WHO: ప్రపంచంలో అత్యంత సాధారణ కృత్రిమ తీపి పదార్థం క్యాన్సర్ కి కారకంగా ప్రకటించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధం అవుతోంది. కోకా-కోలా డైట్ సోడాల నుండి మార్స్ ఎక్స్‌ట్రా చూయింగ్ గమ్ తో పాటు కొన్ని స్నాప్‌పుల్ డ్రింక్స్ వరకు ఉపయోగించే అస్పర్టమే అనే పదార్థం క్యాన్సర్ కి కారణం అవుతోందని మొదటిసారిగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC)చే జూలైలో జాబితా చేయబడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) క్యాన్సర్ పరిశోధన విభాగం వర్గాలు తెలిపాయి.
ఈ నెల మొదట్లో జరిగిన సమావేశంలో IARC ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో అన్ని సాక్ష్యాధారణను పరిశీలించి ఇది ప్రమాదమా..? కాదా..? అని అంచనా వేశారు. అయితే గతంలో IARC సంబంధించిన పలు పదార్థాల విషయంలో ఇచ్చిన తీర్పులు ఆందోళనలు రేకెత్తించాయి. కొన్ని కోర్టుల వరకు వెళ్లాయి. IARC అంచనాలు గందరగోళానికి దారి తీస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. జూలై 14న IARC తన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది.
మరోవైపు JECFA ( ది జాయింట్ WHO అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ ఎడిటివ్స్) 1981 నుంచి రోజూవారీ పరిమితుల్లో అస్పర్టమే వాడటం సురక్షితమనే పేర్కొంది. ఉదాహరణకు ఒక 60 కేజీలు ఉన్న యుక్త వయస్కుడు రోజుకు 12 నుంచి 36 క్యాన్ల డైట్ సోడాను తాగితే పెద్దగా ప్రమాదం ఉండదని తెలిపింది. ఇలా రెండు సంస్థలు భిన్నవాదనల్ని వినిపిస్తున్నాయి. తాజాగా IARC అస్పార్టమేపై తీసుకునే నిర్ణయం కూల్ డ్రింక్ పరిశ్రమపై పెను ప్రభావం చూపిస్తుందని అంతా అనుకుంటున్నారు. గతంలో 2015లో IARC కలుపు నివారణ మందు ‘గ్లైఫోసెట్’లో క్యాన్సర్ కారకం అని నిర్థారించింది. ఆ సమయంలో యూరోపియన్ ఫుడ్ సేఫ్టి అథారిటీ వంటి ఇతర సంస్థలు ఈ అంచనాలను వ్యతిరేకించాయి. దీనిపై కోర్టు కేసులు కూడా నడిచాయి.
అస్పర్టమే పై చాలా ఏళ్లుగా విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. గతేడాది ఫ్రాన్స్ లక్ష మంది పెద్దలపై ఒక పరిశీలనా అధ్యయనంలో అస్పర్టమేతో పాటు ఇతర కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించే వ్యక్తులు క్యాన్సర్ల ప్రమాదాన్ని కలిగి ఉన్నారని తేలింది. 2000లో ఇటలీలోని రామజ్జినీ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో ఎలుకల్లో వచ్చే క్యాన్సర్లు అస్పర్టమేతో ముడిపడి ఉన్నట్లు తేలింది.