Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!

Ragi Samosa Recipe

Ragi Samosa Recipe

Ragi Samosa Recipe: సమోసాలు అంటే అందరికీ ఎంతో ఇష్టం. సాయంత్రం పూట వేడివేడి టీతో సమోసా తింటూ కబుర్లు చెప్పుకోవడం చాలామందికి అలవాటు. అయితే, రోజూ ఒకేలాంటి మైదా లేదంటే గోధుమ పిండితో చేసిన బంగాళాదుంప సమోసాలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త కొత్తగా, ఆరోగ్యకరంగా రాగి పిండితో సమోసాలు ట్రై చేయండి. రాగి పిండితో చేసే ఈ సమోసాలు రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా, బంగాళాదుంప, బఠాణీ, జీడిపప్పు, కిస్మిస్‌లతో చేసే స్టఫింగ్ వీటి ప్రత్యేకతను మరింత పెంచుతుంది. రాగిలో క్యాల్షియం, పీచు పదార్థం (ఫైబర్) వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని సాయంత్రం వేళ స్నాక్స్‌లా చేసుకోవచ్చు లేదా ఇంట్లో అతిథులు వస్తే క్షణాల్లో వడ్డించవచ్చు.

తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
220 గ్రాముల రాగి పిండి
అర టీస్పూన్ వాము
అర టీస్పూన్ జీలకర్ర
1 పచ్చిమిర్చి (సన్నగా తరిగినది)
20 గ్రాముల కిస్మిస్
అర టీస్పూన్ పసుపు
25 గ్రాముల ఉడికించిన బంగాళాదుంప
40 గ్రాముల ఉడికించిన బఠాణీ
20 గ్రాముల జీడిపప్పు ముక్కలు
2 దోసకాయలు (సన్నగా తరిగినవి)
5 గ్రాముల అల్లం తరుగు
ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు
ఒక గుప్పెడు పుదీనా ఆకులు
తగినంత ఉప్పు
అవసరమైనన్ని నీళ్లు
వేయించడానికి సరిపడా నూనె

తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని జల్లెడ పట్టుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రాణాన్ని మైక్రోవేవ్‌లో 30 నుంచి 40 సెకన్ల పాటు వేడి చేసి, ఆ తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో తగినంత రాగి పిండి, వాము, ఉప్పు వేసి గట్టిగా పిండిలా కలుపుకోవాలి. ఆ పిండిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బాణీలో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపటలాడాక అల్లం తరుగు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఒకటి రెండు నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత తరిగిన దోసకాయ ముక్కలు, పసుపు, ఉడికించిన బఠాణీ, బంగాళాదుంప వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి 3 నుంచి 4 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి దించేయాలి. ఈ స్టఫింగ్‌ను పూర్తిగా చల్లారనివ్వాలి.

ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండితో చిన్న చిన్న ఉండలు చేసి, వాటిని గుండ్రంగా లేదా కోలగా పూరీలా ఒత్తుకోవాలి. వాటిని మధ్యలోకి కట్ చేసి రెండు భాగాలుగా చేయాలి. అంచులపై కొద్దిగా నీళ్లు రాసి రెండు మునులను కలిపి కోన్ ఆకారంలో చేసుకోవాలి. అందులో తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్‌ను నింపి అంచులను గట్టిగా మూసేయాలి. కడాయిలో నూనె వేడి చేసి, ఈ సమోసాలను మంట మధ్యస్థంగా ఉంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండటానికి వీటిని టిష్యూ పేపర్‌లోకి తీసుకోవాలి. అంతే, గుల్లగా ఉండే వేడివేడి రాగి సమోసాలు సిద్ధం. వీటిని పచ్చడి లేదా చింతపండు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఒకవేళ నూనెలో వేయించడం ఇష్టం లేకపోతే, మైక్రోవేవ్ కన్వెక్షన్ మోడ్‌లో కూడా వీటిని కాల్చుకోవచ్చు. సమోసాలపై కొద్దిగా నూనె రాసి మైక్రోవేవ్‌లో బంగారు రంగు వచ్చేవరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. మైదా సమోసాలతో పోలిస్తే రాగిలో క్యాల్షియం, ఫైబర్ ఎక్కువ కాబట్టి ఇది చాలా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. రోజూ తినే అల్పాహారంలో ఏదైనా మార్పు కోరుకుంటే రాగి సమోసాలు బెస్ట్ ఛాయిస్.