Moringa Chutney Recipe: మునగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మునగ కాయలే కాదు.. మునగ ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ సూపర్ ఫుడ్.. ఇందులో ఇనుము, కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే మునగాకు కొద్దిగా చేదుగా ఉండటంతో చాలా మంది తినడానికి ఆసక్తి చూపరు. కానీ అదే మునగాకుతో రుచికరమైన చట్నీ చేస్తే మాత్రం చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు.
మునగ చట్నీ ప్రత్యేకత ఏమిటి?
మునగాకు శరీరంలో రక్తహీనత తగ్గించడంలో, ఎముకలు బలపడటంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనితో చేసే కారంగా ఉండే చట్నీ అన్నం, ఇడ్లీ, దోసె, చపాతీతో కూడా బాగా సరిపోతుంది. వేసవి కాలంలో శరీరానికి శక్తినిచ్చే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అలాంటి సమయంలో మునగ చట్నీ మంచి ఎంపిక. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అద్భుతమైన రుచి వస్తుంది.
కావలసిన పదార్థాలు:
* మునగాకు – 1 కప్పు (కడిగినవి)
* శనగపప్పు – 1 టీస్పూన్
* మినపపప్పు – 1 టీస్పూన్
* కరివేపాకు – 8 నుంచి 10 ఆకులు
* వెల్లుల్లి రెబ్బలు – 4 నుంచి 5
* వేరుశెనగలు – 2 టేబుల్ స్పూన్లు
* పచ్చిమిర్చి – 2
* ఎండుమిర్చి – 2
* జీలకర్ర – 1 టీస్పూన్
* చిటికెడు ఇంగువ
* చింతపండు – చిన్న ముక్క
* ఉప్పు – రుచికి సరిపడా
* నెయ్యి – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో శనగపప్పు, మినపపప్పు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి, వేరుశెనగలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు కడిగిన మునగాకులను వేసి ఉప్పు కలపాలి. మునగాకు బాగా మగ్గే వరకు వేపాలి. అయితే పూర్తిగా ఎండిపోకుండా కొద్దిగా తేమ ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి చింతపండు కలిపి కొద్దిగా బొరుసుగా గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా చేయకపోతే చట్నీ రుచి మరింత బాగుంటుంది.
ఇలా తింటే రుచి రెట్టింపు
వేడి వేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసి ఈ మునగ చట్నీ కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోసె, రొట్టెలతో కూడా ఆస్వాదించవచ్చు. రుచితో పాటు ఆరోగ్యం కూడా కావాలనుకుంటే ఈరోజే ఇంట్లో మునగ చట్నీ ట్రై చేయండి.. రెగ్యులర్ చెట్నీలతో బోర్ కొట్టే వారికి రుచితో పాటు విటమిన్లు కూడా పుష్కలంగా ఉండే ఎంపిక అవుతుంది..
