Site icon NTV Telugu

Peanut Chikki: వంటరాని వారు కూడా ‘సింపుల్’గా చేసే పర్ఫెక్ట్ పల్లిపట్టి.. ఇలా చేయండి!

Peanutchikki

Peanutchikki

Peanut Chikki: చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన స్నాక్ ‘పల్లి పట్టి’. బెల్లం, వేరుశెనగ పప్పులతో చేసే ఈ చిక్కీ రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇంట్లో చేసేటప్పుడు చాలామందికి ఇది పంటికి అంటుకుపోవడం లేదా మెత్తగా అవ్వడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో స్వీట్ షాపులో లాగా కరకరలాడే పర్ఫెక్ట్ పల్లి పట్టిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: CSK vs DC: సంజు శాంసన్ షాందార్‌ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం!

దీనికి కావాల్సినవి ఇవే..

వేరుశెనగ పప్పు: ఒక కప్పు (దోరగా వేయించి, పొట్టు తీసిన పలుకులు).

బెల్లం తురుము: ముప్పావు కప్పు (ఇదే సరైన రేషియో).

తయారీ విధానం ఇదే..
చిక్కీ పర్ఫెక్ట్‌గా రావాలంటే బెల్లం పాకమే ప్రధానం. ముందుగా గ్యాస్‌పై ఒక పాత్రను పెట్టి అందులో బెల్లం వేసి కరిగిన తర్వాత దానిని వడకట్టి, మట్టి లేకుండా చూసుకోవాలి. పాకాన్ని ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో నీటిలో వేసి చెక్ చేయాలి. ఉండ కట్టినప్పుడు సాగితే అది ఇంకా రెడీ అవ్వలేదని అర్థం. ఒకవేళ ఆ స్థితిలో పల్లీలు కలిపితే చిక్కీ పంటికి అంటుకుపోతుంది. క్రిస్పీనెస్ కోసం పాకాన్ని నీటిలో వేసినప్పుడు అది గట్టి పడాలి. దానిని విరిస్తే ‘టంగ్’ మని శబ్దం రావాలి. అప్పుడే పల్లి పట్టి కరకరలాడుతూ వస్తుంది. పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి పల్లీలను వేగంగా కలపాలి. ప్లేట్‌కు ముందుగానే ఆయిల్ రాసి పెట్టుకోవాలి. మిశ్రమాన్ని వేసిన తర్వాత ఒక వెడల్పాటి గిన్నె అడుగున ఆయిల్ రాసి దానితో ఒత్తడం వల్ల చిక్కీ సమానంగా వస్తుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే గాట్లు పెట్టుకుంటే చల్లారిన తర్వాత ముక్కలు సులభంగా విడిపోతాయి.

ప్రయోజనాలు ఇవే..
బెల్లంతో చేసే ఈ చిక్కీలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఒక చిక్కీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి పల్లిపట్టి కేవలం రుచికరమైన స్వీట్ మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి ఒక గొప్ప పవర్ హౌస్ వంటిది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పల్లి పట్టిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే మహిళలకు, గర్భిణీలకు ఇది ఒక అద్భుతమైన ఆహారం.

వేరుశెనగలో ప్రోటీన్లు, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. నీరసంగా ఉన్నప్పుడు లేదా వర్కవుట్స్ తర్వాత చిన్న పల్లి పట్టి ముక్క తిన్నా శరీరానికి కావాల్సిన ఇన్స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. వేరుశెనగలో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇది గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో తోడ్పడుతుంది. బెల్లంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, వేరుశెనగలోని మినరల్స్ ఎముకలను దృఢంగా మారుస్తాయి. పెరిగే పిల్లలకు ఇది అవసరమైన పోషకాలను అందిస్తుంది. వేరుశెనగలో ‘నియాసిన్’ (విటమిన్ B3) అధికంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా, జ్ఞాపకశక్తిని పెంచడానికి, అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి సహాయపడుతుంది. పల్లీలలో పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఇవి చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి.

పల్లి పట్టిలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇందులో కేలరీలు, చక్కెర (బెల్లం) కూడా ఎక్కువే. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు లేదా మధుమేహం ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవడం మంచిది. రోజుకు ఒకటి లేదా రెండు చిన్న ముక్కలు తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం అని నిపుణులు చెబుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో, ఎంతో రుచికరమైన ఈ స్నాక్‌ను మీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

READ ALSO: Tanvir Ahmed: టీమిండియాలోకి వైభవ్ వస్తే అభిషేక్ శర్మ పని ఖేల్ ఖతం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

Exit mobile version