NTV Telugu Site icon

Health news:అధిక ర‌క్త‌పోటుకు కార‌ణ‌మేంటి? దాన్ని ఎలా కంట్రోల్‌లో పెట్టాలి?

Hypertension

Hypertension

వైద్యుడు చెప్పేవరకూ తెలియదు. ఆమాటకొస్తే పరీక్ష చేసేవరకూ వైద్యుడికే తెలియదు. అంత మాయదారి సమస్య హైపర్‌టెన్షన్‌. నియంత్రణలో ఉంచుకుంటే బానిసలా పడి ఉంటుంది. లక్ష్మణరేఖ దాటగానే.. దశకంఠుడిలా విజృభిస్తుంది. సకల రోగాలకూ స్వాగతద్వారం అవుతుంది. బీపీ విషయంలో జీవనశైలి సర్దుబాటుకు సాటివచ్చే చికిత్సా విధానమే లేదు.

అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్‌).. నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తుంది. సునామీలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రళయమై జీవితాన్ని కబళిస్తుంది. మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నామమాత్రమైన శారీరక శ్రమ, వృత్తిగత-వ్యక్తిగత జీవితాల్లోని ఒత్తిళ్లు.. ఇలా రకరకాల కారణాల వల్ల ఈ మధ్య కాలంలో రక్తపోటు బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. ప్రతి వంద మందిలో నలభై అయిదు మందికి రక్తపోటు ఉందంటేనే సమస్య తీవ్రత అర్థం అవుతుంది. రక్తపోటు అధికంగా ఉన్నా, అత్యల్పంగా ఉన్నా ప్రమాదమేనంటారు నిపుణులు.

వ్యాధి కానేకాదు….

గుండె, రక్తనాళాల్లో ప్రవహించే రక్తం వాటి గోడలపై చూపించే ఒత్తిడి లేదా పీడనాన్ని రక్తపోటు అంటారు. వాస్తవానికి రక్తపోటు అనేది రోగం కాదు. రోగ సంకేతమూ కాదు. అదొక జీవ లక్షణం. సాధారణంగా ఒక వ్యక్తి ఆరోగ్య స్థితిని సంక్షిప్తంగా వర్ణించడానికి వైద్యులు నాలుగు రకాల జీవ లక్షణాలను (వైటల్‌ సైన్‌) పరిగణనలోకి తీసుకుంటారు.

ఒకటి.. శరీర ఉష్ణోగ్రత.
రెండు.. నాడి లేదా హృదయ స్పందన.
మూడు.. శ్వాస రేటు.
నాలుగు.. రక్త పోటు.

ఈ నాలుగు జీవ లక్షణాలూ లేకపోతే ఆ వ్యక్తి మరణించినట్లు నిర్ధారిస్తారు. అంటే ఒక మనిషి ప్రాణాలతో ఉండాలంటే.. అతడి శరీరంలో సాధారణ ఉష్ణోగ్రత ఉండాలి, నాడి కొట్టుకోవాలి, హృదయ స్పందన నిరాటంకంగా జరగాలి, శ్వాస పీల్చుకోవాలి. రక్తపోటు కూడా నమోదు కావాలి. ఈ ప్రక్రియలన్నీ సమర్థంగా, సజావుగా సాగకపోతే.. తరచూ హెచ్చుతగ్గులు కనిపిస్తుంటే.. అనారోగ్యం ఖాయం. పరిస్థితి మితిమీరితే మరణమూ తప్పకపోవచ్చు.

స్థాయి దాటితే
రక్తపోటు అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కానీ, ఉండాల్సిన దానికంటే అధికంగా ఉంటేనే దాన్ని అధిక రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్‌ అంటారు. ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉంటే.. దాన్ని హైపోటెన్షన్‌ లేదా లోబీపీ అని వ్యవహరిస్తారు. మన గుండె ఎంత కష్టపడి పనిచేస్తుందన్నది రక్తపోటు సూచిస్తుంది. రక్తనాళాల్లో రక్తం అలలను తలపించేలా ఉరకలు వేస్తూ ప్రవహించడం వల్ల రక్తనాళాల గోడలపై ఒత్తిడి పెరుగుతుంది.

ఈ ఒత్తిడి గుండెకు దగ్గరగా ఉన్నప్పుడు అధికం అవుతూ, దూరం వెళ్తున్నకొద్దీ తగ్గుతూ.. కేశనాళికల దగ్గర నెమ్మది అవుతూ సిరలకు చేరుకుంటుంది. సిరల ద్వారా మరింత నెమ్మదిగా కండరాల సాయంతో మళ్లీ గుండెకు చేరుతుంది. ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన పీడనం ఉండటం వల్ల శరీరమంతటా రక్తపోటు ఒకేలా ఉండదు.

రక్తపీడనం కూడా శరీరమంతా ఒకేలా ఉండదు కాబట్టి, సాధారణంగా జబ్బ భాగాన్ని ప్రామాణికంగా తీసుకొని రక్తపోటును కొలుస్తారు. రక్త పోటులో స్థిరత్వం ఉండదు, తరచూ మారుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడి, పరిసరాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే వైద్యులను చూసినా, వైద్యపరికరాలను చూసినా గుండె దడ మొదలైపోయి, రక్తపోటు హఠాత్తుగా పెరిగిపోతుంది.

రెండు సూచీలు
మనిషి మనుగడకు హృదయ స్పందన చాలా కీలకం. అలా కొట్టుకుంటున్న సమయంలో.. ఓ దశలో గుండె ముడుచుకుపోయినప్పుడు రక్తం ఒక్క ఉదుటున ముందుకు దూకుతుంది. ఆ సమయంలో సహజంగానే రక్తపోటు అధికంగా ఉంటుంది. దీనినే ‘సిస్టాలిక్‌ ప్రెషర్‌’ అంటారు. ఈ పోటు విలువ 100 నుంచి 140mmHg (మిల్లీమీటర్‌ ఆఫ్‌ మెర్క్యురీ) మధ్యలో ఉంటే దాన్ని సాధారణ రక్తపోటుగా పరిగణిస్తారు.

గుండె వ్యాకోచించినప్పుడు లేదా వికసించుకున్నప్పుడు రక్తప్రవాహ పీడనం తక్కువగా ఉంటుంది. దీన్నే ‘డయస్టాలిక్‌ ప్రెషర్‌’ అంటారు. ఇందులో పీడనం 60-90లోపు ఉంటే సాధారణ స్థాయిగా భావిస్తారు. గతంలో ఆరోగ్యవంతుల రక్తపోటును 120/80గా పరిగణించేవారు. మారుతున్న పరిస్థితుల ఆధారంగా 140/90ని సాధారణ రక్తపోటుగా నిర్ధారించారు. ఇంతకంటే ఎక్కువగా ఉంటే హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్నట్టు లెక్క.

రెండు రకాలు :
హైపర్‌టెన్షన్‌ రెండు రకాలు. ఒకటి.. ఎసెన్షియల్‌ హైపర్‌ టెన్షన్‌. ఈ రకమైన హైపర్‌టెన్షన్‌కు కచ్చితమైన కారణాలు ఉండవు. రెండు.. సెకండరీ హైపర్‌టెన్షన్‌. వివిధ కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. అంటే కారణాలు లేకుండా వచ్చేదాన్ని ఎసెన్షియల్‌ హైపర్‌టెన్షన్‌గాను, వివిధ కారణాలతో వచ్చే అధిక రక్తపోటును సెకండరీ హైపర్‌టెన్షన్‌గా పిలుస్తారు.

ప్రధాన కారణాలు:
♦ కుటుంబ నేపథ్యం.
♦ ఊబకాయం.
♦ అధికంగా ఉప్పు తీసుకోవడం.
♦ అధిక బరువు.
♦ మద్యపానం, ధూమపానం.
♦ మానసిక ఒత్తిడి.

లక్షణాలు:
♦ తలనొప్పి.
♦ కళ్లు తిరగడం.
♦ మెడనొప్పి.
♦ త్వరగా అలసిపోవడం.

అనర్థాలు:
♦ బ్రెయిన్‌ స్ట్రోక్‌.
♦ హార్ట్‌ స్ట్రోక్‌.
♦ కిడ్నీల వైఫల్యం.
♦ కంటి చూపు దెబ్బతినడం. కాబట్టి, హైపర్‌టెన్షన్‌ను సకాలంలో నియంత్రించకపోతే ప్రాణహానీ తప్పదు.

జాగ్రత్తలు
♦ హైపర్‌టెన్షన్‌ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి.
♦ నిర్ధారణ జరిగిన వెంటనే నిపుణుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి.
♦ ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
♦ కుటుంబ నేపథ్యం ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.
♦ బరువు పెరగకుండా

జాగ్రత్తపడాలి
♦ ఊబకాయం రాకుండా చూసుకోవాలి.
♦ ముఖ్యంగా ఆహార పదార్థాల్లో ఉప్పు తగ్గించాలి.
♦ రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి. అన్నిటిలోకి నడక ఉత్తమం.
♦ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.
♦ మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
♦ తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

YS Jagan: భారీ విద్యుత్‌ ప్రాజెక్టు.. నేడే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన