Leftover Sweets Kulfi Recipe: దీపావళి పండుగ అయిపోయిందా? ఇంట్లో బోలెడన్ని మిఠాయిలు (Sweets) మిగిలిపోయాయా? వాటిని అలాగే తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే అస్సలు టెన్షన్ పడకండి! ఇంట్లో మిగిలిపోయిన దీపావళి మిఠాయిలతో (Diwali Sweets) చాలా ఈజీగా, అద్దిరిపోయే రుచితో కుల్ఫీ (Kulfi) తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ (Recipe) చాలా సింపుల్. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు (Ingredients):
మిగిలిపోయిన మిఠాయిలు (Leftover Sweets): 1 కప్
పాలు (Milk): 3 కప్పులు
సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ (Dry Fruits): 1/2 కప్
పంచదార (Sugar): 2 స్పూన్లు
యాలకుల పొడి (Cardamom Powder): 1/2 స్పూన్
తయారీ విధానం (Preparation Method):
అన్నింటికంటే ముందు మిగిలిపోయిన మిఠాయిలన్నింటినీ ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, చేతులతో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని, అందులో ఒక కప్పు పాలు, ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న మిఠాయిలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం ఎంతో స్మూత్‌గా రావాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి, మిగిలిన పాలను పోసి మరిగించాలి. పాలు బాగా మరుగుతున్నప్పుడు అందులో పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి మరో కొద్దిసేపు ఉడికించాలి. సుమారు 5 నుంచి 7 నిమిషాల తర్వాత, మనం ముందుగా మిక్సీ పట్టుకుని రెడీ చేసుకున్న మిఠాయి-పాల మిశ్రమాన్ని ఇందులో కలపాలి.
అన్ని పదార్థాలు బాగా కలిసేలా గరిటెతో తిప్పుతూ కొద్దిసేపు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా చల్లారనివ్వాలి. మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, దీన్ని కుల్ఫీ మౌల్డ్స్ (Kulfi Moulds) లేదా అచ్చులలో పోసి గట్టిగా మూత పెట్టాలి. ఆ తర్వాత వీటిని ఫ్రీజర్‌లో (Freezer) 6 నుంచి 8 గంటల పాటు లేదా కుల్ఫీ బాగా గడ్డకట్టే వరకు ఉంచాలి. కుల్ఫీ చక్కగా గడ్డకట్టిన తర్వాత ఫ్రీజర్ నుంచి బయటకు తీసి, మౌల్డ్స్ నుంచి వేరు చేసి చల్లచల్లగా సర్వ్ (Serve) చేయాలి. అంతేండి! దీపావళికి మిగిలిపోయిన మిఠాయిలతో ఎంతో టేస్టీగా ఉండే హోమ్మేడ్ కుల్ఫీ క్షణాల్లో రెడీ అయిపోతుంది. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పనే లేదు, మిఠాయిలు కూడా వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి.

