Fast Food Side Effects: పళ్ల సమస్యల నుంచి క్యాన్సర్ వరకు.. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం.. నిపుణుల హెచ్చరిక

Fast Food Side Effects

Fast Food Side Effects

Fast Food Side Effects: ఫాస్ట్ ఫుడ్ కేవలం కడుపు ఆరోగ్యానికే కాకుండా దంతాలు, నోటి ఆరోగ్యానికి కూడా తీవ్ర హాని కలిగిస్తుందని దంత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, యువతలో బర్గర్లు, పిజ్జాలు వంటి ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరగడంతో దంత సమస్యలు కూడా అధికమవుతున్నాయని వైద్యు నిపుణులు చెబుతున్నారు.. ఫాస్ట్ ఫుడ్‌లో ఉండే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు నోటిలోకి చేరిన వెంటనే ఆమ్లాలుగా మారి పళ్లపై ఉండే రక్షణ పొరను దెబ్బతీస్తాయి. అంతేకాకుండా ఫాస్ట్ ఫుడ్‌లోని కొన్ని భాగాలు పళ్ల మధ్య ఇరుక్కుపోవడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగి దంత క్షయం, చిగుళ్ల వ్యాధులకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

ఫాస్ట్ ఫుడ్‌లో అధికంగా ఉండే సోడియం శరీరంలోని కాల్షియం స్థాయిలను తగ్గించి పళ్లను బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలకు తరచుగా ఫాస్ట్ ఫుడ్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలు కేవలం పళ్లకే పరిమితం కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటిలో పెరిగే హానికరమైన బ్యాక్టీరియా రక్తప్రవాహం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో నోటి క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చని తెలిపారు.

×
×
Ad

చిగుళ్ల నుంచి రక్తస్రావం, నిరంతర పంటి నొప్పి, నోటిలో తెల్లటి మచ్చలు, తగ్గని నోటి పుండ్లు, నాలుక రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, ప్రతిరోజూ ఫ్లాస్ ఉపయోగించడం, తీపి పదార్థాలను తగ్గించడం, ముఖ్యంగా రాత్రిపూట తినకుండా ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా సమస్య కనిపించిన వెంటనే వైద్య సలహా తీసుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు..