Healthy Winter Recipes: చలికాలం మొదలవగానే చర్మం పొడిబారడమే కాదు, ఒంట్లో శక్తి తగ్గిపోయి త్వరగా నీరసపడిపోతుంటాం. ముఖ్యంగా పిల్లల్లో ఎదుగుదలకు, పెద్దల్లో కీళ్ల నొప్పులు రాకుండా ఉండటానికి ఈ సీజన్‌లో బలవర్ధకమైన ఆహారం చాలా అవసరం. అందుకే మన పెద్దవాళ్లు చలికాలం రాగానే ఇంట్లో రకరకాల లడ్డూలు చేసి పెట్టేవాళ్లు. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో గంటల తరబడి వంటగదిలో గడిపే టైమ్ లేకపోయినా, ఎక్కువ కష్టపడకుండా కేవలం నిమిషాల్లోనే ఒక సూపర్ హెల్తీ లడ్డూను తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు వారాల పాటు నిల్వ ఉండే ఈ లడ్డూలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉక్కులాంటి బలాన్నిస్తాయి.
కావాల్సిన పదార్థాలు:
* నువ్వులు: 1 కప్పు
* పల్లీలు (వేరుశనగలు): 1 కప్పు
* బెల్లం తురుము: 1 కప్పు (తీపికి సరిపడా)
* యాలకులు: 4 నుంచి 5
* నెయ్యి: 2 టీస్పూన్లు (ఇష్టమైతేనే)
తయారు చేసే విధానం ఇదే:
ముందుగా స్టవ్ వెలిగించి పాన్‌లో ఒక కప్పు నువ్వులు వేయాలి. మంటను మీడియంలో ఉంచి, నువ్వులు చిటపటలాడే వరకు దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్‌లో మరో కప్పు పల్లీలు వేసి, మీడియం మంటపై 5–6 నిమిషాల పాటు బాగా వేయించాలి. పల్లీలపై పొట్టు లైట్‌గా విడిపోయేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు, పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. (చాలామంది పల్లీల పొట్టు తీసేస్తుంటారు, కానీ ఆ పొట్టులో కూడా మన ఒంటికి పనికొచ్చే ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి పొట్టుతో సహా వేసుకోవడమే మంచిది). ఇందులోనే నాలుగైదు యాలకులు వేసి, ఒకేసారి కాకుండా మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పొడిలో ఒక కప్పు బెల్లం వేసి బాగా కలపాలి. బెల్లం మెత్తగా నలిగి, పిండి కాస్త ముద్ద కట్టేలా మరో అర నిమిషం పాటు మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని, మంచి వాసన, రుచి కోసం రెండు టీస్పూన్ల నెయ్యి వేసి అంతా కలిసేలా కలపాలి. ఆ తర్వాత మీకు నచ్చిన సైజులో చిన్నచిన్న లడ్డూల్లా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన, బలమైన నువ్వుల-పల్లీల లడ్డూలు రెడీ.
ఈ లడ్డూలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
* నువ్వులు, బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తం తక్కువగా ఉన్నవాళ్లు, త్వరగా అలసిపోయేవాళ్లు రోజుకొక లడ్డూ తింటే ఒంట్లో రక్తం పెరిగి పుష్టిగా తయారవుతారు.
* నువ్వుల్లో ఉండే కాల్షియం ఎముకలను గట్టిగా ఉంచుతుంది. ఎదిగే పిల్లలకు, వయసు పైబడిన పెద్దలకు కీళ్ల నొప్పులు రాకుండా ఇది బాగా పనిచేస్తుంది.
* పల్లీలు రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో, బరువును బ్యాలెన్స్ చేయడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సాయపడతాయి.
* చలికాలం చర్మం డ్రై అవ్వకుండా కాంతివంతంగా ఉండటానికి నువ్వులు, పల్లీల్లో ఉండే సహజ నూనెలు ఉపయోగపడతాయి.

