Poori vs Paratha: ఉదయం అల్పాహారంలో వేడి వేడి పూరీ లేదా పరాఠా అంటే చాలా మందికి ఇష్టం. అయితే రుచికరంగా అనిపించే ఈ రెండు ఆహారాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక నూనె, నెయ్యి వినియోగం కారణంగా పూరీ, పరాఠా రెండింటిలోనూ క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండటంతో వాటిని తరచుగా తినడం మంచిది కాదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు..
పూరీలు ఎందుకు ప్రమాదకరం?
పూరీలను పూర్తిగా నూనెలో ముంచి వేయించడం వల్ల అవి అధిక మొత్తంలో నూనెను పీల్చుకుంటాయి. అదే నూనెను పదేపదే వేడి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచి గుండె జబ్బుల ముప్పును అధికం చేస్తాయి. అంతేకాకుండా పూరీల్లో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉండటంతో తరచూ తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
పరాఠా కూడా అంతే ప్రమాదమా?
పరాఠాను నూనెలో ముంచి వేయించకపోయినా, తయారీలో ఉపయోగించే నూనె లేదా నెయ్యి పరిమాణం దానిని కూడా అధిక కొవ్వు కలిగిన ఆహారంగా మారుస్తుంది. ముఖ్యంగా ఆలూ, పనీర్, చీజ్ వంటి స్టఫింగ్‌లతో చేసే పరాఠాల్లో క్యాలరీలు మరింత పెరుగుతాయి. వెన్న, పచ్చడి వంటి వాటితో తినడం వల్ల సోడియం, కొవ్వు శాతం కూడా అధికమవుతుంది.
నిపుణులు ఏమంటున్నారు?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పూరీల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద వేయించడం వల్ల ఎక్కువ రసాయన మార్పులు జరుగుతాయి. మరోవైపు, నూనె లేదా నెయ్యి ఎక్కువగా ఉన్న పరాఠాలు కూడా జీర్ణక్రియను మందగించి ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ఈ రెండింటినీ ప్రతిరోజూ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే పరిమితంగా తీసుకోవడం మంచిది.
ఆరోగ్యంగా ఉండాలంటే…
పూరీ, పరాఠా రెండింటినీ తినేటప్పుడు నూనె, నెయ్యి పరిమాణాన్ని తగ్గించడం ఉత్తమం. వీటిని రోజువారీ అల్పాహారంగా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తక్కువ నూనెతో తయారుచేసిన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం, బరువు నియంత్రణ రెండింటినీ కాపాడుకోవచ్చు.

