Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!

  • పాలకూరలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు
  • చట్నీకి కావాల్సిన పదార్థాలు
  • సులభంగా తయారు చేసే విధానం
  • ఎన్నో రోజులు తాజాగా నిల్వ చేసే చిట్కా
Palak Chutney

Palak Chutney

Palakura Chutney Recipe in Telugu: సాధారణంగా మనం ప్రతిరోజూ ఇళ్లలో టిఫిన్లలోకి పచ్చిమిర్చి చట్నీ, కొబ్బరి చట్నీ లేదా ఎండుమిర్చి చట్నీలనే తయారు చేస్తుంటాం. రోజూ ఒకే రకమైన చట్నీలు తిని బోర్ కొట్టిన వారికి, రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే ‘పాలకూర చట్నీ’ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.

పోషకాల గని – పాలకూర
పాలకూరలో ప్రొటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం , ఫైబర్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత (ఎనీమియా) సమస్యను నివారించడంలో , ఎముకలను బలంగా ఉంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వేడివేడి అన్నం, చపాతీ, ఇడ్లీ , దోశల్లోకి ఈ చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది.

చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు

  • పాలకూర: 1 కప్పు (శుభ్రం చేసినది)
  • నూనె: 2 టేబుల్ స్పూన్లు
  • మినపపప్పు, శనగపప్పు: ఒక్కో టేబుల్ స్పూన్
  • తురిమిన కొబ్బరి: అర కప్పు
  • తెల్ల నువ్వులు: 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు: 5 నుండి 7
  • పచ్చిమిరపకాయలు: 2 (కారానికి తగినట్లుగా)
  • చింతపండు: ఒక చిన్న ముక్క
  • ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం

ముందుగా పాలకూరను ఆకులుగా వేరు చేసి నీటిలో శుభ్రంగా కడగాలి. స్టవ్ వెలిగించి పాన్‌లో నూనె వేసి, నూనె వేడెక్కాక పాలకూరను వేసి సన్నని మంటపై మెత్తబడే వరకు వేయించి వేరొక పాత్రలోకి తీసుకోవాలి.

అదే పాన్‌లో మరో స్పూన్ నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేయించాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపపప్పు వేసి దోరగా వేయించి, చివరిగా తురిమిన కొబ్బరి, నువ్వులు, ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

దింపిన మిశ్రమం చల్లారిన తర్వాత, వేయించిన పాలకూర, మసాలాలు, చింతపండు, ఉప్పు , కొద్దిగా నీళ్లు చేర్చి మిక్సీ జార్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పాలకూర చట్నీ సిద్ధమవుతుంది. ఈ చట్నీని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటుంది.