుగు – ముప్పావు కప్పు,
నూనె – 2 టీ స్పూన్స్…
తయారీ విధానం :
ముందుగా గోధుమ పిండి, జొన్న పిండిని తీసుకొని బాగా జల్లించి పట్టాలి..ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పెరుగు, నూనె తప్ప మిగిలిన అన్నిటిని ఒకదాని తర్వాత మరొకటి వేసి బాగా కలపాలి..తరువాత అర కప్పు పెరుగు, నూనె వేసి కలపాలి. అవసరమైతే మరి కొద్దిగా పెరుగు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా పిండిని తీసుకుని ఉండలా చేసుకోవాలి. దీనిని పొడి జొన్న పిండి చల్లుకుంటూ మందంగా ఉండే పరాటాలా వత్తుకోవాలి.. ఇష్టపడే వాళ్ళు నువ్వులు కూడా వేసుకొని పరోటాను చేసుకోవచ్చు.. ముందుగా రెండు వైపులా సగానికి పైగా కాల్చుకున్న తరువాత నెయ్యి లేదా నూనె వేస్తూ కాల్చుకోవాలి. పరాటాను రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.. ఇలా చెయ్యడం వల్ల ఎంతో రుచికరమైన జొన్న పరోటా రెడీ.. ఊరగాయ లేదా పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా లేదా లంచ్ బాక్స్ లోకి ఇలా జొన్న పరాటాలను తీసుకెళ్లవచ్చు.. వీటిని తినడం వల్ల రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా.. మీకు నచ్చితే ట్రై చెయ్యండి..