Poor oral hygiene could decline brain health: మీరు నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం లేదా..? అయితే మీ మెదడు ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. తాజాగా ఓ అధ్యయనం సూచించింది ఇదే. నోటి శుభ్రంగా ఉంచుకోకపోతే ఇది మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2023లో సమర్పించిన ఓ నివేదిక వెల్లడించింది. ప్రాథమిక పరిశోధన ప్రకారం నోటి పరిశుభ్రత మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉంది.
గమ్ డిసీజ్, అపరిశుభ్రమైన నోటి ఆరోగ్యం బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనం సూచిస్తోంది. అయితే మెదడు, నోటి ఆరోగ్యానికి ఉన్న సంబంధంపై ఎటువంటి ఆధారాలు లేవు. ఎంఆర్ఐ వంటి పరికరాలు ఉపయోగించి మెదడు పనితీరును పరిశీలిస్తున్నామని, అయితే నోటి ఆరోగ్యం, మెదడును స్పష్టంగా దెబ్బతీస్తుందా..? అనేది స్పష్టంగా తెలియలేదని అధ్యయన రచయిత సైప్రియన్ రివియర్ చెప్పారు. మెదడు ఆరోగ్యం, గుండె జబ్బుల, స్ట్రోక్ వంటివి జీవనశైలి ద్వారా ప్రభావితం అవుతాయి.. ఇందులో ఒకటి దంతాలు, చిగుళ్ల అపరిశుభ్రత కూడా కావచ్చని, అందుకే నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
2014 నుంచి 2021 మధ్య ఎలాంటి స్ట్రోక్ చరిత్ర లేని 4000 మంది వ్యక్తుల్లో నోటి ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం మధ్య సంబంధాన్ని పరిశోధకులు విశ్లేషించారు. జన్యుపరంగా క్యావిటీలు, తప్పిపోయిన దంతాలు ఉన్నవారి మెదడు ఆరోగ్యం బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. నోటి ఆరోగ్యం మెదడు నిర్మాణాన్ని నిర్మాణాల్ని కూడా దెబ్బతీసింది, ఇది జ్ఞాపకశక్తి, బ్యాలెన్స్, మొబిలిటీని దెబ్బతీసింది. ఎంఆర్ఐ స్కాన్ లలో కనిపించే మైక్రోస్ట్రక్చరల్ డ్యామేజ్ స్కోర్ లలో 43 శాతం మార్పు కనిపించింది. స్మోకింగ్, డయాబెటిస్ వంటి ఆరోగ్య పరిస్థితులు నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని, ఇవి జన్యుపరమైన కారణాల కన్నా ప్రమాదకరమైనవిగా పరిశోధన పేర్కొంది.