Healthy Cooking: రాత్రి భోజనం కోసం చపాతీలు చేశాక కొద్దిగా పిండి మిగిలిపోవడం ప్రతి ఇంట్లో జరిగేదే. దాన్ని పారేయడం ఇష్టం లేక ఫ్రిజ్‌లో పెడతాం. కానీ, మరుసటి రోజు ఉదయానికి ఆ పిండి రంగు మారి, నల్లబడి, పైన గట్టిగా పొర కట్టి రాయిలా తయారవుతుంది. నిజానికి ఇలా పైపొర ఎండిపోయి, రంగు మారిన పిండితో రొట్టెలు చేస్తే అవి అప్పడాల్లా గట్టిగా రావడమే కాదు.. ఆ పిండి ఆరోగ్యానికి, జీర్ణక్రియకు కూడా అంత మంచిది కాదు. అయితే, వంటగదిలో ఉండే ఒకే ఒక్క హెల్తీ పదార్థంతో పిండిని స్టోర్ చేస్తే.. ఉదయం కూడా అప్పటికప్పుడు కలిపిన పిండిలా ఫ్రెష్‌గా, మెత్తగా ఉంటుంది.
మిగిలిన చపాతీ పిండిని అంతా ఒకచోట చేర్చి గుండ్రని ముద్దలా చేయండి. ఇప్పుడు చేతికి రెండు మూడు చుక్కల స్వచ్ఛమైన దేశీ నెయ్యి (లేదా వంట నూనె) రాసుకుని, పిండి ముద్ద చుట్టూ సమానంగా పట్టించండి. ఈ నెయ్యి పిండిపై ఒక సహజమైన రక్షణ పొరలా పనిచేస్తుంది. దీనివల్ల ఫ్రిజ్‌లోని చల్లని గాలి తగిలినా పిండి తేమను కోల్పోకుండా, నల్లబడకుండా తాజాగా ఉంటుంది. పైగా దేశీ నెయ్యి వల్ల ఉదయం చేసే చపాతీలు మరింత రుచిగా, ఆరోగ్యకరంగా మారతాయి.
చాలామంది పిండి గిన్నెపై ఏదో ఒక ప్లేట్ బోర్లించి ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. దీనివల్ల ఫ్రిజ్‌లోని ఇతర పదార్థాల వాసన పిండికి పట్టడంతో పాటు, చల్లని గాలి లోపలికి వెళ్లి పిండిని గట్టిగా మార్చేస్తుంది. ఎప్పుడూ గాలి చొరబడని స్టీల్ లేదా గాజు డబ్బాలో పిండిని పెట్టి గట్టిగా మూత పెట్టాలి. ఒకవేళ అలాంటి డబ్బా అందుబాటులో లేకపోతే.. ఒక శుభ్రమైన కాటన్ క్లాత్‌ను తడిపి, నీళ్లు లేకుండా గట్టిగా పిండి, అందులో పిండి ముద్దను చుట్టి డబ్బాలో ఉంచండి. ఆ పిండి డబ్బాను ఫ్రిజ్‌లో పైన ఉండే ఫ్రీజర్‌కు మరీ దగ్గరగా అస్సలు పెట్టొద్దు. అక్కడ కూలింగ్ ఎక్కువగా ఉండటం వల్ల పిండి గడ్డకట్టినట్లు అయిపోతుంది. ఎప్పుడూ ఫ్రిజ్ మధ్య అరలో గానీ, కింది అరలో గానీ ఉంచడం మంచిది. దీనివల్ల పిండి సమతుల్య ఉష్ణోగ్రత వద్ద పాడవకుండా ఉంటుంది.
ఉదయం పూట ఫ్రిజ్‌లోంచి పిండి తీసిన వెంటనే చపాతీలు చేయకూడదు. కనీసం 15 నుంచి 20 నిమిషాల ముందే డబ్బాను బయట పెట్టి, పిండి గది ఉష్ణోగ్రతకు వచ్చేలా చూడాలి. ఆ తర్వాత చేతికి ఒక చుక్క నీళ్లు లేదా నెయ్యి రాసుకుని పిండిని ఒక్క నిమిషం పాటు తేలికగా పిసకండి. ఇలా చేయడం వల్ల పిండి మళ్లీ దూదిలా మెత్తబడుతుంది. ఈ పిండితో చేసే చపాతీలు చాలా మృదువుగా ఉండటమే కాకుండా, సులభంగా జీర్ణమవుతాయి.

