Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి

Janthikalu

Janthikalu

Janthikalu Recipe: సాయంత్రం కాగానే టీ తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అలాగే టీకి పక్కన ఏదైనా స్నాక్ ఉంటే బాగుంటుంది కాదూ.. అలా కోరుకునే వాళ్లకు ఎంతో క్రిస్పీగా, కారంగా జంతికలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ఈ చక్రాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఇంట్లో చేసుకోవడం వల్ల మన రుచికి తగినట్లుగా మసాలాలను సర్దుబాటు చేసుకోవచ్చు. వీటిని తయారుచేసి గాలి తగలని డబ్బాలో (ఎయిర్ టైట్ కంటైనర్) స్టోర్ చేసుకుంటే కొన్ని రోజుల పాటు హ్యాపీగా తినవచ్చు.

కావలసిన పదార్థాలు:

శనగపిండి – 2 కప్పులు
బియ్యప్పిండి – 1 కప్పు
కారం – 1 టీస్పూన్
పసుపు – ¼ టీస్పూన్
వాము – ½ టీస్పూన్
నువ్వులు – 1 టేబుల్ స్పూన్
నెయ్యి లేదా వేడి నూనె (మోయన్ కోసం) – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – పిండి కలపడానికి సరిపడా
నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, నువ్వులు, వాము, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నెయ్యి లేదా వేడి నూనె వేసి, పిండికి బాగా పట్టేలా చేతులతో బాగా మర్దనా చేయాలి. దీనివల్ల జంతికలు ఎంతో క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మృదువైన పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ లూజ్‌గా ఉంటే జంతికల ఆకారం సరిగ్గా రాదు, కాబట్టి సరైన పదార్థంలో కలుపుకుని కాసేపు మూతపెట్టి పక్కన ఉంచాలి. ఇప్పుడు చక్రాల గిద్దలలో స్టార్ ఆకారం (నక్షత్రం ఆకారం) ఉన్న ప్లేట్‌ను అమర్చి, అందులో సిద్ధం చేసుకున్న పిండి ముద్దను ఉంచాలి. ఒక ప్లాస్టిక్ షీట్ లేదా బటర్ పేపర్ పై తేలికగా నూనె రాసి, చక్రాల గిద్దల సహాయంతో గుండ్రటి ఆకారంలో చక్రాలు ఒత్తుకోవాలి. చక్రాలు విరిగిపోకుండా ఒకే పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి.

బాణలిలో నూనె పోసి మధ్యస్థ మంటపై వేడి చేయాలి. నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలా ఉంటే చక్రాలు పైన త్వరగా రంగు మారిపోయి లోపల పచ్చిగా ఉండిపోతాయి. నూనె వేడెక్కిన తర్వాత ఒత్తుకున్న చక్రాలను జాగ్రత్తగా నూనెలో వేసి, రెండు వైపులా దొరగా, బంగారు రంగులోకి వచ్చి క్రిస్పీగా మారే వరకు వేయించాలి. కాల్చిన చక్రాలను ఒక టిష్యూ పేపర్‌పైకి తీసుకుంటే అదనపు నూనెను అది పీల్చేస్తుంది. చక్రాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో భద్రపరుచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రుచికరమైన జంతికలను ఎంచక్కా తినొచ్చు.