Gongura Pulihora: మనం సాధారణంగా చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర తింటూనే ఉంటాం. కానీ గోంగూరతో చేసే పులిహోర రుచి ఎప్పుడైనా చూశారా. కేవలం రుచి మాత్రమే కాదు, గోంగూరలో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. మరి పది నిమిషాల్లోనే ఎంతో రుచికరమైన గోంగూర పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు..
అన్నం: పావు కిలో (పొడిపొడిగా వండుకున్నది)
గోంగూర: ఒక మీడియం సైజు కట్ట (పుల్ల గోంగూర అయితే రుచి బాగుంటుంది)
చింతపండు: కొద్దిగా (రుచి కోసం)
పోపు దినుసులు: పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు
పచ్చిమిర్చి: 7-8 (పులిహోరకి పచ్చిమిర్చి కారమే రుచి)
ఎండుమిర్చి: 4
ఇంగువ: పావు టీస్పూన్
ఆవపిండి: అర టీస్పూన్
నూనె, ఉప్పు, పసుపు, కరివేపాకు: సరిపడా
తయారీ విధానం..
ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి, గోంగూరను వేసి మగ్గించాలి. నీరు అంతా పోయే వరకు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి కలిపి, చల్లారాక మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కళాయిలో నూనె వేసి కాగాక పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి దోరగా వేయించాలి. అందులోనే పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాలింపు వేగాక గ్రైండ్ చేసిన గోంగూర పేస్ట్, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి ఒక 30 సెకన్ల పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
పొడిపొడిగా ఉన్న అన్నాన్ని గోంగూర మిశ్రమంలో వేసి బాగా కలపాలి. చివరగా అర టీస్పూన్ ఆవపిండి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పులిహోరకి అసలైన రుచి ఆవపిండి వల్లే వస్తుంది. అయితే ఆవపిండి వేసిన వెంటనే తినకుండా కనీసం 2 గంటలు మగ్గనివ్వాలి, లేదంటే చేదుగా ఉంటుంది. ఎర్ర గోంగూర (పుల్ల గోంగూర) వాడితే పులిహోర మరింత రుచిగా ఉంటుంది. ఇది పిల్లలకి, పెద్దలకి లంచ్ బాక్సుల్లోకి పెట్టడానికి చాలా త్వరగా అయిపోయే, రుచికరమైన వంటకం. ఈసారి పులిహోర చేయాలనుకుంటే చింతపండుకు బదులుగా ఇలా గోంగూరతో ట్రై చేయండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచి రెండింటినీ ఎంజాయ్ చేయండి.
