NTV Telugu Site icon

Fitness Tips: ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?

Walking

Walking

ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ అవసరం. అందు కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఒకవేళ వ్యాయామం చేయడానికి సమయం లేకపోతే.. కనీసం కాలి నడక అయినా అలవాటు చేసుకోవాలి. రోజువారీ నడక అలవాటు శారీరక శ్రమను పెంచుతుంది. అంతేకాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎముకల దృఢత్వం, మానసిక ఆరోగ్యం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడతాయి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొన్ని అడుగులు నడవాలి. అయితే ఎన్ని అడుగులు లేదా కిలోమీటర్ల నడక శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందో మీకు తెలుసా. ఎక్కువ నడవడం వల్ల హాని కలుగుతుందా లేక ప్రయోజనకరంగా ఉంటుందా..? తెలుసుకుందాం.

ఒక రోజులో ఎన్ని అడుగులు నడవాలి..?
రోజుకు 10000 అడుగులు నడవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 10000 అడుగులు దాదాపు 7 నుండి 8 కిలోమీటర్ల దూరానికి సమానం. అయితే.. ఇది వ్యక్తి వయస్సు, ఆరోగ్యం, ఫిట్‌నెస్ స్థాయి, నడక సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 10000 అడుగులు నడవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. నడక మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

ప్రారంభంలో ఎన్ని అడుగులు నడవాలంటే..?
మొదటి రోజే 10,000 అడుగులు నడిచి శరీరంపై ఎక్కువ ఒత్తిడిని పెట్టొద్దు. ప్రారంభంలో 5000 నుండి 7000 అడుగులను లక్ష్యంగా పెట్టుకోవాలి. దశల వారిగా సంఖ్యను పెంచుకుంటూ పోవాలి.

వృద్ధులు ఎంత నడవాలి..?
వృద్ధులు 4000 నుండి 6000 అడుగులు నడిస్తే వారి ఆరోగ్యానికి మంచిది. వారి శారీరక సామర్థ్యానికి తగ్గట్టుగా నడవాలి.

బరువు తగ్గడం కోసం:
బరువు తగ్గడం లేదా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ జీవనశైలిలో యాక్టివిటీని పెంచుకోవాలనుకునే వారు 12000 నుండి 15000 అడుగులు నడవడానికి ప్రయత్నించాలి. బరువు తగ్గడానికి, ఉదయం 30 నిమిషాలు నడవండి. మీ భోజన విరామ సమయంలో లేదా రాత్రి భోజనం తర్వాత 15-30 నిమిషాలు నడవాలి.

Show comments