NTV Telugu Site icon

Alcohol Kills: ఆల్కహాల్ వల్ల ప్రతీ ఏడాది 30 లక్షల మంది మృతి: డబ్ల్యూహెచ్ఓ

Alcohol

Alcohol

Alcohol Kills: ఆల్కహాల్ వినియోగం ప్రజారోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతీ ఏడాది ఆల్కహాల్ వల్ల దాదాపుగా 30 లక్షల మంది చనిపోతున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇటీవల సంవత్సరాల్లో కొద్దిగా మరణాల సంఖ్య తగ్గినప్పటికీ, ఈ సంఖ్య ఆమోదయోగ్యం కాని అధికంగానే ఉన్నట్లు పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ మద్యం, ఆరోగ్యంపై తాజాగా నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 20 మంది మరణిస్తే అందులో ఒకరు ఆల్కహాల్ వల్లే చనిపోతున్నారని తెలిపింది. ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేయడం, దీని వల్ల చెలరేగే హింస, దుర్వినయోగం, ఇతర వ్యాధులు, రుగ్మతలు ఇందులో ఉన్నాయి.

2019లో ఆల్కహాల్ వినియోగం వల్ల 2.6 మిలియన్ల మరణాలు సంభవించినట్లు నివేదిక పేర్కొంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఈ ఏడాది మొత్తం మరణాల్లో 4.7 శాతం ఆల్కహాల్ వినియోగం వల్ల చోటు చేసుకున్నాయి. ఈ మరణాల్లో మూడోవంత పురుషులే అని చెప్పింది. మత్తుపానీయాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. ఇవన్నీ నివారించగల మరణాలే అని అన్నారు.

Read Also: Bhaichung Bhutia: రాజకీయాలకు ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ గుడ్‌బై

అన్ని సమస్యల్లో ఒక మంచి విషయం ఏంటంటే 2010 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగం కొంత తగ్గిందని నివేదిక పేర్కొంది. కానీ ఆల్కహాల్ వల్ల ఆరోగ్యం, సామాజిక భారం ఇంకా ఎక్కువగానే ఉందని పేర్కొన్నారు. యువత అసమానంగా ప్రభావితమైందని హైలెట్ చేశారు. 2019లో సంభవించిన మరణాల్లో 20-39 వయసున్న వారు 13 శాతం ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

లివర్ సిర్రోసిస్, కొన్ని క్యాన్సర్లతో సహా అనేక పరిస్థితులు మద్యపానంతో ముడిపడి ఉన్నాయి. 2019 లో ఇది సంభవించిన అన్ని మరణాలలో, 1.6 మిలియన్లు సంక్రమించని వ్యాధుల నుండి వచ్చినవారే అని నివేదిక చెప్పింది. వీరిలో 474,000 మంది హృదయ సంబంధ వ్యాధుల వల్ల, 401,000 మంది క్యాన్సర్ వల్ల , 724,000 మంది ట్రాఫిక్ ప్రమాదాల వల్ల, మరికొందరు స్వీయహాని వల్ల మరణించారు. ఆల్కహాల్ దుర్వినియోగం క్షయ, హెచ్ఐవీ, న్యూమోనియా వంటి వ్యాధులకు కారణమవుతోందని నివేదిక పేర్కొంది. 2019లో 209 మిలియన్ల మందికి అల్కహాల్ అలవాటు ఉన్నట్లు, ఇది ప్రపంచ జనాభాలో 3.7 శాతమని చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం తలసరి వినియోగం తొమ్మిదేళ్ల క్రితం 5.7 లీటర్ల నుంచి 2019లో 5.5 లీటర్లకు స్వల్పంగా తగ్గిందని నివేదిక కనుగొంది. 15 ఏళ్లకు పైబడిన ప్రపంచజనాభాలో సగం మంది మద్యానికి దూరంగా ఉన్నారు. యూరప్‌లో ఎక్కువగా మద్యం తీసుకుంటున్నారు, సగటున 9.2 లీటర్ల మద్యాన్ని తాగుతుండగా, అమెరికాలో 7.5 లీటర్లు తాగుతున్నారు. తక్కువ వినియోగం ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల్లో ముఖ్యంగా ముస్లిం దేశాల్లో ఉందని నివేదిక వెల్లడించింది.