Health Tips in Telugu: నేటి కాలంలో శారీరక దృఢత్వం (Fitness) పట్ల యువతలో ఆసక్తి పెరిగింది. అయితే, జిమ్‌లో కసరత్తులు చేసే క్రమంలో తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ముఖ్యంగా వారాంతాల్లో పార్టీలు చేసుకుని, ఆ మరుసటి రోజే జిమ్‌లో భారీ వర్కౌట్లు చేయడం వల్ల గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పార్టీ తర్వాత జిమ్ ఎందుకు ప్రమాదకరం?
సాధారణంగా శని, ఆదివారాల్లో మద్యం సేవించి పార్టీలు చేసుకునే వారు, సోమవారం నాడు ఆ ఉత్సాహంలో జిమ్‌కు వెళ్లి కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. అయితే, పార్టీల సమయంలో తీసుకునే రకరకాల పానీయాలు , మద్యం వల్ల శరీరం తీవ్రమైన డీహైడ్రేషన్ కి (Dehydration) గురవుతుంది. దీనివల్ల శరీరంలోని నీరు, ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతాయి. అటువంటి స్థితిలో సోమవారం నాడు చేసే భారీ వర్కౌట్లు గుండెపై అదనపు భారాన్ని మోపుతాయని కైలాష్ దీపక్ హాస్పిటల్ డైటీషియన్ డాక్టర్ రిచా శర్మ పేర్కొన్నారు.
కనిపించే లక్షణాలు , ఆరోగ్య సమస్యలు
తల తిరగడం , నీరసం: శరీరం డీహైడ్రేషన్కి గురైనప్పుడు జిమ్‌లో వ్యాయామం చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. వర్కౌట్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుంది.
గుండెపై ప్రభావం: హృదయ స్పందన రేటు పెరగడం, రక్తపోటులో (Blood Pressure) అసమతుల్యత ఏర్పడటం వంటివి గుండెపోటుకు దారితీయవచ్చు.
కండరాల నొప్పులు: ఎలక్ట్రోలైట్ల లోపం వల్ల కండరాల సామర్థ్యం తగ్గుతుంది.
శరీర ఉష్ణోగ్రత: తీవ్రమైన డీహైడ్రేషన్ వల్ల శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేక వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.
నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు : ఫిట్‌నెస్ అంటే కేవలం జిమ్‌కు వెళ్లడం మాత్రమే కాదు, మీ శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోవడం కూడా. పార్టీ చేసుకున్న మరుసటి రోజు ఈ నియమాలు పాటించడం మంచిది.
నీటి శాతం పెంచండి: శరీరానికి తిరిగి నీటిని అందించడానికి కొబ్బరి నీరు, ఎలక్ట్రోలైట్స్ , తాజా పండ్ల రసాలు తీసుకోవాలి.
తేలికపాటి వ్యాయామం: శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే భారీ కసరత్తులకు బదులుగా నడక, యోగా లేదా స్ట్రెచింగ్ వంటివి చేయాలి.
విశ్రాంతి: వ్యాయామం ఎంత ముఖ్యమో, కండరాలు తిరిగి కోలుకోవడానికి (Recovery) శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం కూడా అంతే ముఖ్యం.
ప్రతీక్ యాదవ్ మరణం – ఒక హెచ్చరిక
బాడీబిల్డింగ్‌లో ప్రసిద్ధి చెందిన సమాజ్‌వాదీ పార్టీ నేత ప్రతీక్ యాదవ్ (అఖిలేష్ యాదవ్ సోదరుడు) ఇటీవల గుండెపోటుతో మరణించినట్లు వార్తలు రావడం ఫిట్‌నెస్ ప్రేమికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫిట్‌నెస్ పట్ల అమితమైన ఆసక్తి ఉన్నప్పటికీ, ఇటువంటి విషాదాలు చోటుచేసుకోవడం వర్కౌట్ల విషయంలో సరైన అవగాహన , జాగ్రత్తలు ఎంత అవసరమో గుర్తుచేస్తోంది.
