Site icon NTV Telugu

Male Infertility: వీర్య కణాలు నాణ్యతను దెబ్బతీసే ప్రమాద కారకాలు ఇవే.. అధ్యయనంలో వెల్లడి..

Sperm Health

Sperm Health

Male infertility: ప్రస్తుత కాలంలో జీవనశైలి పురుషుల్లో సంతానలేమికి కారణం అవుతోంది. పురుషుల్లో వంధ్యత్వానికి వీర్యకణాలు దెబ్బతినడం కారణమని తెలుస్తోంది. అయితే వీర్యకణాల దెబ్బతినడానికి ప్రమాద కారకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. హంగేరీలోని బుడాపెస్ట్‌లోని సెమ్మెల్‌వీస్ యూనివర్సిటీ పరిశోధకులు స్పెర్మ్ పదార్థాన్ని దెబ్బతీసే అత్యంత ప్రమాదకరమైన కారకాలను తెలుసుకున్నారు. కాలుష్యం, స్మోకింగ్, వేరికోసెల్, డయాబెటిస్, టెస్టికల్ ట్యూమర్, వయస్సు వంటివి స్మెర్మ నాణ్యతపై ప్రభావం చూపిస్తున్నట్లుగా తేలింది.

ఈ అధ్యయనం రిప్రొడక్టివ్ బయాలజీ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. వీర్యకణాల్లోని జన్యు పదార్థం ఫ్రాగ్మెంటేషన్ ను గణనీయంగా ప్రభావితం చేసే కారకాలపై అధ్యయనం చేశారు. డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ విశ్లేషణ అనే పద్దతి ద్వారా వీర్య కణాల పనితీరును అంచానా వేస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక పద్దతి ఇదే. ఇది స్మెర్మ్ డీఎన్ఏ కంటెంట్ ను పరిశీలిస్తుంది. దీని ద్వారా స్మెర్మ్ కణాల్లోని జన్యుపదార్థం చెక్కు చెదరకుండా ఉందా..? లేక విచ్ఛిన్నంగా ఉందా..? అనే దాన్ని తెలియజేస్తుంది. డీఎన్ఏ ఎక్కువగా విచ్ఛిన్నం అయినట్లు ఉంటే ఫలదీకరణం చేసే స్మెర్మ్ సామర్థ్యం తక్కువగా ఉంటుందని, ఇది గర్భస్రావ ప్రమాదాన్ని పెంచుతుందని సెమ్మెల్వీస్ విశ్వవిద్యాలయంలోని యూరాలజీ విభాగంలో ఆండ్రాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ జ్సోల్ట్ కోపా అన్నారు.

Read Also: Mansukh Mandaviya: 157 నర్సింగ్ కాలేజీలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం..

దాదాపుగా 27,000 అధ్యయనాలను ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. ప్రస్తుత అధ్యయనంలో స్మోకింగ్ చేయని వారితో పోలిస్తే చేసే వారిలో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ సగటున 9.19 శాతం పెరిగిందని పరిశోధకులు నిరూపించారు. ఇది కాకుండా ఆల్కాహాల్ వినియోగం, శరీర బరువు స్మెర్మ్ నాణ్యతపై ప్రభావాన్ని చూపిస్తున్నట్లుగా తేలింది. క్లామిడియా, హ్యూమన్ పాపిలో వైరస్(హెచ్పీవీ) వంటి కొన్ని ఇన్ఫెక్షన్లు స్మెర్మ్ నాణ్యతను దెబ్బతీయలేదు, కానీ బ్యాక్టీరియా, ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులు డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ను (8.89 శాతం, 5.54 శాతం) పెంచాయని తేలింది.

గతంలో జరిగిన అధ్యయనాల్లో పాశ్చాత్య అభివృద్ధి చెందిన దేశాల్లో సంతానోత్పత్తి రేటు తగ్గుతోందని, ఆరు జంటల్లో ఒకరు వంధ్యత్వం సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. దీనికి డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఒకటి కావచ్చని, అందువల్ల పిల్లల కోసం ప్రయత్నించే ముందు జీవనశైలిలో దురాలవాట్లను తగ్గించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మోకింగ్, ఆల్కాహాల్ మానేయడం, శారీరక శ్రమ పెంచడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

Exit mobile version