రోజులో ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం మితంగా తినడం ఎంత అవసరమో, ఆలోచనలు సహజమైనప్పటికీ అధిక ఆలోచనలు మానసిక ఒత్తిడికి దారితీసినట్లే, నిద్ర విషయంలో కూడా పరిమితిని అధిగమించడం శారీరక పనితీరుపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నిద్రలేమి ఎలా హానికరమో, అలాగే అతి నిద్ర కూడా అంతే ప్రమాదకరమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
సాధారణంగా పెద్దలు రోజుకు 7–8 గంటలు నిద్రపోతే సరిపోతుంది. అయితే ప్రతిరోజూ 9 గంటలకంటే ఎక్కువ నిద్రపోతే శరీరంలో పలు ప్రక్రియలు మందగించి, హృదయ పనితీరు తగ్గుతుంది. మెదడు కార్యకలాపాలు నెమ్మదించడం, మెటాబాలిక్ వ్యర్థాలు సరిగా తొలగిపోకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. దీర్ఘకాలంలో ఇవి గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, డిప్రెషన్, తలనొప్పులు మరియు ముందస్తు మరణ ప్రమాదం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు 9 గంటలకంటే ఎక్కువ నిద్రపోతే రక్తప్రసరణ తగ్గడం వల్ల హృదయ కండరాలు బలహీనపడే ప్రమాదం ఉంది. దీనివల్ల హార్ట్ డిసీజ్ మరియు హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 38–50% వరకూ పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదేవిధంగా, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి రక్తంలో షుగర్ నియంత్రణ దెబ్బతినడంతో టైప్–2 డయాబెటిస్ ప్రమాదం సుమారు 50% వరకు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అతి నిద్ర వల్ల కార్టిసాల్ హార్మోన్ అధికంగా విడుదలై పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువ. దీని ప్రభావంతో ఊబకాయం (ఒబేసిటీ) ప్రమాదం 20–30% వరకు పెరుగుతుంది. రోజుకు 9 గంటలకు మించి నిద్రపోవడం తలనొప్పి, మైగ్రేన్, టెన్షన్ హెడ్‌ఏక్స్, వర్టిగో వంటి సమస్యలకు దారితీస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా, మొత్తం మరణ ప్రమాదం 30–45% వరకూ పెరుగుతుందని కూడా పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
ఈ సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అధ్యయనాల ఆధారంగా సేకరించబడింది. మీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సందేహాల కోసం తప్పనిసరిగా నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమం.