Green Moong Dal Laddu: ఫిట్‌నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..

Healthy Green Moong Dry Fruit Laddu

Healthy Green Moong Dry Fruit Laddu

Healthy Moong Dal Dry Fruit Laddu Recipe: భోజనం తర్వాత కాస్త తియ్యగా ఏదైనా తింటేనే ఆ మజాయే వేరు. కానీ ఫిట్‌నెస్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో చాలామంది స్వీట్లకు దూరంగా ఉంటారు. ఒకవేళ మీకు తీపి తినాలనిపించినా, మైదా, పంచదార, బెల్లం వంటివి వద్దు అనుకుంటే పచ్చి పెసరపప్పు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే ఈ హెల్దీ లడ్డూలను హ్యాపీగా ట్రై చేయవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ముందుగానే చేసి ఎయిర్‌టైట్ బాక్స్‌లో నిల్వ చేసుకుంటే, సాయంత్రం వేళ ఆకలి వేసినప్పుడు చక్కటి హెల్దీ స్నాక్‌లా లాగించేయవచ్చు. ఈ లడ్డూల ప్రత్యేకత ఏంటంటే వీటి తయారీలో రిఫైండ్ షుగర్ లేదా బెల్లం అసలు వాడము. ఖర్జూరం, కిస్మిస్ సహజమైన తీపిని ఇస్తాయి. అలాగే పెసరపప్పు, డ్రై ఫ్రూట్స్, గింజలు లడ్డూకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. పచ్చి పెసరపప్పులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, వేర్వేరు గింజల ద్వారా శరీరానికి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్, విటమిన్లు అందుతాయి. మరి ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:
పచ్చి పెసరపప్పు – 1 కప్పు (కడిగి 5-6 గంటలు నానబెట్టింది)
బాదం – పావు కప్పు
జీడిపప్పు – పావు కప్పు
వాల్‌నట్స్ – పావు కప్పు
పిస్తా – 2 టేబుల్ స్పూన్లు
గుమ్మడి గింజలు – 2 టేబుల్ స్పూన్లు
పొద్దుతిరుగుడు గింజలు (సన్‌ఫ్లవర్ సీడ్స్) – 2 టేబుల్ స్పూన్లు
చియా గింజలు – 1 టేబుల్ స్పూన్
వేయించిన అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) – 1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి – అర టీస్పూన్
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
కిస్మిస్ – పావు కప్పు
ఖర్జూరం – 8 నుంచి 10 (గింజలు తీసేసి చిన్న ముక్కలుగా తరిగినవి)

తయారీ విధానం:
మొదట నానబెట్టిన పచ్చి పెసరపప్పులో నీళ్లు పూర్తిగా వంపేయాలి. ఆ పప్పును ఒక శుభ్రమైన కాటన్ గుడ్డపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టాలి, తద్వారా అదనపు తేమ పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, నూనె లేదా నెయ్యి వేయకుండానే పచ్చి పెసరపప్పును సన్నని మంటపై వేయించాలి. పప్పు రంగు తేలికపాటి గోధుమ రంగులోకి మారి మంచి సువాసన వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. వేయించిన పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు అదే పాన్ లో బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తా, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలను వేసి తేలికగా వేయించుకోవాలి. మంట ఎక్కువగా పెడితే డ్రై ఫ్రూట్స్ మాడిపోతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇవి చల్లారిన తర్వాత కొద్దిగా బరకగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే పాన్‌లో రెండు చెంచాల దేశీ నెయ్యి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన ఖర్జూరం, కిస్మిస్ వేసి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. దీనివల్ల ఖర్జూరం, కిస్మిస్ మెత్తబడి మిశ్రమం ఒకదానికొకటి చక్కగా కలిసిపోతుంది.

ఇప్పుడు అందులో బరకగా పట్టుకున్న పెసరపప్పు పొడి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల గింజలు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. ఈ లడ్డూలు పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్‌టైట్ డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఇలా చేస్తే ఎలాంటి రసాయనాలు, పంచదార లేని ఆరోగ్యకరమైన గ్రీన్ మూంగ్ డ్రై ఫ్రూట్ లడ్డూలు సిద్ధమవుతాయి. ఈ లడ్డూల్లో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో తీపి కోసం ఎక్కడా షుగర్ లేదా బెల్లం జోడించలేదు. కేవలం ఖర్జూరం, కిస్మిస్ ద్వారా వచ్చే నేచురల్ స్వీట్‌నెస్ వీటికి అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఒకవేళ మీరు అస్సలు తీపి లేకుండా లడ్డూలు చేయాలనుకుంటే ఖర్జూరం, కిస్మిస్‌లను పూర్తిగా పక్కన పెట్టేయవచ్చు.