Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్‌లో దీనిని చేర్చుకోండి!

Cinema

Cinema

Weight Loss Snack: బరువు తగ్గాలనే లక్ష్యం ఉన్నప్పుడు చాలామందిని వేధించే ప్రధాన సమస్య.. సాయంత్రం వేళ ఆకలి వేయడంతో, నూనెతో కూడిన చిరుతిళ్లపై మనసు లాగడం చాలా సాధారణంగా జరిగే విషయం. అయితే చాలా మంది డైట్‌లో ఉన్నామని వారికి ఇష్టమైన స్నాక్స్‌ను పూర్తిగా దూరం పెడుతుంటారు. ఇలా మీకు నచ్చిన స్నాక్న్‌ను పక్కన పెట్టాల్సిన పనిలేదు. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్, పుష్కలమైన కాల్షియం అందించే రాగులు, చిలగడదుంపల కాంబినేషన్‌లో రుచికరమైన ‘రాగి-స్వీట్ పొటాటో కట్లెట్’ ట్రై చేస్తే ఆకలి తీరడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచడమే కాకుండా, శరీరంలోని కొవ్వును కరిగించడంలోనూ తోడ్పడుతుందని పేర్కొంటున్నారు. ఈ హెల్దీ అండ్ టేస్టీ కట్లెట్‌ను మీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

ఉడికించిన చిలగడదుంపలు: 3 (మీడియం సైజ్)

రాగి పిండి: 1 కప్పు

తురిమిన పనీర్: 1 కప్పు

క్యారెట్ తురుము: 1 మీడియం క్యారెట్

బీట్‌రూట్ తురుము: 1 చిన్నది

ఉల్లిపాయ తరుగు: 1 చిన్నది

పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)

అల్లం తురుము: 1 టేబుల్ స్పూన్

కొత్తిమీర తరుగు: 2 టేబుల్ స్పూన్లు

నువ్వులు: 1 టేబుల్ స్పూన్

జీలకర్ర: 1 టీస్పూన్

చిల్లీ ఫ్లేక్స్: 1 టీస్పూన్

చాట్ మసాలా: 1/2 టీస్పూన్

రుచికి సరిపడా ఉప్పు

నెయ్యి లేదా నూనె: కాల్చడానికి సరిపడా

తయారీ విధానం:

ముందుగా ఉడికించిన చిలగడదుంపలను తొక్క తీసి ఒక బౌల్‌లో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అందులో క్యారెట్ తురుము, బీట్‌రూట్ తురుము, ఉల్లిపాయ తరుగు, పనీర్, పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర కలపాలి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, నువ్వులు, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం రాగి పిండిని వేసి మొత్తం మిశ్రమం పిండి ముద్దలా మారే వరకు చక్కగా కలుపుకోవాలి. అనంతరం చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండి మిశ్రమాన్ని సమాన భాగాలుగా తీసుకుంటూ గుండ్రటి కట్లెట్ (టిక్కీ)ల ఆకారంలో చేసుకోవాలి. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి వేడి చేయాలి. అనంతరం కట్లెట్లను ఉంచి మీడియం మంటపై రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా మారే వరకు 4-5 నిమిషాలు కాల్చుకోవాలి. ఇలా కాకపోతే ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా కాల్చుకోవచ్చు. అయితే 180°C వద్ద 12 నుంచి 15 నిమిషాల పాటు దీనిని బేక్ చేసుకోవాలి. వేడివేడిగా ఉండే ఈ రాగి స్వీట్ పొటాటో కట్లెట్లను పుదీనా కొత్తిమీర చట్నీ, కర్డ్ డిప్ లేదా టొమాటో కెచప్‌తో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి డిన్నర్ లేదా స్నాక్స్‌గా, అలాగే పిల్లలకు లంచ్ బాక్స్/ఈవినింగ్ స్నాక్స్‌గా ఇది అత్యుత్తమ పోషకాహారం అని చెబుతున్నారు.

ఆరోగ్య ప్రయోజనాలు:
* రాగుల్లో ఇతర తృణధాన్యాల కంటే కాల్షియం శాతం చాలా ఎక్కువ. ఇది ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎదుగుతున్న పిల్లలకు, మహిళలకు ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది.

* చిలగడదుంప, రాగుల్లో పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉంటుంది. ఇది తిన్న వెంటనే పొట్ట నిండిన భావనను కలిగించి, అనవసరమైన ఆకలి (క్రేవింగ్స్)ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

* ఈ కట్లెట్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

* ఇందులో చేర్చే పనీర్, రాగి వల్ల శరీరానికి నాణ్యమైన ప్రోటీన్ అందుతుంది. ఇది కండరాల నిర్మాణానికి, రోజంతా శరీరానికి అవసరమైన స్థిరమైన శక్తిని అందించడానికి సహాయపడుతుంది.

* రాగులతో పాటు ఇందులో ఉపయోగించే బీట్‌రూట్, క్యారెట్‌లలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనత (అనీమియా), నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

* రాగులలో ఉండే అమైనో ఆమ్లాలు కాలేయంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా చేస్తాయి. అలాగే చిలగడదుంపలోని పొటాషియం రక్తపోటు (బీపీ)ని అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

* చిలగడదుంప, క్యారెట్, బీట్‌రూట్‌లలో విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తాయి.