Site icon NTV Telugu

Diabetes: రాత్రిపూట మేల్కొని ఉండే అలవాటుతో షుగర్ వ్యాధి ముప్పు..

Late Night Stay

Late Night Stay

Diabetes: రాత్రిపూట మేల్కొని ఉండటం పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. మన జీవగడియారం పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే రాత్రి సమయంలో నిద్రపోకుండా మెలుకువగా ఉంటే మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రాత్రిళ్లు మేలుకుని ఉండే నిద్రా విధానాన్ని ‘క్రోనోటైప్’ ని పిలుస్తారు. ఇది డయాబెటిస్‌ని పెంచుతుంది.

అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. హెల్తీ లైఫ్ స్టైల్ లేనివారు, స్మోకింగ్, శారీరక శ్రమ ఎక్కువగా చేయని వారు, ఆల్కాహాల్ తీసుకునే వారితో పోలిస్తే రాత్రి సమయంలో మెల్కొని ఉండే వారిలో డయాబెటిస్ వచ్చే ముప్పు 19 శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. 8 ఏళ్ల కాలంలో రాత్రి సమయంలో మేల్కొని ఉంటే 72 శాతం డయాబెటిస్ రిస్క్ ను పెంచినట్లు బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ మరియు హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో ప్రధాన రచయిత్రి సినా కియానెర్సీ చెప్పారు.

Read Also: Comet: భూమికి దగ్గరగా రానున్న తోకచుక్క..మళ్లీ 2455లో దర్శనం.. ఇండియాలో కనిపిస్తుందా..?

లేటుగా మేల్కోవడం అనే విధానం జన్యువులతో ముడిపడి ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సహజంగా మానవుడిలో సిర్కాడియన్ రిథమ్ అని పిలువబడే జీవ గడియారం ఉంటుంది. ఇది మెలటోనిన్ అనే నిద్రకు సంబంధించిన హార్మోన్ విడుదలకు సహకరిస్తుంది. సూర్యోదయం కాగానే మెలుకోవాలనే సహజమైన ప్రక్రియ ముందస్తుగా మెలటోనిన్ విడుదల చేస్తుంది. ఇది ఉదయం వేళల్లలో చురకుదనాన్ని పెంచుతుంది. రాత్రి సమయాల్లో మేల్కొని ఉండే వారిలో ఇది ఆలస్యంగా విడుదల అవుతుంది. దీని ఫలితంగా శరీరంలో గజిబిజి తలెత్తుతుంది. ఆలస్యంగా శక్తిని పుంజుకుంటుంది.

మన శరీరంలో ప్రతీ కణం సొంత సిర్కాడియన్ రిథమ్‌కి కట్టుబడి ఉంటుంది. ఆకలి, పేగు కదలికను, వ్యాయామ సామర్థ్యం, రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్దేశిస్తుంది. నిద్రకు భంగం కలిగినప్పుడు శరీరలయ దెబ్బతింటుంది. హార్మోన్ల పనితీరు మారుతుంది. ఈ ప్రభావం మధుమేహ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, గుండె సంబంధ రోగాలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కారణమువుతుంది. ముందుగా పడుకుని , నిద్ర లేచే అలవాటు ఉన్న వారిలో ఈ ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని స్టడీలో తేలింది. దాదాపుగా 64,000 మంది నర్సుల జీవనవిధానాన్ని పరిశీలించిన తర్వాత మధుమేహ రిస్కును ఈ అధ్యయనం ప్రచురించింది.

Exit mobile version