NTV Telugu Site icon

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం సేఫ్‌

చలికాలంలో శరీరంతోపాటు చర్మం కూడా వివిధ ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే చలికాలంలో చర్మానికి కాంతిని, ఆరోగ్యాన్ని అందించే విటమన్‌ ‘సి’ ఉన్న పళ్లను ఇతర పదార్థాలను తీసుకుంటే మంచిది. ఈ కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించగల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని వినియోగించుకుని చలి కాలంలో వచ్చే రుగ్మతలను దూరం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

చలికాలంలో చాలామంది నీటిని అంతగా తాగరు. కానీ వేసవిలో ఎంత నీరు తాగుతామో చలికాలంలో కూడా నీటిని ఎక్కువగా తాగే అలవాటు చేసుకోవాలి. వేసవికాలంలో ఎంత నీరు తాగుతామో చలికాలంలో అందులో 20 శాతం నీటిని కూడా తాగం. ఈ కాలంలో వాతావరణంలో తేమ కూడా ఉండదు. దీని దుష్ప్రభావం శరీర ఆరోగ్యంపై చూపుతుంది. అంతే కాకుండా చర్మం మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. చలికాలంలో ఎక్కువగా అల్లం టీని తాగాలి. గొంతుకు ఉపశమనం కలిగించే అద్భుతమైన మందు అల్లం. పిల్లలు దగ్గు, శ్లేషంతో బాధపడుతుంటే వాళ్లకు అల్లం టీ తాగించడం మంచిది. అల్లం రసం ఉదయాన్ని తాగిస్తే మంచిది. దీని ప్రభావంతో రక్త ప్రసరణ కాస్త మెరుగుపడుతుంది. చలి కారణంగా జీవ క్రియ మందగించకుండా అల్లం కాపాడుతుంది.

చలికాలంలో బెల్లం తినడం ఎంతోమంచిది. బెల్లం తింటే శరీరంలో వేడి పుట్టి అవసరమైన ఉష్ణం నిలిచి ఉంటుంది. బెల్లంలో ప్రొటీన్, మెగ్నీషియం, మినరల్స్, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్‌ మొదలైనవి తగినంత మోతాదులో ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. బెల్లం తినడం వల్ల జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది. శరీరానికి సాధారణంగా పిల్లలు బెల్లం తినడానికి ఇష్ట పడరు. కాబట్టి వారికి బెల్లం హల్వా ఇతర వంటకాలను చేసి తినిపించాలి.

బెల్లంలోని ఐరన్ శరీరానికి శక్తిని ఇస్తుంది. చలికాలంలో దొరికే బత్తాయి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో విటమిన్‌ ‘సి’ ఎక్కువగా ఉంటుంది. వీటిని చలికాలంలో వాడితే చర్మం, జలుబు లాంటి సమస్యలు దరి చేరకుండా వుంటాయి. ఈపండుకు చలువ చేసే స్వభావం ఉంది. రాత్రి పూట కాకుండా ఉదయం ఈ పండు రసం తాగితే మంచిది. కమల పండు కూడా మంచిదే. చలి కాలంలో చిన్న పిల్లల ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్‌ ఫ్రూట్స్‌ను ఎక్కువగా తినేలా చూడాలి. యాపిల్స్, కివీస్, బొప్పాయి తినిపించాలి. చలి కాలంలో గోరు వెచ్చని నీరు తాగడం, చలిగాలులు చెవులకు తగలకుండా స్వెట్టర్లు, మఫ్లర్‌లు, మాస్క్‌లు ధరించడం వల్ల రక్షణ పొందవచ్చు.