Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!

Sugar Free Lassi Recipe

Sugar Free Lassi Recipe

Sugar Free Lassi Recipe: వేసవి కాలంలో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు చల్లని పదార్థాలను.. ద్రవ పదార్థాలను తీసుకుంటాం.. ఇక, ఈ సమయంలో చల్లటి లస్సీ తాగితే శరీరానికి వెంటనే తేలికగా అనిపిస్తుంది. ముఖ్యంగా మండే ఎండలో ఒక గ్లాసు చిక్కటి, క్రీమీ లస్సీ తాగితే అలసట మొత్తం పోయినట్టే. అయితే, లస్సీలో ఎక్కువగా చక్కెర వేయడం వల్ల బరువు పెరుగుతామేమోనని చాలామంది దానికి దూరంగా ఉంటారు. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేవారు, డయాబెటిస్ ఉన్నవారు కూడా లస్సీ తాగడాన్ని తగ్గిస్తుంటారు. అయితే ఇప్పుడు చక్కెర లేకుండానే తియ్యగా, క్రీమీగా ఉండే లస్సీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో చక్కెరకు బదులుగా సహజమైన తీపి పదార్థాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. రుచిలో మాత్రం ఎలాంటి తగ్గుదల ఉండదు.

సహజ తీపితో ఆరోగ్యకరమైన లస్సీ
ఈ ప్రత్యేక లస్సీ రెసిపీలో ఖర్జూరాలు, తేనె వంటి సహజ తీపి పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి లస్సీకి తీపి ఇవ్వడమే కాకుండా దానిని మరింత చిక్కగా, క్రీమీగా మారుస్తాయి. తాజా మీగడ పెరుగు ఉపయోగిస్తే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు
* తాజా చిక్కటి పెరుగు – 2 కప్పులు
* చల్లటి పాల మీగడ – 2 నుంచి 3 టీస్పూన్లు
* గింజలు తీసిన ఖర్జూరాలు – 4 నుంచి 5
* తేనె – 1 టీస్పూన్ (ఐచ్ఛికం)
* యాలకుల పొడి – చిటికెడు
* చల్లటి నీరు లేదా ఐస్ క్యూబ్స్ – అవసరమైనంత
* తరిగిన బాదం, పిస్తా – అలంకరణ కోసం

తయారీ విధానం
ముందుగా ఖర్జూరాలను కొద్దిసేపు నీటిలో నానబెట్టి గింజలు తీసేయాలి. తరువాత వాటిని కొద్దిగా చల్లటి నీరు లేదా పాలతో కలిసి మిక్సర్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో తాజా పెరుగు, ఖర్జూర పేస్ట్, యాలకుల పొడి, సగం మీగడ వేసి బాగా కలపాలి. మిక్సర్‌లో వేస్తే కేవలం 10 నుంచి 15 సెకన్ల పాటు మాత్రమే పల్స్ చేయాలి. ఎక్కువగా బ్లెండ్ చేస్తే లస్సీ పల్చగా మారే అవకాశం ఉంటుంది. తయారైన చిక్కటి లస్సీని గ్లాసులో లేదా మట్టి కుండలో పోయాలి. పైగా మిగిలిన మీగడ వేసి, తరిగిన బాదం, పిస్తాతో అలంకరించాలి.

రుచితో పాటు ఆరోగ్యం కూడా
ఈ లస్సీలో చక్కెరకు బదులుగా ఖర్జూరాలు ఉపయోగించడం వల్ల సహజ తీపి లభిస్తుంది. అలాగే పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు మేలు చేస్తాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు శక్తిని కూడా ఇస్తుంది. చల్లగా సర్వ్ చేస్తే ఈ షుగర్ ఫ్రీ లస్సీ రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.. ఇంకా ఎందుకు ఆలస్యం.. ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేయగల ఈ లస్సీ ట్రై చేయండి మరి..